తణుకులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నుంచి మంటలు చెలరేగుతున్న దృశ్యం
పశ్చిమగోదావరి, తణుకు: తణుకు నుంచి హైదరాబాదు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా కిందికి దిగిపోయారు. కనకదుర్గా ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 07 టీజే 3233 నంబరు కలిగిన బస్సు సుమారు 40 మంది ప్రయాణికులతో తణుకు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపం నుంచి ఆదివారం రాత్రి బయల్దేరింది. ఇటీవల సంక్రాంతి పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆన్‌లైన్ యాప్ ద్వారా తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు హైదరాబాదుకు టెక్కెట్లు బుక్ చేసుకున్నారు.
ఆదివారం రాత్రి ప్రయాణికులందరూ బస్సు ఎక్కాక 8.30 గంటల ప్రాంతంలో బయలుదేరుతుండగా బాయ్‌నెట్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుంచి కిందికి దిగిపోయారు. స్థానికులు మంటలను అదుపు చేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై కారణాలు తెలియాల్సి ఉంది. తణుకు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment