తహసీల్దార్ కార్యాలయంలో ఒకేఒక్కడు
సిబ్బంది లేక ఇబ్బంది
అవస్థలు పడుతున్న ప్రజలు
గండేడ్ : మండల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది లేక ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్‌రావు కార్యాలయ బాధ్యతలు నిర్వహిస్తూ అదనపు బాధ్యతలు కూడా నిర్వహించకతప్పడం లేదు. తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహల్దార్, ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్, ఏఎస్‌ఓ, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ల అవసరం ఉంటుంది. కానీ మూడు నెలల క్రితం డిప్యూటీ తహసీల్దార్ భరత్‌గౌడ్ కార్యాలయ పనుల విషయంలో సస్పెండ్ కాగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుగుణమ్మ మెడికల్ లివ్ తీసుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ నరేంద్‌రెడ్డి ప్రమోషన్‌పై శిక్షణకు వెళ్లగా, ఏఎస్‌ఓ పోస్టు ఖాళీ ఉంది. సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రెవెన్యూ కార్యాలయంలో ఎలాంటి పనులు చేయాలన్నా అధికారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.