తడిసి ముద్దయిన నగరం
- పలుచోట్ల భారీ వర్షం
సాక్షి,సిటీబ్యూరో: అల్పపీడన ప్రభావంతో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వినాయక చవితి వేడుకలకు వర్షంతో ఆటంకం ఏర్పడింది. దీంతో విగ్రహాలను మండపాలకు తరలించడం, పూజలు నిర్వహించడం వంటి సందర్భాల్లో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 వరకు నగరంలో 4.7 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదైనట్టు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 0.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని, ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆస్పత్రి గదుల్లోకి వరద నీరు..
వెంగళరావునగర్: గురువారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలోని పేయింగ్ గదుల్లోకి నీరు చేరింది. దీంతో శుక్రవారం రాత్రంతా నీరు బయటకు తోడుకుంటూ కునుకు లేకుండా గడపాల్సి రోగులు, వారి సహాయకులు గడపాల్సి వచ్చింది. సెల్లార్‌లో నిర్మించిన ఈ గదులన్నీ ఉపరితలానికి దాదాపు ఐదు అడుగుల దిగువున ఉండటంతో ఆస్పత్రి ఆవరణలో నుంచి, ఈఎస్‌ఐ ప్రధాన రోడ్డుగుండా పారే వాన నీరంతా గదుల్లోకి చేరుతోంది.