
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన దుర్గగుడి ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. రాబోయే ఆరునెలల్లో సిబ్బంది సమ్మెలు, ధర్నాలు చేయకుండా ఈచట్టం అడ్డుకుంటుంది. అత్యవసర సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల సమ్మెలపై ఉపయోగించాల్సిన ఈ చట్టాన్ని దుర్గగుడి సిబ్బందిపై ప్రయోగించడం చర్చనీయాశంగా మారింది. దేవాలయంలోని కేశఖండనశాల, విద్యుత్, మంచినీటి సరఫరా, వైద్యం, అన్నదానం, ట్రాన్స్‌పోర్టు, పారిశుధ్యం, ఆలయ నిర్వహణ విభాగాల్లో సిబ్బంది నమ్మెలో పాల్గొనడాన్ని నిషేధిస్తూ తొలిసారిగా ఈ చట్టం ప్రభుత్వం ప్రయోగించింది. కమిషన్ కాకుండా కనీస వేతనం ఇవ్వమంటూ నాయీ బ్రాహ్మణులు ఇటీవల రోడ్డెక్కిన విషయం విధితమే. అయితే అప్పటికప్పుడు వారు రోడ్డెక్కలేదు. నిబంధనల మేరకు ముందుగా నోటీసు ఇచ్చిన తరువాతనే సమ్మె చేశారు. కనీస వేతనాలు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కోరి ఆయన ఆగ్రహాన్ని నాయి బ్రాహ్మణులు చవిచూశారు. అది చాలదన్నట్లు వారికి ఇప్పుడు ప్రభుత్వం బహుమతిగా ఎస్మా చట్టాన్ని ఇచ్చింది. ఇక నుంచి తమ ఆవేదనను చెప్పుకోకుండా గొంతు నొక్కేసింది.
కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా....
దేవస్థానంలో సుమారు 250 మంది రెండు దశాబ్దాలుగా తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 19 మంది న్యాయస్థానానికి వెళ్లగా హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు వీరిని పర్మినెంట్ చేసే విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. చివరికి తమ నిరసనలు తెలిపే అవకాశం లేకుండా చేయడం సరికాదంటున్నారు. ఇటు సిబ్బందికీ, భక్తులకు అటు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేయాల్సిన దేవస్థానం పాలకమండలి పూర్తిగా విఫలమైంది. పాలకమండలిని పట్టించుకోకుండా ప్రభుత్వం ఇప్పుడు ఎస్మాచట్టం ప్రయోగించింది. ఆరునెలలు ముగిసే ముందు మరో ఆరునెలలు వరకు ఈ చట్టాన్ని పొడిగించి ఎన్నికల్లో వ్యతిరేకత లేకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment