రాష్ట్రాన్ని రెండుగా ముక్కలు చేయడాన్ని సమైక్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఎన్జీవోలతోపాటు పలు ఉద్యోగ సంఘాల జేఏసీలు సమైక్యాంధ్ర పరిరక్షణకు మద్దతు ప్రకటిస్తూ సమ్మె చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలో పాలుపంచుకుంటూ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళుతున్నారు. సమైక్య రాష్ట్రం కోసం ప్రభుత్వం ప్రకటించిన ‘ఎస్మా’ను కూడా లెక్కచేయ బోమని స్పష్టం చేస్తున్నారు.
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర కోసం ఇరవై రోజుల నుంచి ఉధృతంగా జరుగుతున్న ఆందోళనలు సెలవురోజైన ఆదివారం కూడా అదే రీతిలో కొనసాగాయి. రోజుకో రకంగా వినూత్నరీతిలో నిరసన తెలుపుతూ.. సమైక్యతే మా నినాదం అంటున్నారు. జగ్గయ్యపేటలో ఎన్జీవో జేఏసీ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. రాష్ట్ర విభజన యోచనను కాంగ్రెస్ సర్కార్ మానుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉధయభాను సతీమణి విమలభాను ఆధ్వర్యంలో మహిళలు ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. ఆర్టీసీ ఉద్యోగులు బస్టాండ్ ఆవరణలో వంటావార్పు నిర్వహించి ఆటలాడారు.
పెనుగంచిప్రోలులో వైఎస్సార్ సీపీ చేపట్టిన దీక్షలు ఏడో రోజుకు చేరాయి. ఆళ్లూరుపాడు, వత్సవాయి గ్రామస్తులు ర్యాలీలు నిర్వహించారు. నందిగామలో ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నేతలు గాంధీ సెంటర్‌లో రోడ్లను శుభ్రంచేసి నిరసన తెలిపారు. లాండ్రీ యూనియన్, రజక సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన జరిపారు. చల్లపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఆర్‌ఎంపీ డాక్టర్లు, వైద్య సిబ్బంది, మెడికల్‌షాపుల యజమానులు, సిబ్బంది రామానగరం నుంచి చల్లపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. అవనిగడ్డలో ముస్లిం సోదరులు దీక్షలు చేశారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు మద్దతు తెలిపారు.
తిరువూరులో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. విస్సన్నపేటలో ఆర్యవైశ్య కల్యాణమండపం వద్ద వాసవీ క్లబ్‌ల ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. గంపలగూడెంలో టీడీపీ రిలే నిరాహారదీక్షలు ప్రారంభించింది. మచిలీపట్నంలో మునిసిపల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరింది. మండవల్లిలో ఎనిమిదో రోజు దీక్షలో బోయిన అర్చన అనే రెండేళ్ల చిన్నారి కూర్చుంది. గుడివాడ-భీమవరం జాతీయ రహదారిపై వంటలు వండి రోడ్లపైనే భోజనం చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సెంటర్‌లో నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి.
పామర్రులో వీరాంజ నేయ తాపీ వర్కర్స్ యూనియన్, విశ్వకర్మ కార్పెంటర్స్, ఎస్సీ కార్పొరేషన్ సభ్యులు, ఫొటోగ్రఫీ, విడియోగ్రఫీ వర్కర్స్, పెయింటర్స్, రిక్షా వర్కర్స్ యూనియన్, జేఏసీ సభ్యులు , ఏపీఎన్జీవో అసోసియేషన్ సభ్యులు, పంచాయతీరాజ్ శాఖ ఎంప్లాయిస్ మినిస్టీరియల్ అసోసియేషన్ సభ్యులు, పామర్రు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల ఆధ్వర్యంలో పామర్రు నాలుగురోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించారు. పెడనలో మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, టీచర్లు, ప్రభుత్వ టీచర్లు, వివిధ సంఘాల నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలుపుతూ రిలే నిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ సంఘీభావం ప్రకటించారు. పెడన టైలరింగ్ అసోసియేషన్ నాయకులు 216 జాతీయ రహదారిపై బంటుమిల్లి చౌరస్తాలో దుస్తులు కుడుతూ వినూత్న నిరసన తెలిపారు.
బెజవాడలో..
విజయవాడలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన బీఆర్‌టీఎస్ రోడ్డులో మోకాళ్లపై నిలబడి క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఐఎంఏ వైద్యులు దీక్షాశిబిరం ఏర్పాటు చేశారు. కృష్ణలంక ముస్లిం యూత్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కేసర్ ఇమ్రాన్ మస్‌జిద్ కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు నిరాహారదీక్షలు చేశారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు మానవహారంగా ఏర్పడ్డారు. వంటలు వండి రోడ్డుపై భోజనాలు చేస్తూ నిరసనలు తెలిపారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద నుంచి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కంకిపాడులో సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజూ కొనసాగాయి.
తెలుగు యువత ఆధ్వర్యంలో యువత కోలవెన్ను గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ పడమట సురేష్‌బాబు ఆధ్వర్యాన ఈడుపుగల్లు సెంటరులో వసతిగృహ విద్యార్థులు జాతీయ రహదారిపై భోజనం చేసి నిరసన తెలియచేశారు. కానూరులో వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు దీక్షలను కొనసాగించారు. పోరంకిలో నిర్వహించిన దీక్షల్లో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావులు సమైక్యాంధ్రపై చర్చ నిర్వహించారు.
సకలం సమైక్యం
Published Mon, Aug 19 2013 12:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
Advertisement
Advertisement