ఖర్మాస్పత్రులు | Doctors And medicine Shortage in Hospitals Anantapur | Sakshi
Sakshi News home page

ఖర్మాస్పత్రులు

Published Fri, Sep 7 2018 12:24 PM | Last Updated on Fri, Sep 7 2018 12:24 PM

Doctors And medicine Shortage in Hospitals Anantapur - Sakshi

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు లక్ష్మీదేవి. తలుపుల మండలంలోని భూపతివారిపల్లి స్వగ్రామం. జ్వరంతో బాధపడుతున్న ఆమె గురువారం ఉదయం 11 గంటలకు తలుపులలోని పీహెచ్‌సీకి రాగా.. పరీక్షించిన వైద్యుడు సెలైన్‌ ఎక్కించాలని సూచించారు. అయితే ఆస్పత్రిలో మంచాలు లేకపోవడంతో ఇదిగో ఇలా వరండాలోని అరుగుపై పడుకోబెట్టి సెలైన్‌ ఎక్కించారు. ఇలాంటి దృశ్యాలు ఇక్కడ సర్వసాధారణమని సిబ్బందే చెబుతున్నారు. 24 గంటలు పనిచేసే ఈ ఆస్పత్రిలో పనిచేసే వైద్యురాలు మెటర్నిటీ లీవ్‌లో వెళ్లిపోగా.. మరో పీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్‌ లక్ష్మీరాంను ఇక్కడ నియమించారు. ఆయన వారం రెండురోజులు మాత్రమే సేవలందిస్తున్నారు. ఏదైనా అత్యవసరమైతే 24 కి.మీ., దూరంలోని కదిరికి పరుగులు తీయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు.     – తలుపుల

అనంతపురం న్యూసిటీ: ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని పాలకులు చెబుతున్నా...ఆస్పత్రులు మాత్రం ఆ మేరకు సేవలందించలేకపోతున్నాయి. మందులు లేక..ఉన్నా వాటిని ఇచ్చే వారు లేక..మౌలిక సదుపాయాల కొరతతో రోగులకు నరకం చూపుతున్నాయి. సిరంజీలు మొదలుకుని కుక్కకాటు వ్యాధులకు కూడా మందుల లేకపోవడంతో రోగులు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రి, ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. బయోమెట్రిక్‌ అమలులో ఉన్నా... కొన్ని పీహెచ్‌సీల్లో(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులకు సకాలంలో వైద్య సేవలందడం లేదు. ఇక జిల్లాలోని స్టేట్‌ కేడర్లలో 281 పోస్టులు మంజూరైతే అం దులో 82 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక జోనల్‌ కేడర్‌కు సంబంధించి 825 పోస్టులకు గానూ 139 ఖాళీలున్నాయి. జిల్లా కేడర్‌కు సంబంధించి 2105 పోస్టులకుగానూ 682 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకే వైద్యం దైవాదీనంగా మారింది.

మందుల్లేవ్‌
అసలే సీజనల్‌ వ్యాధుల కాలం. డెంగీ, మలేరియా కేసులు అధిమకమయ్యాయి. జిల్లాలోని వివిధ పీహెచ్‌సీల్లో 164 మలేరియా, 66 డెంగీ కేసులునమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా.. పీహెచ్‌సీలే పెద్ద దిక్కు. అక్కడి వైద్యులిచ్చే నాలుగు గుళికలే ప్రాణం పోకుండా చూస్తాయి.  అటువంటిది ఆ మాత్రలు కూడా పీహెచ్‌సీల్లో అందుబాటులో లేని దుస్థితి. జ్వరానికిచ్చే పారాసీటమాల్‌ మాత్రలు కూడా చాలా ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవు. వృద్ధులు, మహిళలు, గాయాలపాలైన వారికి ఇచ్చే డైక్లోఫినాక్‌ మాత్రలు కూడా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. యాంటిబయాటిక్స్‌ మందులైన అమాక్సలిన్, అమాక్సిలిన్‌ క్వావినేట్‌ 625 ఎంజీ, సిఫ్రోప్లాక్సిన్‌ల గురించి చెప్పుకోకపోతేనే మేలు. పెంటా సోడియం, జెంటామైసిన్, బీ 12 ఇంజెక్షన్లు సరఫరా ఆగిపోయినా అడిగే వారు లేరు. ఇక కుక్కకరిస్తే వేయాల్సిన ఇమినోగ్లోబిలిన్‌ మందు చాలా పీహెచ్‌సీల్లో అందుబాటులో లేదు. 

వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లాలోని 87 పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రధానంగా పీహెచ్‌సీ వైద్యులు పూర్తిస్థాయిలో లేరు. 173 మెడికల్‌ ఆఫీసర్లలో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని కొట్టాలపల్లి, ముద్దినాయినపల్లి, విడపనకల్లు, బి.కౌకుంట్ల, ఎన్‌ఎస్‌ గేట్, కుందుర్పి, కృష్ణాపురంలో పీహెచ్‌సీల్లో వైద్యులు లేరు. దీంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇతర పీహెచ్‌సీల్లోని వైద్యులను సర్దుబాటు చేస్తున్నారు. 13 మంది సీనియర్‌ వైద్యులు పీజీ సీట్లు రావడంతో వెళ్లిపోయారు. ఇక 219 స్టాఫ్‌నర్సు పోస్టులకుగానూ 185 మంది మాత్రమే ఉన్నారు.  

స్టాఫ్‌నర్సుల అవస్థలు
మెడికల్‌ ఆఫీసర్‌ తర్వాత పీహెచ్‌సీలకు స్టాఫ్‌నర్సే పెద్దదిక్కు. అంతటి కీలకమైన స్టాఫ్‌ నర్సు పోస్టులు జిల్లాలోని 34 ఖాళీ ఉన్నాయి.  24 గంటలు పనిచేసే ఆస్పత్రులకు ముగ్గురు స్టాఫ్‌నర్సులుంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేసే పీహెచ్‌సీల్లో ఒక స్టాఫ్‌నర్సు మాత్రమే ఉంటారు. దీంతో వీరికి సెలవు పెద్ద సమస్యగా మారింది. కార్మిక చట్టం ప్రకారం 40 గంటలు పని చేసి తర్వాత కచ్చితంగా సెలవు ఇవ్వాలి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. అందుకే హెల్త్‌ అసిస్టెంట్లను బతిమాలుకుని సెలవు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.   

మెరుగైన సేవలందిస్తాం  
రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలందిస్తాం. పీహెచ్‌సీల్లో  వైద్యుల సమస్య లేకుండా సర్దుబాటు చేశాం. త్వరలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు ఉన్నతాధికారుల అనుమతితో భర్తీ చేస్తాం. కొందరు పీజీ చదివేందుకు వెళ్లారు. జిల్లాలో ఎక్కడా మందుల కొరత రానివ్వకుండా చర్యలు తీసుకుంటా. వైద్యులు సమయపాలన పాటించాల్సిందే. సిబ్బంది కొరత సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.  – కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్,జిల్లా వైద్యాధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement