సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్ధమయ్యాయి. కార్మికసంఘాలు పోటాపోటీగా ఆర్టీసీ ఎండీ ఎన్వీ సురేంద్రబాబుకు సమ్మె నోటీసులు అందించనున్నాయి. బుధవారం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) నాయకులు ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందించారు. ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి నేతృత్వంలో ఆ యూనియన్ నాయకులు సమ్మెకు సిద్ధమని ప్రకటించారు. మొత్తం 19 డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఎండీకి అందించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది కుదింపు చర్యలు ఆపేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీకి ఉన్న అప్పులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈక్విటీ కింద మార్పు చేయాలని, ఎంవీ ట్యాక్స్‌ను పదేళ్ల పాటు హాలిడే ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) గురువారం ఎండీకి మరోసారి సమ్మె నోటీసు ఇవ్వనుంది. గతంలో ఈయూ సమ్మె నోటీసిచ్చిన సందర్భంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో చర్చలు జరిపి సమ్మె నోటీసును ఉపసంహరించుకున్నారు.
ఆర్టీసీ సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు ప్రకటించింది. గత నవంబర్‌లో ఎంప్లాయీస్ యూనియన్‌తో ఆర్టీసీ యాజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయడంలో విఫలమైందని పేర్కొంది. ఈయూ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ.. సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అన్ని యూనియన్లు కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఏప్రిల్ 5వ తేదీలోపు ఇవ్వాల్సిన బకాయిలను, క్రెడిట్ సొసైటీకి చెల్లించాల్సిన రూ. 250 కోట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒప్పందాన్ని అమలు చేయడానికి ఎన్నికల నిబంధనావళి అడ్డంగా ఉందని ఆర్టీసీ ఎండీ చెప్పడం సరికాదన్నారు. కార్మికులు సమ్మెకు దిగితే అందుకు ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ఈయూ అధ్యక్షుడు వైవీ రావు, కార్యదర్శి పి.దామోదరరావు తదితరులు ప్రసంగించారు.
సమ్మెకు రెడీ..!
Published Thu, May 9 2019 4:48 AM | Last Updated on Thu, May 9 2019 9:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment