మేల్ వార్డులో ఇతనొక్కడే ..
ఇక్కడ పంచకర్మ విధానంలో అందించే వైద్యం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఆర్థితవాతం (ఏదైనా ఒక భాగానికి వచ్చే పక్షవాతం), సెరిబ్రెల్ అటాక్సియా (బుద్ధిమాంధ్యం గల వారికి), ఒబెసిటీ (ఊబకాయం), ఆమవాతం (కీళ్లనొప్పులు), శిరోధార, శిరోవస్థి (వివిధ రకాల తలనొప్పులు),అభ్యంగ నాడీశ్వేదం(శరీరంలోని అనేక/వివిధ భాగాలకు వచ్చే పక్షవాతం) ఇలాంటివి ఎన్నోరకాల రోగాలకు ఇక్కడ మసాజ్ ద్వారా సేవలు అందిస్తున్నారు. అల్లోపతి ద్వారా నయంకాని, లేదా నయం అయినట్టు అనిపించి మళ్లీ వచ్చే రోగాలను కొద్ది రోజుల్లోనే ఇక్కడ శాస్వతంగానయం చేస్తున్నారు.
వెంగళరావునగర్: అల్లోపతికి లొంగని మొండి రోగాలు సైతం ఆ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యానికి నయమైపోతున్నాయి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయంకాని పక్షవాత రోగులు కూడా ఇక్కడి సేవలకు చిరునవ్వుతో తిరిగి వెళుతున్నారు. ఇక లాభంలేదు.. ఈ రోగంతో ప్రాణాలు పోవడం ఖాయమని జీవితంపై ఆశలు వదులుకున్న వారు సైతం ఇక్కడి అద్భుతమైన వైద్య సేవలకు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వెళుతున్నారు. అదే వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల. ఇక్కడ అన్నీ ఉచితంగానే అందిస్తున్నారు. వైద్యులు సైతం రోగులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ రోగంపై పూర్తి పరిశోధన చేసి మరీ వైద్యం చేస్తున్నారు. ఎటొచ్చీ సరిపడినంత మంది కింది స్థాయి సిబ్బంది లేక రోగులకు సమయానికి సేవలు అందించలేకపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడి ‘పంచకర్మ విభాగం’లో సరిపడినంత మంది మసాజిస్టులు లేక ప్రతి రోజూ కొందరు రోగులు వైద్యం పొందకుండానే వెనుదిరిగే పరిస్థితి నెలకొంది.
‘పంచకర్మ’కు రోగుల తాకిడి
ఆయుర్వేద ఆస్పత్రిలోని పంచకర్మ వైద్యానికి ఎంతో పేరుంది. ఎలాంటి దీర్ఘకాలిక, మొండి రోగాలనైనా అద్భుతంగా నయం చేస్తున్నారు. పక్షవాతం, కీళ్ల నొప్పులు, పూట్టుకతో వచ్చిన సెరిబ్రెల్ ఫాల్సీ వంటి రోగులకు మసాజ్ చేయాలి. పూర్తిస్థాయిలో పనిముట్లు ఉన్నా ఇక్కడ సిబ్బంది లేక రోగుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆయుర్వేద వైద్యశాల మసాజ్ సెంటర్‌లోని పురుషుల వార్డులో కేవలం ఒక్క మసాజిస్టు మాత్రమే సేవలందిస్తున్నాడు. ముగ్గురు చేయాల్సిన పని ఆ ఒక్కడిపైనే పడుతోంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ సెంటర్ తెరిచే ఉంటుంది. దాదాపు 35 మంది వరకు దీర్ఘకాలిక రోగాలతో బాధపడే రోగులకు మసాజ్ చేస్తుంటారు. ఇదంతా ఒకే ఒక్క మసాజిస్టు చేస్తున్నాడు. అయినప్పటికీ మరో 10 నుంచి 20 మంది సేవలు పొందకుండా వెనుదిరగాల్సిన పరిస్థితి. ఎంతో ఘన చరిత్ర ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో పదేళ్లుగా వైద్యులు, సిబ్బంది కొరత వెంటాడుతోంది. చివరకు మసాజిస్టులను సైతం నియమించడంలేదు. ప్రభుత్వం నియామకాలు చేపట్టని కారణంగా రోగులకు సేవలు అందక.. ఎంతో గొప్ప పేరున్న ఆస్పత్రి ప్రతిష్ట మసరబారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తేడా స్పష్టంగా తెలుస్తోంది
మా బాబుకు నెలరోజుల నుంచి ఇక్కడనే వైద్యం చేయిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం మసాజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినా నయం కాలేదు. ఇక్కడకు వచ్చాక మా బాబుకు స్పష్టంగా తేడా కనిపిస్తుంది. పూర్తిగా నడవలేని పరిస్థితి నుంచి ఆసరాగా నడుస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పూర్తిగా నయం అవుతుందని నమ్మకం వచ్చింది.
– భీమార్జున, భీమవరం (ఆంధ్రప్రదేశ్)
సిబ్బంది సరిపోవడం లేదు
మా అన్నయ్యకు పక్షవాతం వచ్చింది. ఖమ్మం, విజయవాడల్లో ఎన్నో ఆస్పత్రులు తిప్పాం. ఏడాది అయినా ఎలాంటి లాభం లేదు. ఇక్కడకు తీసుకొచ్చాను, ఒకవైపు మసాజ్, రెండోవైపు సైకిల్ తొక్కడం, ట్రెడ్‌మిల్ ద్వారా నడిపించడం తదితర ఫిజియోథెరపీలు చేయించారు. నెలన్నరలో స్వయంగా నడుస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఇంత సేవలు అందించే మసాజ్ సెంటర్‌లో చాలినంతమంది సిబ్బంది లేరు.– లక్ష్మి, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment