తణుకులో అగ్ని ప్రమాదం; 50 ఇళ్లు దగ్ధం | Fire Accidentt In Tanuku 50 Houses Destroyed | Sakshi
Sakshi News home page

పేద బతుకులు ‘బుగ్గి’

Published Mon, Oct 21 2019 11:01 AM | Last Updated on Mon, Oct 21 2019 11:01 AM

Fire Accidentt In Tanuku 50 Houses Destroyed - Sakshi

సాక్షి,తణుకు(పశ్చిమగోదావరి):  తణుకు సజ్జాపురంలోని మల్లికాసులపేటలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చెలరేగిన మంటలు దాదాపు 2 గంటలపాటు విలయతాండం చేశాయి. నివాసితులంతా ఎక్కువ సంఖ్యలో చర్చికి వెళ్లడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సుమారు 50 ఇళ్లు కాలిబూడిదవ్వడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. మంటలతో పలు ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయాయి. సిలిండర్ల శకలాలు 2 కిలోమీటర్లు దాటి పడటం తణుకు వాసులను భయబ్రాంతులకు గురిచేసింది. మంటలు మర లా మరలా విజృంభించి మొత్తం చుట్టేశాయి. తణుకులోని సజ్జాపురంలో  రైల్వేగేటు, జాతీయ రహదారి వంతెన ప్రాంతానికి సమీపంలో ఉండే మల్లికాసులపేటలో సుమారుగా వెయ్యి గజాల ప్రాంతంలో ఇంటికి మరో ఇల్లు చేర్చి ఉండే పరిస్థితి ఉంది. నాలుగు స్తంభాలు మీద షెడ్డు నిర్మాణం చేసి బరకాలే గోడలుగా ఏర్పాటుచేసుకుని ఈ పేదవర్గాలు నివాసం ఉంటున్నాయి.  

స్వయంశక్తితో బతికేవాళ్లు
సుమారు 50 ఏళ్లుగా అదే ప్రాంతంలో నివాసముంటున్న వీరంతా స్వయంశక్తితో బతికే పేదవర్గాలు. ఇంటింటికీ తిరిగి సోఫాలు కుట్టడం, ఫినాయిల్, యాసిడ్‌ అమ్మడం, ప్లాస్టిక్‌ పూలు, వ్యర్థాలతో ఫ్లవర్‌వాజ్‌లు తయారు చేసి అమ్ము కుంటూ ఆడ, మగా జీవనం సాగిస్తున్నారు.

4 ఫైర్‌ ఇంజన్‌లు.. 3 వాటర్‌ ట్యాంకులు  
తణుకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కొంతమేర వీరు మం టలు అదుపుచేసినా మరలా మంటలు పెరిగాయి. ఇళ్ల మధ్యకు వాహనం రాలేని పరిస్థితుల్లో జాతీయ రహదారి పైనుంచి నీరు చిమ్ముతూ మంటలను అదుపుచేశారు. మంటల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో  తాడేపల్లిగూడెం, అత్తిలి, ఏలూరు అగ్నిమాపక వాహనాలు ఇక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశాయి.

స్పందించిన అధికార యంత్రాంగం
తహసీల్దార్‌ ప్రసాద్‌ తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ముందుగా 10 కేజీల బి య్యం, ఆర్థిక సాయంగా రూ.5 వేలు ప్రభుత్వం నుంచి అందచేసినట్లు తెలిపారు. నిత్యావసరాల కొనుగోలు కోసం కలెక్టర్‌ నుంచి రావాల్సిన రూ.2 వేలు సాయం సోమవారం అందచేస్తామని చెప్పారు. ఇళ్ల మధ్యకు అగ్నిమాపక వాహనం వెళ్లలేని పరిస్థితుల్లో తణుకు మునిసిపల్‌ కమిషనర్‌ జి.సాంబశివరావు మూడు వాట ర్‌ ట్యాంకులను పంపించి మంటలను అదుపుచేయించారు. మునిసిపల్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సజ్జాపురం యువకులు మంటలను ఆర్పడంలో సాయపడ్డారు.

రూ.5 లక్షలు సాయం ఇవ్వాలి
తణుకు: అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన 73 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి పీవీ ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకులు గార రంగారావు, కె.నాగరత్నంతో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన బాధితులను పరామర్శించారు. బాధితులకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలని కోరారు.  

కట్టుబట్టలే మిగిలాయ్‌
నా కొడుకు ఇంటికి ఇప్పటివరకు కరెంటులేదు. నిన్నే రూ.10 వేలు అప్పుచేసి మరీ కరెంటు పెట్టించాం. ఇంకా లైటు కూడా వెలిగించలేదు. అగ్నికి మొత్తం ఇల్లంతా కాలిబూడిదయ్యింది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం.   
–సంగం రంగమ్మ, బాధితురాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement