Ayurvedic Hospital
-
అటెండరే వైద్యుడు!
విశాఖపట్నం, డుంబ్రిగుడ (అరకులోయ) : మండల కేంద్రంలో ఉన్న ఆయుర్వేద వైద్యశాలలో వైద్యాధికారి లేకపోవడంతో వైద్యశాలలో అటెండరే వైద్యాధికారిగా అవతారమెత్తుతున్నారు. రెండేళ్ల నుంచి వైద్యాధికారి లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాంపౌండర్ కూడా బదిలీపై వెళ్లిపోవడంతో ఇప్పటి వరకు ఆస్పత్రి అటెండర్‌తోనే నడుస్తుంది. కీళ్ల నొప్పులు, వివిధ వ్యాధులపై మందులు ఇచ్చేందుకు ఎవరూ లేక మందులు సక్రమంగా అందడం లేదని స్థానికులు అంటున్నారు. ఇక్కడి అధికారి బదిలీపై వెళ్లిపోగా, అంటెండర్‌కు మందులపై అవగాహన లేకపోవడంతో రోగులు ఆస్పత్రికి వచ్చి మందులు లేకుండా తిరుగుముఖం పడుతున్నారు. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యా«ధికారిని నియమించాలని గిరిజనులు కోరుతున్నారు. -
కానిస్టేబుల్ దుశ్చర్యపై స్పందించిన ఝా
సాక్షి, హైదరాబాద్ : చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రి తరలింపుకు నిరసనగా ఆందోళన చేపట్టిన విద్యార్థినిపై ఓ పోలీసు కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. సౌత్ జోన్ డీసీసీ అంబర్ కిషోర్ ఝా స్పందించారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి తరలింపును నిరసిస్తూ ఆందోళన చేయడంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే అక్కడ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించాడని వార్తలు వస్తున్నాయని చెప్పారు. వీడియోలు పరిశీలించి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే కానిస్టేబుల్ అది ఉద్దేశపూర్వకంగా చేశారా, లేక విధి నిర్వహణలో భాగంగా అలా జరిగిందా అనే దానిపై విచారణ జరిపి చర్యలు చేపడతామని వెల్లడించారు. ఆ వీడియోలను టీవీల్లో ప్రసారం చేయకుండా తాత్కాలికంగా నిలపివేయాలని కోరారు. విద్యార్థులు ఆందోళన చేసేటప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. చదండి : విద్యార్థినిపై పోలీసు వికృత చర్య.. -
విద్యార్థినిపై పోలీసు వికృత చర్య..
సాక్షి, హైదరాబాద్ : చార్మినార్ ఆయుర్వేద హాస్పిటల్ తరలింపుకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. యునానీ వారే కావాలని హాస్పిటల్‌ను అక్కడి నుంచి ఎర్రగడ్డకు తరలిస్తున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అందుకు నిరసనగా చార్మినార్ ఎదుట విద్యార్థులు, టీచర్లు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను, లెక్చరర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు మాత్రం వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రెచ్చిపోయిన మానవమృగం.. ధర్నా చేస్తున్న విద్యార్థినిలను మహిళ పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ఇదే అదనుగా భావించిన ఒక వ్యక్తి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను తాకరాని చోట తాకడమే కాకుండా.. గట్టిగా గిల్లాడు. దీంతో సదురు విద్యార్థిని నొప్పి భరించలేక గట్టిగా అరిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని ఓ పోలీసు కానిస్టేబుల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై మహిళ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
సిబ్బంది లేక ఇబ్బంది
ఇక్కడ పంచకర్మ విధానంలో అందించే వైద్యం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఆర్థితవాతం (ఏదైనా ఒక భాగానికి వచ్చే పక్షవాతం), సెరిబ్రెల్ అటాక్సియా (బుద్ధిమాంధ్యం గల వారికి), ఒబెసిటీ (ఊబకాయం), ఆమవాతం (కీళ్లనొప్పులు), శిరోధార, శిరోవస్థి (వివిధ రకాల తలనొప్పులు),అభ్యంగ నాడీశ్వేదం(శరీరంలోని అనేక/వివిధ భాగాలకు వచ్చే పక్షవాతం) ఇలాంటివి ఎన్నోరకాల రోగాలకు ఇక్కడ మసాజ్ ద్వారా సేవలు అందిస్తున్నారు. అల్లోపతి ద్వారా నయంకాని, లేదా నయం అయినట్టు అనిపించి మళ్లీ వచ్చే రోగాలను కొద్ది రోజుల్లోనే ఇక్కడ శాస్వతంగానయం చేస్తున్నారు. వెంగళరావునగర్: అల్లోపతికి లొంగని మొండి రోగాలు సైతం ఆ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యానికి నయమైపోతున్నాయి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయంకాని పక్షవాత రోగులు కూడా ఇక్కడి సేవలకు చిరునవ్వుతో తిరిగి వెళుతున్నారు. ఇక లాభంలేదు.. ఈ రోగంతో ప్రాణాలు పోవడం ఖాయమని జీవితంపై ఆశలు వదులుకున్న వారు సైతం ఇక్కడి అద్భుతమైన వైద్య సేవలకు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వెళుతున్నారు. అదే వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల. ఇక్కడ అన్నీ ఉచితంగానే అందిస్తున్నారు. వైద్యులు సైతం రోగులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ రోగంపై పూర్తి పరిశోధన చేసి మరీ వైద్యం చేస్తున్నారు. ఎటొచ్చీ సరిపడినంత మంది కింది స్థాయి సిబ్బంది లేక రోగులకు సమయానికి సేవలు అందించలేకపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడి ‘పంచకర్మ విభాగం’లో సరిపడినంత మంది మసాజిస్టులు లేక ప్రతి రోజూ కొందరు రోగులు వైద్యం పొందకుండానే వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. ‘పంచకర్మ’కు రోగుల తాకిడి ఆయుర్వేద ఆస్పత్రిలోని పంచకర్మ వైద్యానికి ఎంతో పేరుంది. ఎలాంటి దీర్ఘకాలిక, మొండి రోగాలనైనా అద్భుతంగా నయం చేస్తున్నారు. పక్షవాతం, కీళ్ల నొప్పులు, పూట్టుకతో వచ్చిన సెరిబ్రెల్ ఫాల్సీ వంటి రోగులకు మసాజ్ చేయాలి. పూర్తిస్థాయిలో పనిముట్లు ఉన్నా ఇక్కడ సిబ్బంది లేక రోగుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆయుర్వేద వైద్యశాల మసాజ్ సెంటర్లోని పురుషుల వార్డులో కేవలం ఒక్క మసాజిస్టు మాత్రమే సేవలందిస్తున్నాడు. ముగ్గురు చేయాల్సిన పని ఆ ఒక్కడిపైనే పడుతోంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ సెంటర్ తెరిచే ఉంటుంది. దాదాపు 35 మంది వరకు దీర్ఘకాలిక రోగాలతో బాధపడే రోగులకు మసాజ్ చేస్తుంటారు. ఇదంతా ఒకే ఒక్క మసాజిస్టు చేస్తున్నాడు. అయినప్పటికీ మరో 10 నుంచి 20 మంది సేవలు పొందకుండా వెనుదిరగాల్సిన పరిస్థితి. ఎంతో ఘన చరిత్ర ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో పదేళ్లుగా వైద్యులు, సిబ్బంది కొరత వెంటాడుతోంది. చివరకు మసాజిస్టులను సైతం నియమించడంలేదు. ప్రభుత్వం నియామకాలు చేపట్టని కారణంగా రోగులకు సేవలు అందక.. ఎంతో గొప్ప పేరున్న ఆస్పత్రి ప్రతిష్ట మసరబారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తేడా స్పష్టంగా తెలుస్తోంది మా బాబుకు నెలరోజుల నుంచి ఇక్కడనే వైద్యం చేయిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం మసాజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినా నయం కాలేదు. ఇక్కడకు వచ్చాక మా బాబుకు స్పష్టంగా తేడా కనిపిస్తుంది. పూర్తిగా నడవలేని పరిస్థితి నుంచి ఆసరాగా నడుస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పూర్తిగా నయం అవుతుందని నమ్మకం వచ్చింది. – భీమార్జున, భీమవరం (ఆంధ్రప్రదేశ్) సిబ్బంది సరిపోవడం లేదు మా అన్నయ్యకు పక్షవాతం వచ్చింది. ఖమ్మం, విజయవాడల్లో ఎన్నో ఆస్పత్రులు తిప్పాం. ఏడాది అయినా ఎలాంటి లాభం లేదు. ఇక్కడకు తీసుకొచ్చాను, ఒకవైపు మసాజ్, రెండోవైపు సైకిల్ తొక్కడం, ట్రెడ్మిల్ ద్వారా నడిపించడం తదితర ఫిజియోథెరపీలు చేయించారు. నెలన్నరలో స్వయంగా నడుస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఇంత సేవలు అందించే మసాజ్ సెంటర్లో చాలినంతమంది సిబ్బంది లేరు.– లక్ష్మి, ఖమ్మం -
ఆయు'ని'ర్వేదం
జిల్లాలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలు దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మందులు లేక రోగులు, జీతాలు అందక సిబ్బంది నిర్వేదంలో కూరుకుపోతున్నారు. పైగా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా వైద్యుల పోస్టులు భర్తీ చేయడం లేదు. జిల్లాలో 92 వైద్యశాలల్లోనూ ఏదో సమస్య. దీంతో ఆయర్వేద కేంద్రాల ఆయుష్ గాల్లో దీపంలా మారింది. – పెరవలి: జిల్లాలో 92 వైద్యశాలల్లోనూ రెగ్యులర్ ఆసుపత్రులు 49. ఎన్ఆర్హెచ్ఎం పథకం ద్వారా మండల కేంద్రాలలో పీహెచ్‌సీల వద్ద ఏర్పాటు చేసినవి మరో 43 ఉన్నాయి. మండలాల్లో ఏర్పాటు చేసిన వాటిలో నాలుగేళ్లుగా డాక్టర్లే లేకపోవటంతో రోగులు నానా అగచాట్లు పడుతున్నారు. ప్రస్తుతం పలుచోట్ల నర్సులే వైద్యసేవలు అందిస్తున్నారు. ఆయుర్వేద ఆసుపత్రులను మండల కేంద్రాల్లో 2009లో ప్రారంభించారు. అన్ని ఆసుపత్రులలో వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించారు. వీరు చేస్తోన్న సేవలకు ప్రజల్లో మంచి స్పందన రావటంతో ప్రభుత్వం వీరందరినీ పర్మినెంట్ చేసింది. అయితే కాలక్రమంలో బదిలీలు వంటి కారణాలతో ఖాళీ అయిన వైద్యుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీంతో వైద్యశాలలు వెలవెలబోతున్నాయి. ఉద్యోగ భద్రత కరువై.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టు సిబ్బంది అవస్థలు చెప్పలేని విధంగా మారాయి. ఉద్యోగం ఉంటుందో లేదో తెలియక అభద్రతా భావంతో విధులు నిర్వహిస్తున్నారు. మందులు సరఫరా సక్రమంగా చేయకపోవటంతో ఉన్న మందులతోనే రోగులకు సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం ఈ ఆసుపత్రులను స్థానిక పీహెచ్సీ డాక్టర్ ఆధీనంలో ఉంచాలని ఆదేశాలు ఇవ్వటంతో సమస్య మొదలైంది. సెలవు తీసుకోవాలంటే డాక్టరుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరి కావటంతో ఒకరు ఇస్తుంటే మరొకరు తిరస్కరించటంతో నానా అగచాట్లు పడుతున్నారు. రెండేళ్ల క్రితం కాళ్ల ఆయుర్వేద ఆసుపత్రిలోని ఒకరికి సొంత అత్త చనిపోతే సెలవు ఇవ్వటానికి అక్కడ పీహెచ్సీ డాక్టర్ నిరాకరించటం విమర్శలకు తావిచ్చింది. జీతం లేకుండా ఎన్నాళ్లో.. ప్రభుత్వం ఆయుర్వేద ఆసుపత్రుల్లో పనిచేస్తోన్న సిబ్బందికి 14 నెలలుగా జీతాలు అందించడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేని చోట సిబ్బందికి జీతాలు ఇవ్వవద్దని మౌఖిక ఆదేశాలు ఇవ్వటంతో జిల్లాలో 76 మంది సిబ్బంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్రంలో ఈ ఆసుపత్రులో పనిచేస్తోన్న 850 మంది సిబ్బంది జీతాల కోసం ఉద్యమబాట పట్టారు. కేంద్రం నుంచి 90 శాతం నిధులు! ఈ ఆయుర్వేద ఆసుపత్రుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు అందిస్తుండగా మిగిలిన 10 శాతం నిధులను ఇచ్చి వీటిని నిర్వహించవలసిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. వైద్యులు లేని మాట వాస్తవం: ఆర్డీడీ దీనిపై రీజనల్ డిప్యూటీ డైరెక్టర్(ఆర్డీడీ)ప్రసాద్‌ను వివరణ కోరగా ఆయుర్వేద ఆసుపత్రుల్లో వైద్యులు లేని మాట వాస్తవమే అన్నారు. అందుకోసమే డాక్టర్లు లేని చోట సిబ్బందికి జీతాలు ఇవ్వటం లేదని చెప్పడం విశేషం. వీరికి ప్రతి ఏడాది ఇచ్చే రెన్యూవల్ కూడా చేయలేదని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకే చర్యలు ఉంటాయని చెప్పారు. -
ఆసుపత్రికి పక్షవాతం
జిల్లాలోనే మొదటిది... ఒకేఒకటి. పక్షవాతానికి చికిత్సలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి. కానీ... మూడేళ్లుగా వైద్య సేవలు లేక... చికిత్సలు అందించక పడకేసింది తూప్రాన్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ దవాఖానాకు ఇప్పుడు పక్షవాతం వచ్చింది. అన్నీ ఉన్నా... ఏదీ పనిచేయక నిరుపయోగంగా పడివుంది. - మూడేళ్లుగా పడకేసిన ఆయుర్వేద దవాఖానా - వైద్య సేవలు లేక రోగుల అవస్థలు మండల కేంద్రంలోని ఆయుర్వేద ఆసుపత్రి చరిత్ర ఘనం.. ప్రస్తుతం ఓ శాపం. వైద్యం కోసం మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి రోగులు చికిత్స కోసం ఇక్కడికి వచ్చేవారు. పక్షవాతంతో పాటు ఇతర దీర్ఘకాలిక రోగాలకు ఈ దవాఖానా ప్రసిద్ధి. ఎప్పుడూ కిటకిటలాడుతుండేది. కానీ.. నేడు వెలవెలబోతోంది. తుప్పుపట్టిన మంచాలు... చెత్తకుప్పలా మారిన వైద్య పరికరాలతో వెక్కిరిస్తోంది. 1951 అక్టోబర్ 18న తొలుత ఇక్కడ ఆయుర్వేద డిస్పెన్సరీ ఏర్పాటు చేశారు. మంచి స్పందన రావడంతో... 1964లో నాలుగు పడకలతో... ఆ తరువాత 1984లో 9 పడకల ఆసుపత్రిగా స్థాయి పెరిగింది. రాష్ట్రంలో ఉన్న ఏడు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రుల్లో ఇదీ ఒకటి. జిల్లాలో దీనికి అనుబంధంగా 24 ఆయుర్వేద డిస్పెన్సరీలు ఉన్నాయి. సిబ్బంది కొరత... ఈ ఆసుపత్రిలో మొత్తం 15 పోస్టులున్నాయి. సీనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, కాంపౌండర్, ఇద్దరు ఎఫ్‌ఎస్‌ఓలు, కుక్, అటెండర్, ఇద్దరు పీటీఎస్, దోభీలను ప్రభుత్వం నియమించింది. కానీ ప్రస్తుతం సగం మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆకస్మిక తనిఖీతో పతనం... దశాబ్దాల సేవలతో ఇంతింతై పెరిగిన ఆసుపత్రి ఒక్కసారిగా పతనమైంది. 2012 మార్చి 15న రాష్ట్ర హోమియో అడిషనల్ డెరైక్టర్ సత్యనారయణరెడ్డి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యుడితో పాటు సిబ్బంది ఆ సమయంలో విధుల్లో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆరుగురిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆయుష్ కమిషనర్ అరుణ ఆదేశాలు జారీ చేశారు. అది మొదలు... ఇక్కడ వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఉన్నట్టుండి సిబ్బంది తగ్గిపోవడంతో ఇన్‌పేషెంట్లు భోజనం, వైద్యం అందక ఆసుపత్రి వదిలి పారిపోయారు. రెగ్యులర్ సిబ్బందిలో సగం మంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు. వారు కూడా చుట్టం చూపుగా వచ్చి వెళుతున్నట్టు తెలిసింది. వచ్చినా రిజిస్టర్లో సంతకానికే వారి సేవలు పరిమితమవుతున్నాయి. అందరికీ అందుబాటులో ఉన్న ఈ ఆసుపత్రి పడకేయడంతో రోగులు, ముఖ్యంగా పక్షవాతం వచ్చినవారు నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భం, అందునా సీఎం కేసీఆర్ నియోజకవర్గం కావడంతో దీనికి పూర్వ వైభవం వస్తుందని భావించిన చుట్టుపక్కల వాసులకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి ఈ దవాఖానాకు పట్టిన రోగాన్ని వదిలించాలని కోరుతున్నారు. -
ఎన్నారై ఆయుర్వేద మందుల విరాళం
శ్రీశైలం(కర్నూలు) : శ్రీశైలదేవస్థానం పరిధిలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు అమెరికాలోని కాలిఫోర్నియాలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రవాసాంధ్రుడు అయిన ఎస్ఎస్వి ఆనంద్ ఆయుర్వేద మందులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ లావణ్య విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలంప్రాజెక్టు కాలనీలో ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన శిరివెళ్ల ఈసోబ్ కుమారుడు ఆనంద్ అమెరికాలో ఉంటున్నాడని తెలిపారు. ఆయుర్వేద వైద్యశాలకు అవసరమైన సింహనాడ గుగ్గులు, పైసరగుగ్గులు, పునార్నావాడ మందూరం , మండుకం, మృత్యుంజయ రోజ్, శలిసాది చూర్ణం, త్రిఫలచూర్ణం, అవిశపత్తికర చూర్ణం, లవణభాస్కరం చూర్ణం, యస్టిమధుచూర్ణం, శ్వాదిష్ట విరోచన చూర్ణం మొదలైన మందులను పంపినట్లు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.50 వేలకు పైగా ఉంటుందని, వివిధ ఆయుర్వేద పచారి షాపులలో కొనుగోలు చేసి వారి బంధువుల ద్వారా ఏఎన్‌ఎల్‌లో వైద్యశాలకు పంపించినట్లు తెలిపారు. ఎఎస్‌ఈ ఆనంద్ విరాళంగా అందజేసిన ఈ మందులు కీళ్ల నొప్పులు, ఆమవాతం, వాపులు, జలుబు, దగ్గు, గ్యాస్ట్రబుల్, ఆకలి కలిగించేవి, మలబద్దకం నిరోధించేవి ఉన్నాయని, వీటితో పాటు అనేక రోగాలు వీటి కాంబినేషన్ ద్వారా రూపొందించి వినియోగించడం వల్ల అనేక రోగాలు నివారించబడటానికి అవకాశం ఉందని చెప్పారు. శ్రీశైలం ప్రాంతంలోనే చదువుకుని విదేశాలలో స్థిరపడిన ఎంతో మంది ఆయుర్వేద వైద్యశాల అభివృద్ధికి విరాళాల ద్వారా తోడ్పడుతున్నందుకు డాక్టర్ లావణ్య అభినందనలు తెలిపారు. అల్లోపతి వైద్యం పెరిగిపోయి ఆయుర్వేద వైద్యం వెనుకబడిపోతున్న తరుణంలో ఈ వైద్యానికి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నామని, ఇందుకు శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలలో చదువుకుని ఉన్నతస్థాయిలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారంతా ఆయుర్వేద వైద్య అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. -
తడిసి ముద్దయిన నగరం
పలుచోట్ల భారీ వర్షం సాక్షి,సిటీబ్యూరో: అల్పపీడన ప్రభావంతో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వినాయక చవితి వేడుకలకు వర్షంతో ఆటంకం ఏర్పడింది. దీంతో విగ్రహాలను మండపాలకు తరలించడం, పూజలు నిర్వహించడం వంటి సందర్భాల్లో భక్తులు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 వరకు నగరంలో 4.7 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదైనట్టు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 0.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని, ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆస్పత్రి గదుల్లోకి వరద నీరు.. వెంగళరావునగర్: గురువారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలోని పేయింగ్ గదుల్లోకి నీరు చేరింది. దీంతో శుక్రవారం రాత్రంతా నీరు బయటకు తోడుకుంటూ కునుకు లేకుండా గడపాల్సి రోగులు, వారి సహాయకులు గడపాల్సి వచ్చింది. సెల్లార్లో నిర్మించిన ఈ గదులన్నీ ఉపరితలానికి దాదాపు ఐదు అడుగుల దిగువున ఉండటంతో ఆస్పత్రి ఆవరణలో నుంచి, ఈఎస్ఐ ప్రధాన రోడ్డుగుండా పారే వాన నీరంతా గదుల్లోకి చేరుతోంది.