Esma law
-
ఏపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం!
సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం తీసుకుంది. 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించింది. సమస్యల పరిష్కారం కోసం గతనెలలో ప్రభుత్వానికి 104 ఉద్యోగులు సమ్మె నోటీసులు జారీ చేశారు. ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. ఈ తరుణంలో రేపు కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరాహార దీక్షకు పిలుపు నిచ్చారు. అయితే, 104 ఉద్యోగుల దీక్ష నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలేమిటీ ఎస్మా చట్టం? దీనికి ఉన్న విస్తృతి ఏమిటి? ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుంది తదితర అంశాలు పరిశీలిస్తే..‘ఎస్మా’ అనేది ‘ఎసెన్సియల్ సర్వీసెస్ మెయిన్‌టీనెన్స్ యాక్ట్’కు సంక్షిప్త రూపం. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే.. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది.కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు కోరుతూ.. 1980లలో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికి పోయింది. ఆ మరుసటి ఏడాది కార్మిక సంఘాలు ఏకంగా పార్లమెంట్ ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చాయి. ఈ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ‘ఎస్మా’ ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో ‘ఎస్మా’ చట్టం చేసింది.ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినా.. దిగొచ్చనే బలమైన అనుమానం కలిగినా సరే.. పోలీసు అధికారులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్నవారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. -
‘ఎస్మా చట్టాలు సమ్మెను ఆపలేవు’
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఆటంకం కలిగించే విధంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సమస్యలపై, సంస్థ పరిరక్షణ కోసం సమ్మె నోటీసులు ఇచ్చిన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం ఎస్మా చట్టాలను బయటకు తెచ్చి ఆరునెలలు సమ్మె నిషేధమంటారని విమర్శించారు. ఈ మేరకు ఎపీఎస్ ఆర్టీసీ కార్మిల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు లేఖను విడుదల చేశారు. ఎస్మా చట్టాలు సమ్మెను ఆపలేవని, ఈనెల 20 తర్వాత ఎప్పుడైనా సమ్మె ఉండొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదనన్నారు. ఆర్టీసీ యాజమాన్య సిబ్బంది కుదింపుపై తీసుకున్న చర్యలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. కాగా ఏపీఎస్ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. మొత్తం 19 డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఇటీవల ఆర్టీసీ ఎండీకి అందించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది కుదింపు చర్యలు ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఎస్మా ప్రయోగించరా?
► వైద్యశాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం ► వైద్యులతో మంత్రి చర్చలు విఫలం ► 17వ రోజుకు చేరిన సమ్మె సాక్షి ప్రతినిధి, చెన్నై: వైద్యుల సమ్మెతో చికిత్స అందక రోగులు అల్లాడుతున్నారు, వైద్యులపై ఎస్మా చట్టాన్ని ఎందుకు ప్రయోగించలేదని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహించింది. కోర్టుకు రప్పించి మరీ పలు ప్రశ్నలతో నిలదీసింది. పీజీ కోర్సులో ప్రభుత్వ వైద్యులకు 50 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయరాదనే కోర్కెపై వైద్యులు గత నెల 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె జరుపుతున్నారు. శుక్రవారం నాటికి ఈ సమ్మె 17వ రోజుకు చేరుకోగా, ప్రభుత్వ వైద్యులు, హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్దులు సైతం సమ్మెకు దిగి వివిధ రీతుల్లో తమ నిరసనలు ప్రకటిస్తున్నారు. వైద్య మంత్రి విజయభాస్కర్ సమ్మె ప్రారంభంలో జరిపిన చర్చలు విఫలమైనాయి. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం సేవలు స్థంభించిపోయాయి. ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక అవస్థలు పడుతున్నారు. తిరువళ్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సైనికుడు సుబ్రమణి చికిత్స అందక గురువారం ప్రాణాలు విడవడం మరి విషాదంగా మారింది. కాగా రోగులు ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో కడలూరుకు చెందిన న్యాయవాది ఏకే వేలన్ శుక్రవారం కోర్టులో పిటిషన్ వేశారు. వైద్యుల సమ్మె వల్ల ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రి సేవలపైనే ఆధారపడి ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సైతం పడకేయడంతో గ్రామీణుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఈ పరిస్థితి ప్రజలకు రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన హక్కులను కాలరాయడమే అవుతుంది కాబట్టి వైద్యులు సమ్మెను విరమించుకునేలా వెంటనే ఆదేశించాలని పిటిషన్లో ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు కృపాకరన్, పార్దిబన్లతో కూడిన బెంచ్‌కు శుక్రవారం విచారణకు వచ్చింది. వైద్యల సమ్మె వల్ల ఆసుపత్రికి వచ్చి వెళ్లే, రోగులు, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు అవసరమైన చికిత కోసం ప్రభుత్వం ఏమీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది, వైద్యుల చేత సమ్మెను విరమింపజేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో సవివరమైన నివేదికతో శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటలకు కోర్టుకు హాజరుకావాలని డాక్టర్ రాధాకృష్ణన్‌ను న్యాయమూర్తులు ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్ హడావిడిగా వైద్యుల సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం కోర్టుకు హాజరైన కార్యదర్శి రాధాకృష్ణన్‌ను ఉద్దేశించి న్యాయమూర్తులు మాట్లాడుతూ, వైద్యుల సమ్మెను ముగించేందుకు ఎస్మా చట్టాన్ని ఎందుకు ప్రయోగించలేదని ప్రశ్నించారు. అత్యవసర సేవల ఉండేవారు విధులను బహిష్కరించిన పక్షంలో ఎస్మా చట్టం కింద అరెస్ట్ చేసి ఆరు నెలలపాటూ జైలుకు పంపవచ్చు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించి వైద్యులను రెచ్చగొట్టే ధైర్యం చేయలేక పోయింది. కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైద్యుల సమ్మె వల్ల రోగులు ఇబ్బంది పడకుండా తీసుకున్న చర్యలను కోర్టుకు వివరించానని చెప్పారు. చర్చల ద్వారా వైద్యుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని న్యాయమూర్తులు సూచించినట్లు తెలిపారు. డిమాండ్లపై ప్రభుత్వానికి వైద్యుల నుండి రెండువారాల గడువును కోరనున్నట్లు ఆయన చెప్పారు.