4 వేలమంది డాక్టర్ల సమ్మె.. రోగులకు ఇక్కట్లు
ముంబై: మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 వేలమంది వైద్యులు.. ఇటీవల తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా సమ్మెకు దిగారు. తమకు భద్రత కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు.
వైద్యులు మెరుపు సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు స్తంభించిపోయాయి. రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సోమవారం ఉదయం ముంబైలోని సియోన్ ఆస్పత్రి ముందు సిబ్బంది భారీ సంఖ్యలో గుమికూడి నిరసన తెలిపారు. ముంబైలోని కేఈఎమ్ ఆస్పత్రి రోగుల కోసం అత్యవసర ఏర్పాట్లు చేసింది. రోగులకు ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆస్పత్రి డీన్ డాక్టర్ అవినాష్ సుపె చెప్పారు.
ఇటీవల దూలేలో ఆలస్యంగా వైద్యం చేశారనే కారణంతో రోగి బంధువులు ఓ వైద్యుడిపై దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తొమ్మిదిమందిని అరెస్ట్ చేశారు. అంతకుముందు మరో వైద్యుడిపై దాడి చేసినప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై మహారాష్ట్ర వైద్య శాఖ మంత్రి గిరీష్ మహాజన్ స్పందిస్తూ.. వైద్యులపై దాడి జరగడం దురదృష్టకరమని, నిందితులపై చర్యలు తీసుకుంటామని, వైద్యులకు మరింత భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పారు.