గుంటూరు వైద్య కళాశాల (ఫైల్)
గుంటూరు మెడికల్: ఎందరో ఆణిముత్యం లాంటి వైద్యులను ప్రపంచానికి అందించిన ఘనత కలిగిన గుంటూరు వైద్య కళాశాలను నేడు బోధనా సిబ్బంది కొరత పట్టి పీడిస్తోంది. కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో రోగుల సంఖ్యకు సరిపడా వైద్యులు లేక వైద్యసేవల్లో జాప్యం ఏర్పడి అవస్థలు పడుతున్నారు.
గుంటూరు వైద్య కళాశాల ప్రారంభంలో 1946లో తొలి బ్యాచ్‌లో కేవలం 50 మంది ఎంబీబీఎస్ వైద్య విద్యార్ధులు ఉండగా 1960 నాటికి 150 మందికి పెరిగారు. 2013–14 విద్యా సంవత్సరంలో గుంటూరు వైద్యకళాశాలకు 50 సీట్లు అదనంగా వచ్చి ప్రస్తుతం ఏడాదికి 200 మంది వైద్య విద్యార్థులు ఉంటున్నారు. 2018–19 వ సంవత్సరానికి కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. నీట్ ఫలితాలు కూడా ప్రకటించడంతో వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్య విభాగాలన్నీ కలిపి 32 వరకు జీజీహెచ్‌లో, వైద్య కళాశాలలో ఉన్నాయి. పీజీ సీట్లు 100 ఉండగా, ఏడాదికి వంద మందికి పైగా పారామెడికల్ కోర్సులను అభ్యసిస్తున్నారు. వీరందరికీ బోధన చేసేందుకు కళాశాలలో 66 మంది ప్రొఫెసర్లు, 47 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 195 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ పోస్టుల్లో చాలావరకు ఖాళీగా ఉండడంతో బోధన అంతంత మాత్రంగానే జరుగుతుందన్న విమర్శలు లేకపోలేదు. ప్రొఫెసర్స్ ఏడు పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్స్ 6, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 30 పోస్టులు మొత్తం 43 వైద్యుల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.
200 సీట్లకు సరిపడా వైద్యులు లేరు
భారత వైద్య మండలి(ఎంసీఐ) నిబంధనల ప్రకారం గుంటూరు వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది లేరు. అయినప్పటికీ ప్రతి ఏడాది ఎంసీఐ తనిఖీల సమయంలో బోధనా సిబ్బంది ఉన్నట్టుగా రికార్డుల్లో చూపిస్తూ ఇతర వైద్య కళాశాలల నుంచి బోధనా సిబ్బందిని గుంటూరుకు తీసుకొచ్చి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. దీనివల్ల వైద్య కళాశాలలో చేరిన వైద్య విద్యార్థులు నాణ్యమైన బోధన లభించక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఖాళీగా ఉన్న 43 సీట్లను భర్తీ చేయటంతో పాటుగా తక్షణమే పెరిగిన వైద్య సీట్లుకు అనుగుణంగా 50 బోధనా సిబ్బంది పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. విద్యార్థులు సైతం తరగతి గదుల్లో కూర్చునేందుకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తరగతి గదులు 125 మంది మాత్రమే కూర్చునేందుకు సరిపోయేలా నిర్మాణం చేశారు. ప్రస్తుతం 200 మంది ఉండడంతో కొంతమంది ఇరుక్కుని కూర్చుని లేదా నిలబడే క్లాసులు వినాల్సి వస్తోంది. తరగతి గదుల్లో గాలి, వెలుతురు ప్రసరణ సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు క్లాస్‌రూమ్‌లో బ్లాక్‌బోర్డు చాలా దూరంగా ఉండి కంటి సమస్యలు వస్తున్నట్టు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. మంచినీటి సౌకర్యాలు, మరుగుదొడ్డి సౌకర్యాలు సరిపడా లేక వైద్య విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
రోగులకూ తప్పని ఇక్కట్లు...
గుంటూరు వైద్య కళాశాలకు అనుబంధంగా గుంటూరు జీజీహెచ్ ఉంది. ఓపీలో వైద్యసేవలకు ప్రతిరోజూ ఏడు జిల్లాల నుంచి నాలుగువేల మంది రోగులు వస్తుంటారు. వీరికి సరిపడా వైద్యులు లేక రోగులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆస్పత్రిలో 15 వైద్య యూనిట్లను పెంచాల్సి ఉంది. ఒక్కో యూనిట్‌లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను మంజూరుచేయాల్సి ఉంది. యూనిట్స్ పెంపుదల రెండేళ్లుగా కాగితాలపైనే ఉండడంతో రోగులకు వైద్యసేవల్లో జాప్యం వాటిల్లి ప్రాణాలు పోయి ఆందోళనలు చేసిన సంఘటనలు సైతం జీజీహెచ్‌లో తరచుగా చోటుచేసుకుంటున్నాయి. నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు వైద్య కళాశాల ఉండటంతో ఈ కళాశాలలో పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది నియామకాలతో పాటు వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment