104, 108 ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్న మంత్రి విడదల రజిని
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో 108, 104 ఉద్యోగులు సమ్మె యోచనను విరమించుకున్నారు. 108, 104 ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం గుంటూరులో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ నెల 22 నుంచి జరపతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు గుర్తింపు, గౌరవం: మంత్రి రజిని
ఈ చర్చల్లో ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి రజిని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు తగిన గుర్తింపు, గౌరవం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే దక్కాయని వివరించారు. 108, 104 వాహనాల ఉద్యోగులను ఆప్కాస్‌లో చేర్చాలనే వినతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజిపైనా ప్రతిపాదనలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు కోరుతున్నవాటిలో ప్రధానమైన శ్లాబ్ పద్ధతిని వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా క్రమం తప్పకుండా ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 104, 108 ఉద్యోగుల జీతాలను సమయానికి ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. ఇకపై కూడా ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగులందరికీ జీతాలు అందేలా కృషి చేస్తామన్నారు.
సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 104, 108 వ్యవస్థను, వాహనాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఈ విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏ సమస్యలు రానీయరని తెలిపారు. అత్యవసర సేవలు అందించే విషయంలో 108 సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో గొప్పదని చెప్పారు. 104, 108 ఉద్యోగులకు అండగా ఉంటామని, ఏ సమస్యలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.
సీఎం జగన్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు ఎలా సేవ చేస్తోందో, ఉద్యోగులకు కూడా ఏ సమస్యలూ రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీలకు ఉద్యోగుల సంఘ నేతలు అంగీకరించారు. ఈ సమావేశంలో 108 ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎన్.మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.శ్రీనివాసరావు, 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఫణికుమార్, ఉపాధ్యక్షుడు రాంబాబు, అరబిందో సంస్థ నుంచి ఎంవీ సత్యనారాయణ, రాకేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment