అగ్నికి ఆజ్యం | Staff Shortage in Fire Department | Sakshi
Sakshi News home page

అగ్నికి ఆజ్యం

Published Fri, Apr 19 2019 1:15 PM | Last Updated on Fri, Apr 19 2019 1:15 PM

Staff Shortage in Fire Department - Sakshi

రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకుంటూ కూర్చున్నాడట. మన రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అగ్నికి టీడీపీ సర్కారు నిర్లక్ష్యపు ఆజ్యం పోసింది. అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత ఉన్నా.. గత ఐదేళ్లుగా భర్తీకి చర్యలు తీసుకోలేదు. ఫైర్‌స్టేషన్ల ఏర్పాటునూ ప్రతిపాదనలకే పరిమితం చేసింది. ఫలితంగా జిల్లాలో ఏడాదిగా అగ్నిప్రమాదాల్లో రూ.14.13 కోట్ల ఆస్తినష్టం సంభవించగా, ఆరుగురు మృత్యువాత పడ్డారు. మొత్తుం 1,179 ప్రమాదాలు జరిగాయి.

పశ్చిమగోదావరి, కొవ్వూరు: జిల్లావ్యాప్తంగా అగ్నిమాపక కేంద్రాల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సర్కారు చొరవ చూపడం లేదు. కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటునూ పట్టించుకోలేదు. ఫలితంగా ఉన్న అగ్నిమాపక కేంద్రాలు చాలడం లేదు. కొన్ని కేంద్రాల పరిధి విస్తృతంగా ఉండడంతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి శకటాలు చేరుకోవడం ఆలస్యమవుతోంది. ఫలితంగా శకటాలు వెళ్లేలోగానే తీవ్ర నష్టం జరిగిపోతోంది. దీంతో కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది. ఈనెల 14 నుంచి అగ్నిమాపకశాఖ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ శాఖ దైన్యంపై కథనం.. 

ఇతర విపత్తుల నివారణలోనూ అగ్నిమాపక సిబ్బంది  
అగ్నిమాపక శాఖ అంటే ఒకప్పుడు కేవలం అగ్నిప్రమాదాల నివారణకే పరిమితం అయ్యేది. ఇప్పుడు అవసరాలు మారిపోయాయి. వరదలు, గోదావరి, కాలువలు, వాగుల్లో చిక్కుకున్నవారిని, మునిగిన వారిని కాపాడడంలోనూ అగ్నిమాపక శాఖ కీలకభూమిక పోషిస్తోంది. ప్రముఖ ఉత్సవాలు, జాతరలు వంటి వాటిల్లోనూ ఈ శాఖ సిబ్బంది సేవలందిస్తున్నారు. ఫలితంగా ఈ శాఖకుప్రాధాన్యం నెలకొంది. ఇంతటి కీలక శాఖలో సిబ్బంది    కొరతను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం.

ఐదేళ్లుగా నిర్లక్ష్యం
అగ్నిమాపక శాఖను టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా నిర్లక్ష్యం చేసింది. అగ్ని మాపక కేంద్రాలు అరకొర సిబ్బందితో నడుస్తున్నాయి.  ఉన్న సిబ్బందిపై పనిభారం ఎక్కువైంది. ఫలితంగా ప్రమాదాలను సకాలంలో నిలువరించలేక సిబ్బంది సతమతమవుతున్నారు. జిల్లాలో ఏడాదిగా అగ్నిప్రమాదాలు, వరదలు, వాగులు పొంగిన దుర్ఘటనల్లో 69 మృత్యువాత పడ్డారు. వీరిలో అగ్నిప్రమాదాల బారిన పడి ఆరుగురు చనిపోయారు.

79 పోస్టులు ఖాళీ
జిల్లా వ్యాప్తంగా 13 అగ్ని మాపక కేంద్రాలున్నాయి. కుక్కునూరులో తాత్కాలిక కేంద్రం ఉంది. అత్తిలి, తణుకు కేంద్రాల్లో అగ్ని మాపకాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్లు 49 మంది పనిచేయాల్సి ఉండగా కేవలం 35 మందే ఉన్నారు. 14 పోస్టుల భర్తీ లేదు.  ఫైర్‌మెన్స్‌ 175 మందికి గానూ కేవలం 112 మందే ఉన్నారు. 63 పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు.

15 మేజర్‌ ప్రమాదాలు
జిల్లాలో గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 15 పెద్ద ప్రమాదాలు సంభవించగా.. 74 మధ్యస్థ , 980 చిన్న ప్రమాదాలు జరిగాయి. రూ.10 లక్షల నుంచి రూ.25లక్షల వరకు నష్టం జరిగితే పెద్ద ప్రమాదాలగానూ, రూ.10 లక్షల లోపు నష్టం జరిగితే మధ్యస్త, రూ.2 లక్షల లోపు నష్టం వాటిల్లితే చిన్న ప్రమాదాలగానూ అధికారులు పరిగణిస్తారు. గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో మొత్తం రూ.14.13 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది.  

ప్రతిపాదనలతో సరి: జిల్లాలో దెందులూరు, గోపాలపురం, ఉంగుటూరు, పోలవరం, ఆచంట తదితర నియోజకవర్గ కేంద్రాల్లో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన కార్యరూపం దాల్చ లేదు. విలీన మండలమైన కుక్కునూరుతోపాటు నల్లజర్ల మండలంలోనూ అగ్నిమాపక కేంద్ర ఏర్పాటు కలగానే ఉంది.కుక్కునూరులో తాత్కాలిక కేంద్రం ఉన్నా ఫలితం శూన్యం.

పొగాకు బ్యారన్లకు నష్టం
ప్రధానంగా మెట్ట ప్రాంతమైన గోపాలపురం నియోజకవర్గంలో ఎప్పటి నుంచో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన ఉంది. ఈ ప్రాంతంలో వర్జినియా పొగాకు క్యూరింగ్‌ సమయంలో బ్యారెన్లు అగ్ని ప్రమాదాల బారిన పడితే రైతులు భారీగా నష్టపోతున్నారు. పైగా కొవ్వూరు నుంచి అగ్నిమాపక శకటం ఆప్రాంతానికి వెళ్లేసరికే తీవ్ర నష్టం జరిగిపోతోంది.  ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రమాదాలకూ కొవ్వూరు నుంచే అగ్నిమాపక శకటం వెళ్లాల్సి వస్తోంది. పోలవరం మండలంలో మారుమూల గ్రామాలు సుమారు యాభై కిలోమీటర్లకుపైగా దూరం ఉండడం వల్ల కొవ్వూరు నుంచి శకటం వెళ్లినా ప్రయోజనం ఉండడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలవరంలో అగ్ని మాపక కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించారు. కార్యరూపం దాల్చలేదు.

మూడు చోట్ల తాత్కాక భవనాలే
తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు అగ్నిమాపక కేంద్రాలు తాత్కాలిక భవనాల్లోనే నడుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో నూతన భవనాల నిర్మాణం కొలిక్కి రాలేదు. నిడదవోలులో రూ.1.10కోట్లతో, తణుకు, తాడేపల్లిగూడెంలో రూ.70లక్షలతో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. కుక్కునూరు, నల్లజర్లలో కేంద్రాల నిర్మాణానికి స్థలం సేకరించారు. భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. 

సిబ్బంది కొరత ఉంది
ప్రస్తుతం సిబ్బంది కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నాం. జిల్లాలో ఏడు చోట్ల కొత్త కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జిల్లాలో ఉన్న 11 రెçస్క్యూ బోట్లలో కేవలం ఆరు                  పనిచేస్తున్నాయి. ఇరుకైన ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు వినియోగించేందుకు ఏలూరు, భీమవరం, పాలకొల్లులో మిస్ట్‌ బుల్లెట్‌ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. తొమ్మిది మంది ప్రత్యేక శిక్షణ పొందిన టాస్క్‌ఫోర్సు బృందాన్ని ఏలూరులో అందుబాటులో ఉంచాం. మరో 16 మందితో రెస్క్యూ టీమ్‌ను అందుబాటులో పెట్టాం.  – ఏవీ శంకర్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement