బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులు
అమరావతి రాజధాని కేంద్రం. నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటి అనేక కార్యక్రమాలతో నిత్యం వీవీఐపీలు, వీఐపీల తాకిడి. ఇక్కడే సీఎం నివాసం..పోలీసు శాఖకు చేతినిండా పని.. క్షణం తీరిక లేకుండా డ్యూటీలు. ఎప్పుడు ఎవరు వస్తారో.. ఎవరు వెళతారో తెలియదు. అప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేయాలి. ఇలా టెన్షన్ టెన్షన్. జిల్లాలో సిబ్బందిని చూస్తే అంతంతమాత్రం. ఇంకేముంది.. దొంగలు, నేరగాళ్లకు ఇదే అదను. అందుకే రెచ్చిపోతున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సిబ్బందిని పెంచండి మహాప్రభో అని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా పట్టించుకున్న దాఖలాలు మాత్రం లేవు.
సాక్షి, గుంటూరు: రాజధాని నేపథ్యంలో గత మూడున్నరేళ్లుగా గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో పోలీసులు పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాజధాని నేపథ్యంలో ట్రాఫిక్ పెరిగిపోవడం, వరుసగా వీవీఐపీల పర్యటనలు, జిల్లా కేంద్రంగా నిత్యం కొనసాగుతున్న ఆందోళనలతో గందరగోళంగా మారింది. అయితే అందుకు తగినట్లుగా సిబ్బంది పెరగకపోవడం, ఉన్న సిబ్బంది బందోబస్తులకు భద్రతలకే సరిపోతుండటంతో నేరాల నియంత్రణకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు పెరిగిపోవడం.. రౌడీషీటర్లు రెచ్చిపోతున్నా వారిపై నిరంతర నిఘా పెట్టే వెసులుబాటు లేక నేరాలను సైతం నియంత్రించలేని పరిస్థితి తలెత్తుతుంది. రాజధాని ప్రకటన తరువాత గుంటూరు అర్బన్ జిల్లాను ప్రత్యేక పోలీసు కమిషనరేట్‌గా ఏర్పాటు చేస్తారనే వాదనలు వినిపించినప్పటికీ మూడున్నరేళ్లు దాటుతున్నా ఆ దిశగా ప్రభుత్వం కనీస ఆలోచన కూడా చేయని పరిస్థితి.
అటకెక్కిన పోలీసు ప్రతిపాదనలు
గుంటూరు అర్బన్ జిల్లాతోపాటు రూరల్ జిల్లా పరిధిలోని అమరావతి, తుళ్లూరు పోలీసు స్టేషన్‌లను కలిపి ప్రత్యేక పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన అప్పటి అర్బన్‌ఎస్పీ రాజేష్‌కుమార్ ప్రభుత్వానికి పంపినప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుత అర్బన్ ఎస్పీ సీహెచ్.విజయరావు సైతం గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో కొత్త పోలీసు స్టేషన్‌ల ఏర్పాటు, అర్బన్ జిల్లా పరిధిలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్‌లను ఏగ్రేడ్‌గా అప్‌గ్రేడ్ చేయాలని ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్‌గ్రేడ్ చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న సిబ్బందికి తోడు, రెట్టింపు సిబ్బంది వస్తారనేది ఎస్పీ ఆలోచన. అయితే ఈ ప్రతిపాదనలన్ని అటకెక్కాయే తప్ప ఏ ఒక్కటి ఆచరణకు నోచుకోకపోవడంతో సిబ్బంది కొరతతో పోలీసు ఉన్నతాధికారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూడు సెక్టార్లుగా విభజన
గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో వరుస బందోబస్తులు, వీవీఐపీల భధ్రత, నిత్యం జరుగుతున్న ఆందోళనలు వంటివి పోలీసులకు సవాల్‌గా మారాయి. అవినీతి పోలీసు అధికారులపై నిఘా కూడా కొరవడింది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని గుంటూరు అర్బన్ ఎస్పీ సీహెచ్.విజయారావు, పరిపాలన సౌలభ్యం కోసం అర్బన్ జిల్లా పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్‌లన్నింటిని మూడు సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్‌కు ఓ ఎస్సైకు బాధ్యతలు అప్పగించి నేర పరిశోధన, బందోబస్తులు, ఆందోళనలు, ఎదుర్కొనే బాధ్యతలను విభజించారు. ఉన్న సిబ్బందిని ముగ్గురు ఎస్సైలకు సమానంగా ఇచ్చి వారికి కేటాయించిన బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సిబ్బంది కొరతను అధిగమించేందుకే
గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో రాజధాని నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బందిపై పనిభారం పెరిగిన మాట వాస్తవమే. దీంతో కొత్తపోలీసు స్టేషన్‌లు ఏర్పాటు చేయడంతోపాటు, అన్ని పోలీసు స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయాలని డీజీపీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వీలైనంత త్వరగా సిబ్బంది రిక్రూట్‌మెంట్‌ను కొనసాగించాలని కోరాం. అప్పటి వరకు సిబ్బంది కొరత అధిగమించేందుకు ఒక్కో పోలీసు స్టేషన్‌ను మూడు సెక్టార్లుగా విభజించి నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్య, బందోబస్తులు, ఆందోళనలు వంటివాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. – అర్బన్ ఎస్పీ విజయరావు
Comments
Please login to add a commentAdd a comment