హైదరాబాద్: మెడిసిన్ పీజీ సీట్ల భర్తీలో కొత్త వివాదం రాజుకుంది. పీజీ ప్రవేశపరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులంతా తెలంగాణలోని వైద్య కళాశాలల్లో చేరుతుండటంతో ఈ ప్రాంత విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 500 సీట్లను భర్తీ చేయగా, అందులో సగానికిపైగా ఏపీ విద్యార్థులే ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో సగానికి పైగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్యవిద్య అధికారులు మాత్రం ఈ విషయంలో తామేమీ చేయలేమని, రాష్ట్ర పునర్విభజన బిల్లులోని 10వ షెడ్యూల్‌లో వృత్తి విద్యా ప్రవేశాలను పొందుపరిచారని అంటున్నారు. అందులో భాగంగా ఎంబీబీఎస్ విద్యను తెలంగాణలో అభ్యసించిన ఏపీ విద్యార్థులంతా స్థానికులుగా పరిగణలోకి వస్తారని స్పష్టం చేశారు.
నేటి నుంచి మళ్లీ మెడికల్ పీజీ కౌన్సెలింగ్ : వివాదాస్పదమైన పీజీ మెడిసిన్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియను ఆదివారం నుంచి మళ్లీ ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ పుట్టా శ్రీనివాస్ తెలిపారు. 48 గంటల్లో అన్ని సీట్లను భర్తీ చేయడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు జూలై 10 నుంచి తరగతులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ కళాశాలల వైపే సీమాంధ్ర విద్యార్థుల మొగ్గు
Published Sun, Jun 29 2014 12:21 PM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM
Advertisement