సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఆటంకం కలిగించే విధంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సమస్యలపై, సంస్థ పరిరక్షణ కోసం సమ్మె నోటీసులు ఇచ్చిన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం ఎస్మా చట్టాలను బయటకు తెచ్చి ఆరునెలలు సమ్మె నిషేధమంటారని విమర్శించారు. ఈ మేరకు ఎపీఎస్ ఆర్టీసీ కార్మిల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు లేఖను విడుదల చేశారు. ఎస్మా చట్టాలు సమ్మెను ఆపలేవని, ఈనెల 20 తర్వాత ఎప్పుడైనా సమ్మె ఉండొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదనన్నారు.
ఆర్టీసీ యాజమాన్య సిబ్బంది కుదింపుపై తీసుకున్న చర్యలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. కాగా ఏపీఎస్‌ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. మొత్తం 19 డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఇటీవల ఆర్టీసీ ఎండీకి అందించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది కుదింపు చర్యలు ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment