ఇది మొదటిసారి కాదా? | Durga Temple Ticket Scam Reveals | Sakshi
Sakshi News home page

ఇది మొదటిసారి కాదా?

Published Mon, Feb 4 2019 1:40 PM | Last Updated on Mon, Feb 4 2019 1:40 PM

Durga Temple Ticket Scam Reveals - Sakshi

త్రిలోక్‌ జారీ చేసిన యాక్సెస్‌ కార్డు, (ఇన్‌సెట్‌లో) కనీ కనిపించని విధంగా బార్‌కోడ్‌ కింద ముద్రించిన సీరియల్‌ నంబర్‌

దుర్గగుడిలో దర్శనం టికెట్ల స్కాంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా బయట పడటం ఇదే ప్రథమం కాదని, గతంలోనూ పలుమార్లు టికెట్ల స్కాంను గుర్తించినా.. పూర్వపు ఈవోలు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి.  తాజా ఉదంతంలో కేవలం కౌంటర్‌లో టికెట్లను విక్రయించిన సిబ్బందే కాకుండా టికెట్లను స్కానింగ్‌ చేసే సిబ్బందితో పాటు త్రిలోక్‌ సంస్థకు చెందిన ఐటీ టెక్నీషియన్‌ కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) : దుర్గగుడి టికెట్ల స్కాంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఘటనపై దుర్గగుడి ఈవో వి. కోటేశ్వరమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఘాట్‌ రోడ్డు కౌంటర్‌ నుంచే టికెట్లు జారీ
దుర్గగుడి ఘాట్‌ రోడ్డుతో పాటు మహా మండపం వద్ద రూ. 300, రూ.100 టికెట్లు విక్రయించే కౌంటర్లను త్రిలోక్‌ సంస్థ నిర్వహిస్తోంది. శనివారం మధ్యాహ్నం ఘాట్‌ రోడ్డులోని కౌంటర్‌ నుంచే టికెట్లను విక్రయించినట్లు ఆలయ ఈవో విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. కేవలం ఘాట్‌ రోడ్డులోని కౌంటర్‌లోనే ఈ తరహా అక్రమాలకు పా         ల్పడ్డారా.. లేక మిగిలిన కౌంటర్లలోనూ ఈ తరహా అక్రమాలు జరిగాయా అనే దిశగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.

అంతా కలిసే చేశారా..!
తాజా ఘటనలో కేవలం కౌంటర్‌లో టికెట్లు విక్రయించిన సిబ్బంది పాత్ర మాత్రమే ఉందనుకునే వీలులేదని పలువులు వ్యాఖ్యానిస్తున్నారు. కౌంటర్‌లో విక్రయించిన టికెట్లను అమ్మవారి ఆలయం చిన్న గాలి గోపురం వద్ద ఉన్న స్కానింగ్‌ కౌంటర్‌ వద్ద స్కాన్‌ చేశారు. ప్రతి కార్డుకు ఇచ్చిన బార్‌కోడ్‌ స్కాన్‌ చేసినప్పుడు కంప్యూటర్‌లో ఆ కార్డు వివరాలు సరిపోల్చుతాయి. అయితే స్కానింగ్‌లోని సిబ్బంది ఈ విషయాన్ని గమనించలేదా..? లేక స్కానింగ్‌ కౌంటర్‌లో సిబ్బంది టికెట్ల విషయం తెలిసి.. కావాలని తప్పించారా? అనేది తేలాల్సి ఉంది. కౌంటర్‌లో పని చేసే సిబ్బంది, టికెట్లు స్కానింగ్‌ చేసే సిబ్బంది ఇద్దరు త్రిలోక్‌ వారు నియమించిన వారు కావడంతో ఇటువంటి అక్రమాలు బయటకు రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

సీరియల్‌ నంబర్‌ను గుర్తించేది ఏలా..?
రూ. 100, రూ.300 టికెట్ల యాక్సిస్‌ కార్డులపై ముద్రించే బార్‌ కోడ్‌ కింద సీరియల్‌ నంబర్‌ సృష్టంగా లేకపోవడమే అక్రమాలకు ఆస్కారం కల్పించిందన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి యాక్సెస్‌ కార్డుకు ఒక గుర్తింపు నంబర్‌ ఉంటుంది. యాక్సెస్‌ కార్డుపై ముద్రించే బార్‌ కోడ్‌ కింద ఆ రోజు విక్రయించిన టికెట్ల సీరియల్‌ నంబర్‌ను ముద్రిస్తారు. అయితే టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు యాక్సిస్‌ కార్డుపై ఉన్న నంబర్‌ను మాత్రమే గమనిస్తుంటారు. అయితే ఇదే స్లిప్‌పై చిన్నవిగా ఉన్న సీరియల్‌ నంబర్‌ కింద మరో మారు తేదీ, నెల, ఏడాదిని కూడా ముద్రిస్తున్నారు. ఈ సీరియల్‌ నంబర్లను గుర్తించ వీలు లేకపోవడమే ఇటువంటి అక్రమాలను అటు భక్తులు కానీ, ఆలయ అధికారులు గానీ గుర్తించే అవకాశం లేకుండా పోతున్నారు. 

టికెట్ల జారీ ఇకదేవస్థాన సిబ్బందితోనేనా?
రూ. 100, రూ. 300 టికెట్ల కౌంటర్లను నిర్వహించే బాధ్యత ఇక దేవస్థానం తీసుకోనున్నట్లు సమాచారం. శుక్రవారం టికెట్ల స్కాం బయట పడిన వెంటనే ఆలయ ఈవో వి. కోటేశ్వరమ్మ త్రిలోక్‌ అధికారులతో సమావేశమై వెంటనే కౌంటర్ల నిర్వహణ నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఒకటి రెండు రోజులలో నగదు లెక్కల వివరాలను దేవస్థానానికి అప్పగించిన తర్వాత కౌంటర్లలో వ్యవహారం తేలే అవకాశాలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement