worshiped
-
అయోధ్యకు పోటెత్తిన భక్తజనం
అయోధ్య: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.నవరాత్రులలో మొదటి రోజున నవదుర్గలలో ఒకరైన శైలపుత్రిని పూజిస్తారు. అయోధ్యలో అన్ని దేవాలయాలు అమ్మవారి పూజలతో కళకళలాడుతున్నాయి. ఇక్కడి ఛోటీ దేవ్‌కాళి ఆలయంలో భక్తులు క్యూ కట్టి, అక్కడ కొలువైన సీతామాతను ఆరాధిస్తున్నారు. ఈ ఆలయంలో పూజలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని పలువురు నమ్ముతుంటారు.అయోధ్యకు చెందిన పండితులు సత్యేంద్ర దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నవరాత్రులలో మొదటి రోజు. ఈ రోజున చాలామంది తమ ఇళ్లలో కలశాన్ని ప్రతిష్టించి, తొమ్మిది రోజుల పాటు అమ్మవారి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అయోధ్యకు వచ్చిన భక్తురాలు మీరా మాట్లాడుతూ, ఆలయంలో అమ్మవారి దర్శనం చక్కగా అయ్యిందని, అధికారులు భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేశారని అన్నారు. మరో భక్తుడు శైలేంద్ర మాట్లాడుతూ ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అన్నారు. ఇది కూడా చదవండి: 4న సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్ -
ఏ దేశమేగినా... బొజ్జ గణపయ్యే!
నేడు వినాయక చవితి. విఘ్నాలను తొలగించి, సర్వ కార్యాల్లో విజయం సిద్ధించాలని కోరుకుంటూ గణనాథుడికి పూజలు చేస్తాం. ఆసేతుహిమాచలం మాత్రమే కాదు భారతదేశానికి ఆవల సైతం పూజలందుకుంటున్న అతికొద్ది మంది దేవుళ్లలో వినాయకుడు సైతం ఉన్నాడు. థాయిలాండ్ మొదలు కాంబోడియా, జపాన్, చైనా ఇలా ఎన్నో దేశాల్లో బొజ్జ గణపయ్య ఘనంగా పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏటా గణేష్ చతురి్థని జరుపుకుంటూ మహదానందం పొందుతున్నాడు ఆయా దేశాల ప్రజలు. వాణిజ్య, ధారి్మక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూదేవతలను పూజించడం పరిపాటి. భారత్‌లో మాదిరే వరసిద్ధి వినాయకుడు విదేశాల్లోనూ చక్కని పూజలందుకుంటున్నాడు. అయితే గణపతిని ఆయా దేశాలు వివిధ రూపాల్లో కొలుస్తుండటం విశేషం. విఘ్ననాయకుడిని విశేష రూపాల్లో ఏ దేశం? ఎలా ఆరాధిస్తుందో ఓసారి పరికిద్దాం.. థాయిలాండ్‌లో.. థాయిలాండ్ బౌద్ధులకు వినాయకుడూ ఆరాధ్య దైవమే. క్రీ.శ 550–600 ప్రాంతంలో థాయిలాండ్‌లో లంబోదరుని విగ్రహాలు వెలిశాయి. థాయిలాండ్‌లో మన మోదకప్రియుడిని ఫిరా ఫికానెట్గా కొలుస్తారు. విజయానికి చిహ్నంగా, అడ్డంకులను తొలగించే శక్తిగా భావిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు, వివాహం సందర్భంగా మహాగణపతిని పూజిస్తారు. గజాననుడి ప్రభావం థాయ్ కళ, వాస్తుశిల్పంలోనూ స్పష్టంగా గోచరిస్తుంది. గణపతి ఆలయాలు దేశవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. కాంబోడియాలో ఆగ్నేయాసియా అంతటా మన విఘ్నరాజును పూజిస్తారు. ఈ సంప్రదాయ ఈ ప్రాంతానికి ఎలా వచి్చందనేది మాత్రం తెలియడం లేదు. ఐదు, ఆరో శతాబ్దాలకు చెందిన గణాధ్యక్షుడి శాసనాలు, చిత్రాలు ఆగ్నేయాసియాలో ఉన్నాయి. కంబోడియాలో గణా«దీశుడు ప్రధాన దైవం. ఏడో శతాబ్దం నుంచి ఆయనను దేవాలయాలలో పూజించారు. భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఈ దేవుడికి ఉందని ఇక్కడ నమ్ముతారు. టిబెట్‌లో టిబెట్‌లోనూ మన మంగళప్రదాయుడిని బౌద్ధ దేవుడిగా పూజిస్తారు. ఇక్కడ మహారక్త గణపతిగా, వజ్ర వినాయకుడిగా విభిన్న రూపాల్లో ఆరాధిస్తారు. భారతీయ బౌద్ధ మత నాయకులు అతిసా దీపంకర శ్రీజ్ఞ, గాయధర వంటివారు క్రీస్తుశకం 11వ శతాబ్దంలో టిబెట్ బౌద్ధమతానికి వినాయకుడిని పరిచయం చేసినట్లు చరిత్ర చెబుతోంది. గణేశుడిని టిబెట్, మంగోలియాలో ఉద్భవించిన బౌద్ధమత రూపమైన లామాయిజం పుట్టుకతో ఈ దేశ పురాణాలు ముడిపడి ఉన్నాయి. ధర్మ రక్షకుడిగా, చెడును నాశనం చేసే శక్తిగా, అడ్డంకులను తొలగించే మూర్తిగా వినాయకుడిని బౌద్ధం బోధిస్తోంది. అందుకే ఇక్కడి గణపతి విగ్రహం దృఢంగా, బలమైన కండరాలు, కవచం, దంతాలు, ఆయుధాలతో అలరారుతుంటాయి. ఇతర టిబెటన్ దేవతల మాదిరిగా కోపం కొట్టొచి్చనట్లు ఎరుపు, నలుపు, గోధుమ వర్ణాల్లో విగ్రహాలు కనిపిస్తాయి. ఇండోనేసియాలో.. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో కృతనాగర మహారాజు మాంత్రిక కర్మలలో అడ్డంకులను తొలగించే తాంత్రిక దేవతగా వినాయకుడిని పూజించారు. ఇది క్రీ.శ 14–15 వ శతాబ్దాల నాటికి ఇక్కడ అభివృద్ధి చెందిన తాంత్రిక బౌద్ధం, శైవ మతాల కలయికగా గణపతిని ఇక్కడ ఆరాధిస్తారు. పుర్రెలు ధరించి పుర్రెల సింహాసనంపై కూర్చున్న రూపంలో వినాయకుడు పూజలందుకుంటున్నారు. భారత్‌లో సాధారణంగా కనిపించే విగ్రహరూపాల్లోనూ గణపతిని ఇక్కడ పూజిస్తారు. తూర్పు జావా ప్రాంతంలోని తెన్గెర్ సెమెరూ జాతీయ వనంలోని బ్రోమో పర్వతం ముఖ ద్వారం వద్ద 700 సంవత్సరాలనాటి గణనాథుని విగ్రహం ఉంది. బ్రహ్మదేవుని పేరు మీద ఈ పర్వతానికి బ్రోమో పేరు వచి్చంది. అగి్నపర్వతాల విస్ఫోటం నుంచి ఈ విగ్రహం తమను రక్షిస్తుందని స్థానికులు నమ్ముతారు.చైనా, అఫ్గానిస్తాన్‌లలో.. చైనాలో లంబోదరుడిని ‘హువాంగ్ సీ టియాన్’అని పిలుస్తారు. ఆయనను ఒక విఘ్నంగా భావిస్తారు. అఫ్గానిస్తాన్ రాజధా ని కాబూల్ సమీపంలోని గార్డెజ్‌లో క్రీ.శ 6 లేదా 7వ శతాబ్దంలో చెక్కిన ప్రసిద్ధ వినాయ క విగ్రహం బయలి్పంది. గార్డెజ్ గణేశుడుగా పిలువబడే ఆయనను జ్ఞానం, శ్రేయస్సునందించే దేవుడిగా స్థానికులు ఆరాధిస్తారు. జపాన్‌లో.. గణాలకు అధిపతి అయిన వినాయకుడిని జపాన్‌లో కంగిటెన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక్కడి వాణిజ్యవేత్తలు, వ్యాపారులు, జూదగాళ్ళు, నటులు, ‘గీషా’లుగా పిలవబడే కళాకారి ణులు ఎక్కువగా గణేషుడిని కొలుస్తారు. అయితే ఇక్కడ కొందరు ప్రత్యేకమైన రూపంలో ఉన్న వినాయకుడిని ఆరాధిస్తారు. ఈ వినాయక విగ్ర హంలో స్త్రీ, పురుష రూపాలు ఆలింగనం చేసుకు ని ఉంటాయి. జపనీస్ వినాయక రూపాల్లో ఒక రూపం నాలుగు చేతులతో, ముల్లంగి, మిఠాయి పట్టుకొని ఉండటం విచిత్రం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గురుపౌర్ణమి వేళ.. సీఎం యోగి పూజలు
దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ ఆలయంలో పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. #WATCH | UP CM Yogi Adityanath offers prayers at Gorakhnath Temple, on the occasion of #GuruPurnima2024 pic.twitter.com/goky8Ro8eK— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 21, 2024 మహర్షి వేద వ్యాసుడు ఈ రోజున జన్మించాడు. ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. హిందువులు గురు పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు. హిందువులు గురువును దేవునితో సమానంగా భావిస్తారు. హరిద్వార్‌లో గురు పూర్ణిమ సందర్భంగా భక్తులు పవిత్ర గంగా నదిలో స్నానాలు చేస్తున్నారు. భక్తుల రద్దీతో గంగా ఘాట్లు నిండిపోయాయి. యూపీలోని అయోధ్యలోగల సరయూ నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. #WATCH | Haridwar, Uttarakhand: Devotees take a holy dip in the Ganga River, on the occasion of Guru Purnima pic.twitter.com/UcVQYZQAOY— ANI (@ANI) July 21, 2024 -
పెళ్లిలో గౌరి పూజ ఎందుకు? ఏ సరస్వతినో, లక్ష్మీ దేవినో పూజించొచ్చు కదా!
వివాహానికి ముందు కన్యలు గౌరీ పూజ చేస్తారు. ఈ ఆచారం ఇంచుమించు భారతదేశమంతటా ఉంది. శ్రీ కృష్ణుడిని ప్రేమించి అతనినే వివాహము చేసుకోదలచిన రుక్మిణీదేవి కూడా గౌరీపూజ చేసింది. అయితే గౌరీపూజ ఎందుకు చేయాలి? లక్ష్మీదేవినో, సరస్వతినో పూజించవచ్చు కదా? ఈ ప్రశ్నకు శ్రీ కంచి పరమాచార్యుల వారు ఇచ్చిన వివరణ!.. దాని సారాంశం ఏంటో చూద్దామా!. అన్నింటికీ అతీతంగా భర్తను ప్రేమించినప్పుడే.. లక్ష్మీదేవి భర్త శ్రీ మహావిష్ణువు అందం, చందం, అలంకారం, ఐశ్వర్యం ఉన్న మహాప్రభువు. ఆయనతో కాపురం నల్లేరు మీద బండిలా హాయిగా సాగిపోతుంది. మరి శివుడు అలా కాదే అయన స్మశానవాసి. పాములు మెడలో వేసుకుంటాడు. చేతిలో కపాలం ధరిస్తాడు. చూడడానికి మహ భయంకరంగా ఉంటాఢు. ఇంత బూడిద తప్ప అయనకు ఐశ్వర్యమేముంది కనుక? ఆయనతో కాపురం చేయడం మాటలు కాదు. అందుకు ఎంతో ఓపిక ఉండాలి. ఎన్నో అవమానాలు దిగమింగాలి. ఇంకోవైపు అసంతృప్తి చిహ్నలు కనిపించకూడదు, చిరునవ్వు చెరగకూడదు. ఇది ఎప్ఫుడు సాధ్యమవుతుంది? వీటన్నింటికీ అతీతంగా భర్తను ప్రేమించి, ఆరాధించినప్పుడే. వివాహానికి ముందు, వివాహానికి తర్వాత ఎందరో అడపిల్లల అనుభవం చూడండి. పెళ్ళంటే అంతవరకు పరిచయం లేని కొత్త వ్యక్తి తాను కలగన్న రాకుమారుడు కాకపోవచ్చు. తాను కోరుకున్నంత సంపన్నడు కాకపోవచ్చు. కానీ, తన జీవితం అతనితో ముడిపడిపోయింది. అందుకే వివాహాలు స్వర్గంలో నిర్ణయమవుతాయని సామెత. నిజానికి ఈసూత్రం మన దేశానికీ, మన వివాహ వ్యవస్థకే కాదు ప్రపంచంలో ఎక్కడైనా వర్తిస్తుంది. భర్త పట్ల భార్యకీ, భార్య పట్ల భర్తకి ఉన్న ప్రేమ మాత్రమే వీటిని జయించగలుగుతుంది. అందుకు అదర్శం సతీదేవి. కన్నతండ్రి దక్షుడు, తన భర్త రూపురేఖలను, దరిద్రాన్ని ఎత్తి చూపించి దూషించినప్పుడు భరించలేక సతీదేవిగా అగ్నిప్రవేశం చేసింది. అందుకు ప్రధాన కారణం మమేకభావమే. అందుకే ఈ గౌరి పూజ.. అటువంటి గౌరీదేవిని గుర్తు చేసుకుంటే వైవాహిక జీవితంలో కలతలు రావు. సంసారం స్వర్గతుల్యం అవుతుంది. పెళ్లికి ముందు ఆడపిల్లల చేత గౌరీపూజ చేయించడం అందుకే. ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి, సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన.. విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు. వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్తారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా ఆడ పెళ్ళి వారు వారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వానిస్తారు. నాయనా! నా కుమార్తెను భార్యగా స్వీకరించి.. వరపూజలోనే ఇరువైపువారు ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది. మగ పెళ్లివారందరు కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం, సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం కోసం కన్యను వరించడానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్లండి" అని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. (చదవండి: మంగళవారం మంచిదికాదా? ఎందుకు ఆ రోజు ఆ పనులు చేయరు!) -
భరతమాత కొలువైన గుడి
గౌరిబిదనూరు: దేశంలో ముక్కోటి దేవీ దేవతలకు ఆలయాలు, ప్రఖ్యాత దేవస్థానాలు ఉన్నాయి, కానీ భరతమాత పేరుతో ఉన్న మందిరాలు ఎక్కడా కనిపించవు. దేశమాత విగ్రహ రూపంలో కొలువై పూజలందుకుంటున్న మందిరాన్ని చూడాలంటే గౌరిబిదనూరుకు వెళ్లాల్సిందే. దక్షిణ భారతదేశపు జలియన్ వాలాబాగ్‌గా ప్రసిద్ధి చెందిన విదురాశ్వత్థానికి సమీపంలో ఉన్న నాగసంద్ర గ్రామంలో 2008లో భారతమాత దేవాలయం వెలిసింది. కృష్ణశిలలో హిందూపురానికి చెందిన శిల్పి నాగరాజు 6 అడుగుల భరతమాత విగ్రహాన్ని చెక్కారు. జాతీయ జెండాను పట్టుకుని జెండా దర్శనమిస్తుంది. జనవరి 26, ఆగస్టు 15కు ప్రత్యేక పూజలు దేవాలయం పై కప్పున దేశ నాయకుల చిత్రాలు, బొమ్మలు స్ఫూర్తిని నింపుతాయి. కిత్తూరు రాణి చన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాస్ చంద్రబోస్ తదితరుల బొమ్మలను చెక్కారు. ఏటా ఆగస్టు 14 అర్ధరాత్రి దేశభక్తియుత ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీ. స్థానిక నాయకుడు రవి నారాయణరెడ్డి భరతమాత ట్రస్ట్ ఏర్పరచి ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయంలో భరతమాతకు నిత్య పూజలు నిర్వహిస్తూ, గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15న విశేష పూజలు జరుపుతారు. (చదవండి: చిన్నవాణ్ణని వదిలేశారు) -
పూజించారు.. పట్టుకుపోయారు
ఇచ్ఛాపురం రూరల్: గ్రామదేవత అంటే ఆ దొంగలకు భయంతో పాటు భక్తి మెండుగా ఉంది కాబోలు...ప్రత్యేక పూజలు చేసి మరీ అమ్మవారి వెండి ప్రతిమను ఎత్తుకుపోయారు. ఇచ్ఛాపురం మండలం మండపల్లిలో ఇటీవల తొమ్మిది రోజుల పాటు గ్రామస్తులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు పూజా గది తలుపు తాళాన్ని రంపపు బ్లేడ్‌తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. సుమారు 42 తులాల విలువైన అమ్మవారి వెండి ప్రతిమను ఎత్తుకు పోయే ముందు అమ్మవారి సన్నిధిలో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయని పూజారి రమేష్ రౌళో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ డి.వి.వి.సతీష్‌కుమార్, రూరల్ ఎస్సై బడ్డ హైమావతిలు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌ను రప్పించి పరిశోధించారు. అమ్మవారి అలంకరణ నగలు, హుండీలను ప్రతి రోజూ పూజారి ఇంటికి తీసుకువెళ్తుండటంతో పెద్ద మొత్తంలో నష్టం కలగలేదని గ్రామపెద్దలు తెలిపారు. (చదవండి: మితిమీరి.. దిగజారి) -
ఏడు పడగల పాము పొర...జనం ఏం చేశారంటే..
దొడ్డబళ్లాపురం : ఏడు పడగల పాము గురించి మనం సాధారణంగా సినిమాల్లో చూస్తాం లేదంటే కథల్లో వింటుంటాం..నిజానికి ఏడుపడగల పాము ఉందా. అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పలేము..ఉందా? అంటే ఉందని సాక్ష్యాలూ చూపలేము..అది నమ్మిన వారికి నిజం, నమ్మనివారికి కట్టుకథ... ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటారా.. రామనగర జిల్లా కనకపుర తాలూకా కోడిహళ్లి గ్రామం సమీపంలో ఏడుపడగల పాముకు చెందినదిగా చెప్పబడుతున్న పాము పొరకు జనం సాక్ష్యాత్ నాగదేవతగా భావించి పూజలు చేసేస్తున్నారు. గత మూడు రోజుల క్రితం గ్రామం సమీపంలో స్థానికులకు కనిపించిన పాము పొర ఏడు పడగలను కలిగి ఉంది. దీంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు అదో మహత్యంగా భావించి పూజలు ప్రారంభించారు. సమీపంలోనే పాము పుట్ట కూడా ఉండడంతో జనం నమ్మకాలకు ఊతమిచ్చినట్టయింది. విషయం కాస్త పక్క గ్రామాలకూ తెలిసి జనం తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. 6 నెలల క్రితం దగ్గరలోని కోటెకొప్పఅనే గ్రామం నివాసి దొడ్డకెంపేగౌడ అనే వ్యక్తికి ఏడుపడగల పాము కనిపించినట్టు చెప్పుకున్నాడు. అప్పుడు దగ్గరలో పనిచేస్తున్న కొందరితో ఏడుపడగల పాము పోతోంది చూద్దురు రండి అంటూ పిలిచాడట. అయితే అప్పుడు పాము కనిపించలేదట. ఇప్పుడు వారి నమ్మకాలను బలపరిచేలా ఏడుపడగలు గల పాము పొర కనిపించడంతో జనం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పూజలు చేస్తున్నారు. -
ధర్మజిజ్ఞాస
తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలంటారు కదా! మరి దేవుళ్లకి ఈ పూజలూ వ్రతాలూ ఎందుకు? తలిదండ్రులకి రోజూ నమస్కరిస్తే చాలుగా?! భగవంతుడి పేరిట పూజలూ వ్రతాలూ చేస్తూ వాటిలో మునిగిపోయి వయసులో పెద్ద అయిన తల్లిదండ్రులకి సకాలంలో భోజనం పెట్టని పక్షంలో, అలాగే తలిదండ్రుల్ని సక్రమంగా గౌరవించని పక్షంలో ఈ వ్రతాలూ, పూజలూ వ్యర్థమే అని చెప్పడం వాళ్లని ప్రత్యక్ష దైవాలనడంలోని అంతరార్థం. తిండి తినని పక్షంలో వ్యాధి వికటించే పరిస్థితిలో తల్లిగాని తండ్రిగాని ఉంటే వాళ్లకి ప్రత్యేకమైన వంటని చేయించి ఆబ్దికం నాడైనా సరే మరో ప్రదేశంలో భుజింప చెయ్యాలని ధర్మశాస్త్రం నిశ్చయించి చెప్పింది. ఏకలవ్యుని విషయంలో ద్రోణుడు ఎందుకలా చేశాడు? ఏకలవ్యుడు ఒక ఆటవిక జాతి యువకుడు. ద్రోణాచార్యుని వద్ద విలువిద్యను అభ్యసించాలన్న తన కోరికను ద్రోణుడికి తెలియచేసాడు. కొన్ని కారణాల వల్ల ద్రోణుడు అతని కోరికను తిరస్కరించాడు. దాంతో ఏకలవ్యుడు బంకమట్టితో ద్రోణుని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సంపాదించాడు. ఒకసారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు తదితరులు అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్తవేషధారణతో ఏకలవ్యుడు కనిపించేసరికి గట్టిగా అరిచింది. కుక్క అరుపుకు చిరాకు కలిగిన ఏకలవ్యుడు ఆ కుక్క నోరు తెరచి. తిరిగి మూసుకునే వ్యవధిలో దాని నోటిలోనికి 7 బాణాలు వేసాడు. తరువాత ఆ కుక్క అత్యంత దయనీయంగా అర్జునునికి కనిపించింది. విచారించగా ఆ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలిసింది. ద్రోణాచార్యులు ఏకలవ్యుడిని చూడటానికి వెళ్లారు. ఏకలవ్యుడు తన గురువు గారికి ఘనంగా స్వాగతం పలికాడు. ఏకలవ్యుడి విలువిద్య చూసి ఎంతో సంతోషించారు. అయితే, విలువిద్యలో ఎంతో నైపుణ్యం ఉండి కూడా ధర్మా«దర్మ విచక్షణ లేకుండా తనను చూసి అరచింది అనే చిన్న కారణానికి దాని నోట్లోకి బాణాలు వేసి మూగజీవం మీద తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఏకలవ్యుడి వల్ల లోకానికి, ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుందని భావించిన ద్రోణుడు, రాబోయే ప్రమాదాలను ముందే నివారించటానికి ఏకలవ్యుని కుడిచేతి బొటన వేలుని దక్షిణగా ఇమ్మని అడిగాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడిచేతి బొటనవేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు. ద్రోణుడు ఆశించినట్లుగానే ఏకలవ్యుడు ఇక తన విలువిద్యను ప్రదర్శించలేకపోయాడు. -
నాలోని ఆ తెరలు తొలగించవా స్వామీ !
క్రికెట్ బ్యాట్ తెస్తాన్రా, తెస్తాన్రా అని కొడుకుతో పదిరోజులుగా చెప్తున్న తండ్రి పదకొండోరోజున నిజంగానే తెచ్చినా...‘అరే! ఇవ్వాళకూడా మర్చిపోయాన్రా’ అంటే... కొడుకు ‘మీరెప్పడూ ఇలాగే అంటారు’ అని ఏడుపు మొదలెడతాడు. వెంటనే తండ్రి తాను దాచిన క్రికెట్ బ్యాట్ చూపితే అంత ఏడుపులోకూడా సంతోషంగా దాన్ని అందిపుచ్చుకుంటున్న కొడుకును చూసి తండ్రి మురిసి పోతాడు. అదో ఆనందం తండ్రికి. అలాగే కుమార్తె వివాహానంతరం ‘జగమేలే పరమాత్మా...’ అంటూ త్యాగయ్య ఆర్తితో పిలుస్తూంటే...‘‘ రహస్యంగా నీకు దర్శనమిస్తాననుకున్నావా త్యాగయ్యా! నీ ఆర్తి ఏమిటో లోకానికి తెలిసేటట్లు ఒకరోజు దర్శనం ఇస్తాను’ అని అనుకుని ఉంటారు. అందుకే...త్యాగయ్యగారి జీవితంలో ఒకసారి తీర్థయాత్రకు వెడుతూ తిరుమల వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పటికి వేళమించిపోయిందని తెరలు వేసేశాం అని చెప్పారు అక్కడి వారు. క్షోభించిన మనసుతో ‘తెరతీయగరాదా! లోని / తిరుపతి వేంకటరమణ మత్సరమను /తెరతీయగరాదా ! / పరమపురుష ధర్మాదిమోక్షముల పారదోలుచున్నది నాలోని /తెరతీయగరాదా! / త్యాగరాజనుత మదమత్సరమను తెరతీయగరాదా !’’ అని పరమ ఆర్తితో త్యాగయ్య కీర్తన అందుకుంటే... కదిలిపోయిన వేంకటాచలపతి తెరలు తొలగించుకుని అందరూ చూస్తుండగా దర్శనమిచ్చారు. మన ఆంధ్రదేశంలో త్యాగరాజుగారి భక్తిని నిరూపించిన కీర్తన అది. రెండవ వారు శ్యామశాస్తిగ్రారు. ఒకానొక కాలంలో కంచిలో స్వర్ణకామాక్షిని ప్రతిష్ఠించారు. ఆదిశంకరాచార్యులవారు శ్యామశాస్త్రి గారి పూర్వీకులలో ఒకరిని అక్కడ అర్చకులుగా నియమించారు. కొంతకాలం తరువాత శ్రీ కృష్ణ్ణదేవరాయలు సామ్రాజ్యం పతనమై బహమనీ సుల్తాన్లు విజృంభించిన తరువాత బంగారు కామాక్షికి ఇబ్బంది ఏర్పడుతుందని భావించి అర్చకస్వామి కుటుంబీకులు ఆ విగ్రహాన్ని తీసుకుని అరణ్యమార్గాలగుండా తిరిగి తిరిగి, అనుకోకుండా తిరువారూరు చేరుకున్నారు. త్యాగయ్య (ఆ పేరుతో వెలసిన పరమశివుడి) ఆలయంలోనే ఆ విగ్రహాన్ని కూడా పెట్టి పూజలు చేస్తున్నారు. విశ్వనాథశాస్త్రి దంపతులకు చైత్రమాసం కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున శ్యామశాస్త్రి గారు జన్మించారు. నామకరణం రోజున పెట్టిన పేరు వేంకట సుబ్రహ్మణ్యం. నీలమేఘశ్యాముడైన కృష్ణమూర్తిలా ఉన్నాడని తల్లి ‘శ్యామకృష్ణా! శ్యామకృష్ణా !’ అని పిలిచేది. అదే తరువాత శ్యామశాస్త్రి గా మారింది.శ్యామశాస్త్రి గారికి చిన్నతనం నుంచే అర్చకత్వంలోనూ, ఆ మంత్రాలలోనూ దానికి సంబంధించిన విషయాలలో తండ్రి తర్ఫీదు ఇచ్చాడు. మేనమామగారు మాత్రం సంగీతంలో కొంత ప్రవేశం ఉన్నవారు. ఆయన దగ్గర కొన్ని కృతులు నేర్చుకుని శ్యామశాస్త్రి గారు పాడుతుండేవారు. ఒకరోజున తండ్రిలేని సమయంలో రాగబద్ధంగా అమ్మవారి కీర్తనలు చాలా మధురంగా ఆలపిస్తూ పూజలు చేయడంలో నిమగ్నమైనారు. దర్శనానికి గుడికి వచ్చిన ధనిక భక్తుడొకరు అది చూసి మురిసిపోయి చాలా ఖరీదైన శాలువా ఒకటి బహూకరించారు. ఇది తెలిసి మేనమామగారికి ఆగ్రహం వచ్చి శ్యామశాస్త్రి గారు అభ్యసిస్తున్న సంగీత పుస్తకాలను చింపి అవతల పారేశారు.అయినా తల్లి కొడుకును ఓదార్చి సంగీతాభ్యాసం కొనసాగేలా సర్దుబాటు చేసింది.రామకృష్ణ స్వాములవారు త్యాగయ్యగారిని ఉద్ధరించినట్లుగానే సంగీత స్వాములవారు అనే ఒక విద్వాంసుడు చాతుర్మాస్య దీక్షకోసం తంజావూరు వచ్చి ఉన్నారు. అప్పటికి అక్కడ ఉన్న శ్యామశాస్త్రిగారికి స్వర్ణార్ణవాన్ని బహూకరించి సంగీతంలోనే అనేక రహస్యాలను బోధించారు. పోతూ పోతూ ఆయన పచ్చిమిరియం అప్పయ్య శాస్త్ర్రిగారనే మరో గురువుకు శామశాస్త్రి గారిని అప్పగించి వెళ్ళారు. -
వైభవంగా నాగోబా జాతర ప్రారంభం
ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే మెస్రం వంశీయులు వారు బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. మెస్రం వంశ పెద్దలు 22 కితల వారీగా కొత్త కుండలను ఇవ్వగా.. మహిళలు పెద్దల ఆశీర్వాదం తీసుకుని అందుకున్నారు. ఆ వంశ అల్లుళ్లు, ఆడపడుచులు వరుసగా వెళ్లి వడమర సమీపంలోని కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త కుండల్లో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం పక్కనే గల పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వగా.. ఆ మట్టితో మహిళలు తిరిగి కొత్త పుట్టను తయారు చేశారు. తయారు చేసిన పుట్టల నుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి మొక్కుకున్నారు. అనంతరం ఏడు వరుసలతో తయారు చేసిన మట్టి ఉండలతో నాగోబా ఆలయం పక్కనే ఉన్న ఆలయంలో సతి దేవతల బౌలను తయారు చేసి సంప్రదాయ పూజలు చేశారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని రాత్రి 9 నుంచి 11 గంటల వరకు గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మెస్రం వంశీయులతో కలసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు భేటింగ్ (పరిచయం) పూజలకు ఏర్పాటు చేశారు. కొత్తగా పెళ్లయిన వారు, ఇప్పటి వరకు నాగోబాను దర్శించుకోని 50 మందికి పైగా మెస్రం వంశం కోడళ్లు పాల్గొన్నారు. భేటింగ్‌తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. -
జగన్మాతకు పుష్పాభిషేకం
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆర్జిత సేవలకు సుగంధ పరిమణాలు వెదజల్లే ఉత్తమజాతి పుష్పాలను ఉపయోగిస్తారు. నిత్యపూజలతో పాటు, చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రి ఉత్సవాలు, దసరా మహోత్సవాలు, ప్రత్యేక పర్వదినాలలో సైతం అమ్మవారికి పూలు అలంకరిస్తారు. అంతరాలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు రెండు గులాబీ దండలు, మల్లెమాలతో పాటు, చేమంతులతో తయారుచేసిన చిన్న గజమాల, మల్లెల జడను అలంకరిస్తారు. ఆర్జిత సేవలు జరిగే ఉత్సవమూర్తులను కూడా మల్లె, గులాబీల దండలతో అలంకరిస్తారు. చైత్రమాసంలో కోటి పుష్పార్చన చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినం నుంచి విశేషంగా లభించే ఉత్తమజాతి పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో ఆయా తిథులను బట్టి అమ్మవారికి 9 రోజుల పాటు గులాబీ, మల్లె, చామంతి, మందార, లిల్లీ, మరువం, కలువ, కనకాంబరం వంటి 9 రకాల పుష్పాలతో అర్చన జరుగుతుంది. గతంలో ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో జరిగేది. పుష్పార్చనకు మరింత ప్రాచుర్యం కల్పించాలనే భావనతో రెండేళ్లుగా రాజగోపురం ఎదుట ప్రత్యేకంగా వేదిక నిర్మించి అక్కడ ఉత్సవమూర్తికి పూజ నిర్వహిస్తున్నారు. అమ్మవారిని విశేషంగా పూజిస్తే, దేశం సుభిక్షంగా ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. ఆశ్వయుజ మాసం తొలి తొమ్మిది రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆయా తిథులను బట్టి తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మ వారు తొమ్మిది అలంకారాలలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారికి గులాబీ, మల్లె, చామంతి, కాగడా పూలను వినియోగిస్తారు. అమ్మవారికి అలంకరణకు అవసరమైన పుష్పాలను విజయవాడ, కడియం, బెంగళూరు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకుంటారు. దసరా ఉత్సవాలలో తొమ్మిది రోజులు అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరిస్తారు. ఇందుకు రోజుకు రూ. లక్ష వరకు దాతలు కానుకగా సమర్పించుకుంటారు. తొమ్మిది రోజుల పాటు తమ పేరిట అమ్మవారి ఆలయ అలంకరణ జరిపించుకునేందుకు సైతం దాతలు ముందుకు వస్తారు. దేశవిదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పుష్పాలతో తొమ్మిది రోజుల పాటు ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. సాధారణ రోజులలో ప్రతి మంగళవారం 108 తెలుపు, గులాబీ రంగుల కలువలను తెనాలికి చెందిన ఓ భక్తుడు అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. మల్లెలతో అమ్మవారికి చీర చైత్రమాసంలో జరిగే కోటి పుష్పార్చన రోజులలో అమ్మవారికి ప్రత్యేకంగా మల్లెలతో చీరను తయారు చేయించి అలంకరిస్తారు. ఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా మల్లె పూలను తీసుకువస్తారు. కడియం నుంచి విచ్చేసే నిపుణులు ఈ చీరను తయారు చేస్తారు. శాకంభరీదేవి ఉత్సవాలు ఆషాఢ మాసంలో శాకంభరీదేవి ఉత్సవాలలో పూలకు బదులుగా వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, శుష్క ఫలాల (డ్రైప్రూట్స్) తో విశేషంగా అలంకరిస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో అమ్మవారితో పాటు ఉత్సవ మూర్తులను, ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల కూరగాయలతో అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో తయారు చేసిన కదంబం ప్రసాదం భక్తులకు పంపిణీ చేస్తారు. విలువైన పండ్లను సైతం వ్యాపారులు స్వచ్ఛందంగా అమ్మవారికి విరాళాలుగా అందచేస్తారు. గిరి ప్రదక్షణతో సర్వ పాపహరణం... భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి గిరి ప్రదక్షణ చేస్తుంటారు. ఐదు రోజుల పాటు జరిగే దీక్ష విరమణ మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. దీక్షల విరమణ చివరి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల వరకు లక్షలాది మంది భవానీలు గిరి ప్రదక్షణ చేస్తుంటారు. ఈ సమయంలో కొండ చుట్టూ ఉన్న అమ్మవారి భక్తులు అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలతో పాటు గిరి ప్రదక్షణ చేసే భవానీలకు అల్పాహారం, పాలు, టీ, కాఫీలతో పాటు పండ్లు, విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. – ఎస్.కె. సుభానీ (ఇంద్రకీలాద్రి), విజయవాడదద -
మా మంచి అల్లుడు
పండగ వస్తే కొత్త అల్లుడు అత్తారింటికి బయలుదేరతాడు. మరి ఈసారి అతడు ఏం తెలుసుకున్నాడు?... దసరా పండగ వచ్చింది. కొత్త అల్లుడిలో ఉత్సాహం నింపింది. మరి పండగ వస్తే అల్లుడిని అత్తవారు మర్యాదలు చేయాలి కదా. కొత్త బట్టలు, పిండి వంటలు, అమ్మవారి పూజలు, మరదళ్ల వేళాకోళాలు... ఓహ్.... అంతా హుషారే. ‘నేను కొత్త అల్లుడిని కనుక అత్తవారి ఇంటికి వెళ్లి తీరవలసిందే. అల్లుడి హోదాలో కట్నకానుకలు పిండి వసూలు చేసుకోవలసిందే’... అనుకుంటూ ఒక కొత్త అల్లుడు అత్తవారి ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక వింత జరిగింది. తనలాగే దేవుళ్లు అత్తగారింటికి వెళుతూ కనిపించారు. త్రేతాయుగం నాటి రాముడు పుష్పక విమానంలో, ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడు రథం మీద, విష్ణుమూర్తి వైనతేయుడి మీద, శివుడు నంది మీద, బ్రహ్మదేవుడు హంస మీద అత్తవారి ఇళ్లకు వెళుతూ కనిపించారు. యుగాలు గడిచి కలియుగం ప్రవేశించినా ఇంకా వీరు అత్తవారింటికి వెళ్తున్నారంటే అల్లుళ్ల దర్జా చూపించుకోవడానికేగా అనుకున్నాడు కొత్త అల్లుడు. ‘పురాణ పురుషులే వెళ్తున్నప్పుడు నేను వెళ్లడంలో తప్పేంటి’ అనుకున్నాడు. వారి దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘మహానుభావులారా! నాదొక చిన్న సందేహం. లోకంలో అల్లుడంటే ఎందుకు చిన్నచూపు. ‘జామాతా దశమగ్రహః ’అని ఎందుకు అంటారు. మీరూ ఒకింటి అల్లుళ్లే. నా సందేహాన్ని నివృత్తి చేయండి’ అన్నాడు. వారంతా చిరునవ్వులు చిందించారు. ముందుగా విష్ణుమూర్తి ‘చిరంజీవీ! దశమగ్రహం అంటే వ్యతిరేకం అని ఎందుకనుకుంటావు. నవగ్రహాలు లేకుండా సృష్టిలేదు కదా. వాటితో సమాన స్థానం వచ్చినందుకు ఆనందించాలి. ఖగోళంలో చూపు సారించి అవస్థ పడే అవసరం లేకుండా నీ పేరుతో ఒక గ్రహం ఏర్పడినందుకు సంతోషించు’ అన్నాడు.అప్పుడు శివుడు కల్పించుకున్నాడు. ‘నాయనా! నువ్వు అడిగావు కనుక నీకో విషయం చెబుతాను విను. నేను మా మామగారు హిమవంతుడి ఇంటికి ఇన్ని సంవత్సరాలుగా వెళ్తున్నాను. ఒక్కనాడు కూడా వారు నేను వస్తున్నందుకు భయపడకపోగా, ఎప్పుడెప్పుడు వస్తానా అని ఎదురుచూస్తుంటారు. మా అత్తగారు మేనాదేవి... కూతురూ – అల్లుడూ వస్తున్నారని ఎంత ఆనందపడుతుందో చెప్పలేను. మా వల్ల ఇబ్బంది ఉంటే, ఇన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తారో చెప్పు. నీకు ఈ సందర్భంగా మరో విషయం చెప్పాలి. నాది, పార్వతిది ప్రేమ వివాహం. పార్వతి సంపన్నుల ఇంటి పుట్టింది. నేను శ్మశానవాసిని. మరి మా ఇద్దరి వివాహం ఎలా జరిగిందా అనుకోవచ్చు. మా ఇద్దరి జ్ఞానం సమస్థాయి. అందుకే మా వివాహం ప్రపంచానికే ఆదర్శమైంది. మమ్మల్ని ఆదిదంపతులుగా కొనియాడుతున్నారు. మా ప్రేమ వివాహాన్ని మా అత్తమామలు మంచి మనసుతో అంగీకరించారు. నేను ఏనాడూ ఆ ఇంటి అల్లుడిననే భావనే లేదు వారికి, వారి ఇంటి బిడ్డగానే ఆదరించారు. అల్లుడు ఇంటికి వస్తున్నాడు అనగానే అత్తమామలు గడగడలాడిపోవాలా చెప్పు నాయనా’ అన్నాడు. శివుడి మాటలు ఈ కొత్త అల్లుడిని ఆలోచింపచేశాయి. అయినా ఇంకా మనసులో ఏవో సందేహాలు వస్తూనే ఉన్నాయి. ‘మహానుభావా! మీ రోజులు వేరు, మా రోజులు వేరు. ఈ రోజుల్లో అల్లుడు కట్నం తీసుకోకపోయినా, అత్తవారింట్లో కొడుకులా ప్రవర్తించినా చేతకానివాడిగా చూస్తున్నారు. ఏదో లోపం ఉండబట్టే ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ నిందిస్తారు’ అన్నాడు. అందుకు విష్ణుమూర్తి శంఖుచక్రాలు సరిచేసుకుంటూ ‘కుమారా! కలియుగంలో మనుషులు ఎంతో అభివృద్ధి సాధించారని అందరూ అనుకుంటుంటే ఇంకా కట్నాలు, కానుకలు ఏంటయ్యా, దురాచారాలను విడిచిపెట్టట్లేదు’ అన్నాడు మందస్మిత వదనంతో.అప్పుడు శ్రీరామచంద్రుడు ‘వత్సా! అల్లుడు అనే పదానికి అర్థం తెలుసుకోవయ్యా. ఒక తండ్రి కన్యాదానం చేసే సమయంలో అల్లుడిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తాడు. అంతటి ఉన్నత స్థానం ఇచ్చారు అల్లుడికి. ఆ విషయం పక్కన పెడితే, మా వివాహం గురించి మీకు తెలుసు కదా. శివధనుస్సును ఎత్తగలిగినవారికే జానకితో వివాహం అని చాటింపు వేయించాడు. అంతేకాని మిథిలా నగరంతో సరితూగగలిగే సంపదలున్న వారికే నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించలేదు. వివాహబంధం పటిష్టంగా ఉంటే అల్లుడు, అలకలు, హోదాలు, మర్యాదలు అనే భావనే రాదు. నేను ఇన్ని వేల సంవత్సరాలుగా ప్రతి దసరాకీ మిథిలకు వెళుతూనే ఉన్నాను. ఒక్క సంవత్సరం వెళ్లకపోయినా జనకమహారాజు ఆందోళన చెందుతాడు. అల్లుడు వస్తున్నాడంటే ఆయనకు ఎంత సంబరమో. రెండు పండుగలు చేసుకున్నంత పరవశం చెందుతాడు’ అన్నాడు. కొత్త అల్లుడికి ఇంకా తనకు కావలసిన సమాధానం దొరకలేదు. ఆ పక్కనే ఉన్న శ్రీకృష్ణుడితో ‘నల్లనయ్యా! నువ్వు ఇన్నివేల మందిని వివాహం చేసుకున్నావు కదా. వీరే కాకుండా అష్టభార్యలు కూడా ఉన్నారు కదా! మరి నువ్వు ఎవరింట అల్లుడిగా సాక్షాత్కరిస్తావయ్యా శ్రీకృష్ణా’ అని ప్రశ్నించాడు. నవ్వురాజిల్లెడు మోముతో శ్రీకృష్ణుడు, ‘చిరం జీవీ. నన్ను ఎవరు మనసులో స్మరించుకుంటారో, వారికి ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తానని తెలియదా. నేను అందరివాడినయ్యా! మరో విషయం రుక్మిణితో నా వివాహం గురించి తెలుసు కదా! రుక్మిణి తండ్రి భీష్మకుడికి మా వివాహం ఇష్టం లేదు. కాని రుక్మిణి అందరినీ ఎదిరించి నాతో వచ్చింది. ఎందుకు! నేనేమైనా రాజవంశీయుడినా, సంపన్నుడినా. కాదు కదా! మా ఇద్దరిదీ ఒకే జ్ఞానం, ఒకే సంస్కృతి. అందుకే మా వివాహాన్ని భీష్మకుడు కొంతకాలం తరవాత అంగీకరించాడు. ప్రతి దసరాకి మమ్మల్ని ఆనందంగా, ఆప్యాయంగా ఆహ్వానిస్తూనే ఉన్నాడు. మేం రావడమే తనకు పండుగ అంటాడు. మా వల్ల వారికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవు కదా’ అన్నాడు. ఒక్కొక్కరితో మాట్లాడుతూంటే కొత్త అల్లుడికి ఒక్కో కొత్త విషయం అర్థం కాసాగింది. దసరా అంటే సరదాల పండగ, సరసాల పండగే కాని, కట్నకానుకల పండుగ కాదని అర్థం చేసుకున్నాడు. అల్లుడంటే అత్తమామలను పీడించేవాడు కాదని, అల్లుడంటే పండుగకు అత్తవారింటికి కొడుకు రూపంలో వచ్చేవాడని తెలుసుకున్నాడు. దారిలో అత్తమామలకు, మరదళ్లకు... ఇంటిల్లిపాదికీ కొత్త బట్టలు, మిఠాయిలు, పండ్లు, పూలు తీసుకుని తేలికపడిన మనసుతో అత్తవారిల్లు చేరాడు. ‘చిరంజీవీ! దశమగ్రహం అంటే వ్యతిరేకం అని ఎందుకనుకుంటావు. నవగ్రహాలు లేకుండా సృష్టిలేదు కదా. వాటితో సమాన స్థానం వచ్చినందుకు ఆనందించాలి. ఖగోళంలో చూపు సారించి అవస్థ పడే అవసరం లేకుండా నీ పేరుతో ఒక గ్రహం ఏర్పడినందుకు సంతోషించు!!! నాది పార్వతిది ప్రేమ వివాహం. పార్వతి సంపన్నుల ఇంటి పుట్టింది. నేను శ్మశానవాసిని. మరి మా ఇద్దరి వివాహం ఎలా జరిగిందా అనుకోవచ్చు. మా ఇద్దరి జ్ఞానం సమస్థాయి. అందుకే మా వివాహం ప్రపంచానికే ఆదర్శమైంది. మమ్మల్ని ఆదిదంపతులుగా కొనియాడుతున్నారు. మా వివాహం గురించి మీకు తెలుసు కదా. శివధనుస్సును ఎత్తగలిగినవారికే జానకితో వివాహం అని చాటింపు వేయించాడు. అంతేకాని మిథిలా నగరంతో సరితూగగలిగే సంపదలున్నవారికే నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించలేదు. వివాహబంధం పటిష్టంగా ఉంటే అల్లుడు, అలకలు, హోదాలు, మర్యాదలు అనే భావనే రాదు. నేను ఇన్ని వేల సంవత్సరాలుగా ప్రతి దసరాకీ మిథిలకు వెళుతూనే ఉన్నాను. – వైజయంతి పురాణపండ -
గుణం ఆయుధం
ఆయుధ పూజనాడు అందరూ ఆయుధాలకు పూజలు చేస్తారు.అమ్మవారి చేతిలో ఉండే ఆయుధాలు ఏ గుణాలకు సంకేతమో తెలుసా? వాటిని పూజించడం వల్ల ఏ దుర్గుణాలను రూపుమాపుకోవచ్చో తెలుసా? మనలోని సద్గుణమే ఆయుధం. ఆ సద్గుణానికి పదును పెట్టుకోవలసిన తరుణమే దసరా.అమ్మవారికి చేసే పూజల్లో ఆయుధపూజని కూడా చేయడం సంప్రదాయం. ఆయుధమనగానే ఎవరినో వధించడానికో లేక మనని రక్షించుకోవడానికో సిద్ధంగా ఉంచుకున్న ఓ పరికరం అని మనసులో ఆలోచన వస్తుంది. కాని అమ్మ ధరించిన ఆయుధాల ఉద్దేశ్యం వేరు. వారి అంతరార్థం వేరు. అమ్మవారి చేతిలో కనిపించే ప్రతి ఆయుధానికీ మనం చేయాల్సిన పూజే ఆయుధపూజ. క్రమంగా చూద్దాం. పాశ పూజ ‘ధృతపాశాంకుశ పుష్ప బాణ చాపామ్’ అని కనిపిస్తుంది అమ్మవారి స్తోత్రంలో. ఓ చేతిలో పాశాన్ని, మరో చేతిలో అంకుశాన్ని, ఇంకొక చేతిలో పుష్పాలు ఐదింటినీ కలిపి బాణంగా చేసుకుని, మరో చేతిలో వింటిని ధరించి ఉంటుందని దీని భావం. ముందుగా పాశానికి అర్థాన్ని చెప్పుకుందాం. పాశం అంటే తాడు అని అర్థం. తాడుతో కట్టబడేది పశువు. నాలోని పశుత్వాన్ని తొలగించు లేదా నాలో పశుత్వం అసలు ప్రవేశించకుండా రక్షిస్తూ ఉండు అని ప్రార్థించడమే పాశానికి పూజ చేయడంలోని అంతరార్థం.ఉదాహరణకి ఓ అరటిగెల ఎక్కడైనా బాగా కనిపిస్తూంటే మనమైతే ఆ అంగడికి వెళ్తాం. కొంటాం. అదే మరి పశువైతే వెళ్తూనే నోటితో ఆ గెలని పట్టుకుంటుంది. ఆ యజమాని కర్రదెబ్బల్ని తిని వెనక్కి వెళ్లిపోతుంది. అభిమానం లేకుండా ప్రవర్తించడమే పశుత్వం. జరిగిన అవమానాన్ని మళ్లీ జరిగేలా బుద్ధిహీనతతో చేసుకోవడమే పశుత్వం. ఒక్క తప్పుని చేసి అవమానాన్ని పొంది, మళ్లీ అదే తప్పుని చేసి మరో అవమానానికి సిద్ధపడే ఎందరినో చూస్తుంటాం. అదే పశుత్వం. కొన్ని తెలిసిన పశుత్వాలూ, కొన్ని మనకి తెలియకుండా చేసే పశుత్వాలూ మనలో దాగుంటాయి. అందుకని ఆ పశుత్వాన్ని నా నుండి తొలగించవలసిందని ప్రార్థిస్తూ చేసే పాశానికి సంబంధించిన పూజ పాశ ఆయుధపూజ. అమ్మ పాశంతో మనని కట్టేసి తన వాళ్లలో ఒకరినిగా మనని చేసుకుంటుంది కాబట్టి పాశమనేది మన రక్షణకి ఉపయోగించే రక్షక వస్తువే. శ్రీకృష్ణుణ్ణి యశోద రోటికి కట్టేస్తే, ఆ రోటిని రెండు చెట్ల మధ్యగా ఈడ్చుకు వెళ్లిన బాలకృష్ణుడు ఇద్దరు రాక్షసులకి రాక్షసత్వం నుండి విముక్తి కలిగించాడు కదా! ఆ పాశం ఈ ఇద్దరి రక్షక వస్తువు కాలేదూ! అదే మరి దుర్యోధనుడేం చేశాడు? తమ దగ్గరికి కృష్ణుడు రాయబారిగా వచ్చి విశ్వరూపాన్ని చూపిస్తే, ఆ రూపం ఎంత ఎత్తుందో అంత తాటితో అతణ్ణి కట్టేద్దామని భావించి తాళ్లని తెప్పించాడు కదా! ఎంతటి పశుత్వం దుర్యోధనునిది! అన్ని తాళ్ల సమూహాన్ని తెచ్చినా కట్టుబడని శ్రీకృష్ణుడు యశోదమ్మ మూరెడు తాటికి బంధిపబడ్డాడా? లేదా? కాబట్టి ‘అమ్మా! నీ అనురాగ పాశంతో నన్ను కట్టేసి నీ ఆయుధాన్ని నా రక్షణకి ఉపయోగించవలసింద’ని ప్రార్థిస్తూ పాశానికి చేసే పూజ పాశ ఆయుధపూజ. అంకుశ పూజ అంకుశమంటే చివర కూసుగా వంకీ తిరగబడి ఉండే ఒక పరికరం. ఆ అంకుశం ఎప్పుడూ ఏ మృగాన్ని, జంతువుని చంపదు – చంపలేదు. అయితే బాగా మందమైన చర్మం కలదీ, మరింత గట్టిగా ఉండేదీ అయిన ఏనుగు కుంభస్థలం మీద గుచ్చి, దాన్ని అదుపు చేసేందుకు వాడబడే వస్తువు ఇది. లౌకికంగా ఇది దీనర్థం. అంతరార్థం అది కాదు. ఏనుగు నల్లగా ఉంటుంది. అది తమోగుణానికి (గర్వం, దర్పం, అహంకారం, మదం... అన్నీ కలిపిన గుణం) సంకేతం. వ్యక్తుల్లో అలాంటి లక్షణాలున్న ఎవరైనా ఏనుగుతో సమానం. ‘అమ్మా! నాలో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే నా ఏనుగుని (నా లోపలి తమోగుణాన్ని) నీ చేతితో అంకుశంతో ఒక్కసారి గట్టిగా పొడిచి నన్ను సరైన తోవలో, సరైన బుద్ధితో నడిచేలా రక్షించవలసిందని ఆ అంకుశానికి చేయాల్సిన పూజ అంకుశ పూజ. రావణుడు తమోగుణానికి ప్రతీక. సీతమ్మ ఎదురుగా నిలబడి ‘మమ శయాన మారోహా’ (నా పక్కమీదికి రా) అని అన్నంతటి అహంకార స్థితి నిండిన శరీరం రావణుడిది. అమ్మ అంది– నీకు బుద్ధి లేదా? లేక నీకు మంచిచెడుల తేడాని చెప్పేవారూ చెప్పగలవారూ లంకలో లేరా? – అని. అదిగో అవే మాటల్ని మనమూ మననం చేసుకుంటూ – అమ్మా! నాలో ఏదైనా వినని లక్షణముంటే వినిపించుకునేతనాన్ని కలిగించవలసిందని పూజ చేయడమే అంకుశపూజలోని పరమార్థం. అలా చేస్తే ఆ అంకుశమే మనకి రక్షక వస్తువుగా మన పాలిట నిలిచి ఉంటుంది ఎప్పటికీ. పుష్పబాణాలు అమ్మ చేతిలో ఉండే 5 బాణాలూ ‘పృథివి అప్ తేజస్ వాయు ఆకాశాల’కి సంకేతం. ‘అమ్మా! పృథివి ద్వారా వచ్చే భూకంపానికి నేనూ నా కుటుంబం లోను కాకుండా, అప్ (నీరు) ద్వారా వచ్చే వరదలూ తద్వారా కలిగే నిరాశ్రయ విధానానికి నేనూ నా కుటుంబమూ గురికాకుండా ఉండేలా, ఉష్ణ రోగాలు రాకుండా తేజస్సు ద్వారా, వాతరోగాలు తాకకుండా ఉండేలా వాయువు ద్వారా, ఏ పిడుగులూ రాహు కేతు గ్రహాల అననుకూల పరివర్తనల ద్వారా కష్టం కలగకుండా ఆకాశం ద్వారా మమ్మల్ని రక్షిస్తూనే ఉండవలసిందని ప్రార్థించడం పంచ పుష్పబాణ పూజలోని అంతరార్థం. ఈ పుష్పబాణ పూజ మరోవిధంగా మన శరీరంలో ఉండే ఆరు దుర్గుణాలూ అయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని తొలగించవలసిందని కూడా ప్రార్థించడానికి సరిపోతుంది. చాపం చాపమంటే విల్లు. అమ్మ చేతిలోని వింటికి పూజ చేయడం మరింత గొప్ప ఆయుధపూజ. నమక మంత్రంలోని మొదటి మంత్రం శంకరుణ్ని స్తుతిస్తూ – ‘శంకరా! నీ కోపానికి నమస్కారం (రుద్ర మన్యవే) – ఆ కోపంతో అమ్ములపొదిలో నుండి తీసిన బాణానికి నమస్కారం (ఉతోత ఇషవే నమః) – ఆ బాణాన్ని వింటిలో పెట్టి బాణాన్ని విడవడానికి సిద్ధంగా ఉన్నావే! ఆ వింటికి నమస్కారం (నమస్తే అస్తు ధన్వనే) – ఆ వింటినీ దానిలో ఎక్కుపెట్టిన నారినీ ఆ వింటినారిలో బిగించేలా చేసిన నీ రెండు బాహువులనీ ప్రార్థిస్తూ నాకు ఏ తీరు అపకారాన్ని సకుటుంబంగా కలిగించకుండా ఉండవలసింది (బాహుభ్యాముత తే నమః)’ – అంటూ చేసే ఈ నమస్కారాలన్నీ ఆయుధ పూజే. అలా అమ్మని ప్రార్థిస్తే అమ్మ తన చేతిలోని వింటితో మన శత్రువులని భయపెడుతూ తప్పక రక్షనిస్తుంది. చక్రం శ్రీమహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రాన్ని అమ్మ తన దుర్గారూపంలో ధరిస్తుంది. చక్రమనగానే అందరి తలలనీ నరికేసేదే అని మన అభిప్రాయం. ఏ శిశుపాలుడు వంటివాళ్లని సంహరించవలసి వచ్చినా ముందుగా హెచ్చరించి మాత్రమే చంపాడు శ్రీహరి. చక్రం అకస్మాత్తుగా వధించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. శ్రీహరి తన చేతి చక్రాన్ని – నిత్య భక్తుడైన అంబరీషునికి ఇస్తూ ఏ కష్టం వచ్చినా ఇది నీకు రక్షక చక్రంగా ఉపయోగపడుతుందని ఇచ్చాడు. (ప్రదత్తో నిత్య రక్షయామ్). అదుగో ఆ చక్రాన్ని గనుక మనం పూజిస్తే అది మనని వధించదు సరికదా మన మనసుకి గాయం చేయబోయేవారిని తన అంచుల కాంతులతో హెచ్చరిస్తుంది – జాగ్రత్త అని. ఇదే తీరుగా అమ్మ రాక్షస వధ చేయడానికి విఘ్నేశ్వరుని నుండి అంకుశాన్నీ, కుమారస్వామి నుండి భల్లాన్నీ (బల్లెం), శంకరుని నుండి త్రిశూలాన్నీ, శ్రీహరి నుండి చక్రాన్నీ... ఇలా ఎవరెవరు తమ తపశ్శక్తిని ఏయే ఆయుధాల్లో దాచి ఉంచారో ఆయా తపశ్శక్తి దాగిన ఆయుధాలన్నింటినీ తన చేతుల్లో ఉంచుకుని మరీ – సిద్ధపడింది తప్ప, తనకున్న ఆయుధాలు సరిపోతాయని భావించనే లేదు. అలా తీసుకోవడం ఆమె అసమర్థతకి నిదర్శనం కాదు.శత్రువనేవాడు లేకుండా ప్రవర్తించడం – తన ప్రవర్తనని సరిదిద్దుకోవడం ఉత్తమం. మనం అలా ప్రవర్తించినా, నిష్కారణంగా వశిష్ఠుని మీదికి దండెత్తిన విశ్వామిత్రునిలా కొందరు మన మీద శత్రుత్వంలో ఉండి తీరుతారు కాబట్టి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. అందుకని అమ్మ అంటుంది గదా – శత్రుత్వంరాకుండా చూసుకో! ఒకవేళ శత్రువు మనతో పోరాడేంత స్థాయిలో గనుక వస్తే – తగిన జవాబు చెప్పడానికి ఇందరి సహకారంతో పోరాడి గెలుపొందడం అత్యుత్తమం అని. అందుకని ఇన్ని ఆయుధాలకీ రక్షణని కోరుతూ ప్రార్థించడమే ఆయుధపూజలోని అంతరార్థం. తన్నోదేవీ ప్రచోదయాత్. శత్రువనేవాడు లేకుండా ప్రవర్తించడం – తన ప్రవర్తనని సరిదిద్దుకోవడం ఉత్తమం. మనం అలా ప్రవర్తించినా, నిష్కారణంగా వశిష్ఠుని మీదికి దండెత్తిన విశ్వామిత్రునిలా కొందరు మన మీద శత్రుత్వంలో ఉండి తీరతారు కాబట్టి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. అందుకని అమ్మ అంటుంది గదా – శత్రుత్వం రాకుండా చూసుకో! ఒకవేళ శత్రువు మనతో పోరాడేంత స్థాయిలో వస్తే – తగిన జవాబు చెప్పడానికి ఇందరి సహకారంతో పోరాడి గెలుపొందడం అత్యుత్తమం అని. ∙ డా. మైలవరపు శ్రీనివాసరావు -
గణపతిని పూజించిన శివుడు
ఒకసారి శివుడు తన గణాలను తీసుకుని ఒక రాక్షసుడి మీదికి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి వెళ్లే తొందరలో గణపతిని కలిసి తాను Ðð ళుతున్న పని గురించి చెప్పి, అనుమతి తీసుకోవడం మరచిపోయి హడావుడిగా వెళ్లడంతో అడుగడుగునా ఆయనకు, ఆయన పరివారానికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతి పనిలోనూ విఘ్నాలు ఏర్పడుతుంటాయి. శివుడు వాటిని పట్టించుకోకుండా రథం ఎక్కబోయాడు. రథచక్రం కాస్తా ఊడిపోవడంతో తన వాహనమైన నందిని పిలిచాడు. నంది రావడం తోటే అధిరోహించబోయాడు. ఉత్సాహంగా ముందుకు ఉరకబోయిన నందికి కాలు మడతబడినట్లయి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. ఏమి చేద్దామా అన్నట్లుగా తన పరివారం వైపు చూస్తాడు శివుడు. వారంతా ఏదో పోగొట్టుకున్నట్లుగా నిరాశానిస్పృహలతో, కళ తప్పిన ముఖాలతో కనపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన అనుభవాలు లేకపోవడంతో ఏమి జరుగుతోందో చూద్దామని కన్నులు మూసుకోగానే మనోనేత్రం ముందు బాలగణపతి నవ్వుతూ దర్శనమిచ్చాడు. అప్పుడు గుర్తుకొచ్చింది శివుడికి... విష్ణుమూర్తి సహకారంతో గజాసురుడి ఉదరం నుంచి వెలికి వచ్చిన తర్వాత తన సతిని చూద్దామన్న వేగిరపాటుతో తన నివాసానికి రావడం, వేలెడంత కూడా లేని బుడత ఒకడు తనను లోనికి వెళ్లనివ్వకుండా అడ్డగించడం, తాను ఆగ్రహంతో ఆ బాలుడి శిరస్సు ఖండించడం, పార్వతి ద్వారా అసలు విషయం తెలుసుకుని, ఆ బాలుడికి ఏనుగు తల అతికించి తిరిగి బతికించిన సందర్భంలో... ‘‘నాయనా! గణేశా! ఇకపై దేవదానవ యక్ష గంధర్వ కిన్నర కింపురుషుల దగ్గర నుంచి, మామూలు మనుషులు, మహిమాన్విత గుణాలు కలిగిన రుషులు ఏ పూజలు, వ్రతాలు, శుభకార్యాలూ చేసినా ప్రథమ పూజ నీకే. నూత్నంగా ఎవరు ఏ పని తలపెట్టినా ముందుగా నిన్ను తలచుకుని, నీకు పూజ చేయనిదే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదు, అందుకు త్రిమూర్తులమైన మేమూ అతీతులం కాము సుమా’’ అని చెప్పిన మాట, ఇచ్చిన వరం గురించి. వరమిచ్చిన తానే దానిని విస్మరించి, తన కుమారుడే కదా అన్న తేలికపాటి దృష్టితో యుద్ధానికి బయలు దేరేముందు గణపతిని స్మరించకుండా వచ్చేసినందుకే తనకూ, తన పరివారానికీ అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయని గ్రహించాడు. దాంతో ఎంతో నొచ్చుకుని వెంటనే వెనక్కు వెళ్లి, తన పరివారంతో గణపతి పూజ చేయించాడు. తాను కూడా గణపతిని కలిసి తాను యుద్ధానికి వెళుతున్నాననీ, తనకు ఏ విఘ్నాలూ లేకుండా విజయం సాధించేలా చూడమని గణపతికి చెప్పి, వీడ్కోలు తీసుకుని తిరిగి వచ్చి ఈ సారి యుద్ధంలో ఘన విజయం సాధించాడు శివుడు. పిల్లలతో అబద్ధం చెప్పకూడదని, దొంగతనం, అవినీతి, లంచగొండితనం నేరమని చాలా నీతులు చెబుతూ ఉంటాం. కానీ, తీరా మన దగ్గరకొచ్చేసరికి వాటన్నింటినీ పక్కన పెట్టేస్తాం. అది చాలా తప్పు. ఏ మంచినైనా ముందు మనం ఆచరిస్తేనే, పిల్లలు కూడా వాటిని అనుకరిస్తారని తెలుసుకోవడమే ఇందులోని నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
26 రోజులుగా పూజలు.. ఆ పాము మృతి
సాక్షి, పిఠాపురం(తూర్పుగోదావరి): గత కొన్ని రోజులుగా జిల్లా ప్రజలు దేవుడని కొలుస్తూ పూజలు చేస్తున్న పాము గురువారం మృతిచెందింది. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని ఓ రైతు పొలంలో 26 రోజుల క్రితం కనిపించిన పామును గ్రామ ప్రజలు సుబ్రమణ్య స్వామి స్వరూపం అంటూ పూజలు చేశారు. ఆ పాము గ్రామస్తుల దగ్గరికి వెళ్లినా వారిని కాటు వేయకపోవడంతో సాక్షాత్తు దేవుడేనంటూ మరింత నమ్మకం ఏర్పరుచుకున్నారు. బుధవారం కుసుం విడిచిన పాము అనుకోకుండా మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎస్సైయే కారణం.. గత కొన్ని రోజులుగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న పాము మృతిచెందటానికి గొల్లప్రోలు ఎస్సై శివకృష్ణ కారణమంటూ దుర్గాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఎస్సైను సస్పెండ్ చేయాలంటూ గ్రామస్తులు జాతీయరహదారిపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. పాము మృతి చెందిన స్థలంలో గుడి కట్టాలని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. -
ఏపీ దినాదినాభివృద్ధి, జగన్ సీఎం కావాలంటూ వైఎస్ఆర్సీపీ పూజలు
-
పాములతో పరాచకాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అదో శతాభిషేక మహోత్సవం. బంధుమిత్రులతో ఎంతో సరదాగా, సందడిగా గడుపుదామని వచ్చిన ఆహ్వానితులంతా బిక్కచచ్చిపోయి ఉన్నారు. మరికొందరు శిలాప్రతిమల్లా నీలుక్కుపోయి ఉన్నారు. శతాభిషేకం చేయించుకుంటున్న 80 ఏళ్ల తండ్రి, అతని ధర్మపత్ని ఊపిరి బిగబట్టి భయంతో వణికిపోతున్నారు. తల్లిదండ్రులకు శతాభిషేకం నిర్వహిస్తున్న కుమారుడు సైతం ప్రాణభయంతో మంత్రాలు చెబుతున్నాడు. వీరందరితోపాటు నాగుపాములు సైతం శతాభిషేకానికి హాజరు కావడమే అందరి భయాందోళనలకు కారణం. కడలూరు మంజాకుప్పంలో చోటుచేసుకున్న ఈ చోద్యం వివరాలు ఇలా ఉన్నాయి. కడలూరు మంజాకుప్పంకు చెందిన సుందరేశన్ (45)అదే ఊరిలోని ఒక ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. 80 ఏళ్లు పూర్తిచేసుకున్న తన తండ్రికి శతాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తలచాడు. నాగుపాములు పెట్టి పూజలు చేస్తే తల్లిదండ్రులకు పూర్ణాయుష్షు లభిస్తుందని కొందరు చెప్పిన మాటలను అక్షరాల పాటించాడు. పాములు పట్టే వ్యక్తి ద్వారా రెండు నాగుపాములను తెప్పించాడు. బుట్టలో ఉన్న పాములను బైట పెట్టి పూజలు ప్రారంభించారు. కుమారుని పక్కనే కూర్చోవాల్సిన వృద్ధ తల్లిదండ్రులు దూరంగా కుర్చీ వేసుకుని జరుగుతున్న తంతును కళ్లప్పగించి చూడడం ప్రారంభించారు. చుట్టూ జనం, వేదమంత్రాల ఘోషతో కంగారుపడుతున్న నాగుపాములు కుమారుడు సుందరేశన్పైకి ఉరికే ప్రయత్నం చేయడం, పాములు పట్టేవాడు వాటినితనవైపునకు తిప్పుకోవడం పదే పదే సాగింది. చిర్రెత్తుకొచ్చిన నాగులు సుందరేశన్పై బుసలు కొట్టగా భయపడిపోయాడు. ఈ కార్యక్రమానికి హాజరైన బంధువుల్లో కొందరు ఈ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియోగా చిత్రీకరించి వాట్సాప్‌లో పోస్టు చేశారు. 17 నిమిషాల నిడివిగల ఈ దృశ్యాలు వైరలై తిన్నగా అటవీ అధికారులకు చేరాయి. అటవీ అధికారులు అధికారులు విచారణకు ఆదేశించి పాములు పెట్టి పూజలు చేయడాన్ని నిర్ధారించుకున్నారు. పూజల పేరుతో పాములతో పరాచికాలాడిన సుందరేశన్‌ను గురువారం అరెస్ట్‌చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. పరారైన పాములవాడి కోసం గాలిస్తున్నారు. మేళతాళాల మధ్య సాగిన శతాభిషేకం చివరకు విషాదంగా ముగిసింది. -
ధర్మ జిజ్ఞాస
పెళ్లి కాక ముందు నేను ఒక కుందెలో దీపారాధన చేస్తూ వచ్చాను. పెళ్లయ్యాక అత్తగారింట్లో రెండు కుందెలు పెట్టాలన్నారు. దేనిని అనుసరించాలి? సూర్యుడు ప్రత్యక్ష దీపం. ఆయన ఉదయించక ముందూ, ఆయన అస్తమించిన వెనుకా ఆయనకి ప్రతినిధిగా మన ఇంట్లో వెలిగించేది ప్రత్యక్ష దీపం. ఈ కాలంలో శ్రోత్రియులూ, నిష్ఠాపరులూ అయిన వాళ్లు మంత్రపూర్వకంగా అగ్నిహోత్రాన్ని చేస్తారు. నిజానికి ఒక దీపాన్ని మూడు వత్తులతో (సాజ్యం త్రివర్త సంయుక్తం .... తిమిరాపహమ్) వెలిగిస్తే చాలు. అయితే ఇటు ఒక దీపం, అటు పక్క ఒక దీపం పెడితే రెండువైపుల కాంతి నడుమా భగవంతుడు బాగా కనిపిస్తాడనే ఆలోచనతో రెండు దీపాలని ఎవరో ప్రారంభించి ఉంటారు. గృహాణ మంగళం దీపమ్ (ఒక దీపాన్నే) అని ఏకవచనమే ఉంది తప్ప రెండు దీపాలనే నియమం ఏమీ లేదు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలంటారు కదా! మరి దేవుళ్లకి ఈ పూజలూ వ్రతాలూ ఎందుకు? తలిదండ్రులకి రోజూ నమస్కరిస్తే చాలుగా?! భగవంతుడి పేరిట పూజలూ వ్రతాలూ చేస్తూ వాటిలో మునిగిపోయి వయసులో పెద్ద అయిన తల్లిదండ్రులకి సకాలంలో భోజనం పెట్టని పక్షంలో, అలాగే తలిదండ్రుల్ని సక్రమంగా గౌరవించని పక్షంలో ఈ వ్రతాలూ, పూజలూ వ్యర్థమే అని చెప్పడం వాళ్లని ప్రత్యక్ష దైవాలనడంలోని అంతరార్థం. తిండి తినని పక్షంలో వ్యాధి వికటించే పరిస్థితిలో తల్లిగాని తండ్రిగాని ఉంటే వాళ్లకి ప్రత్యేకమైన వంటని చేయించి ఆబ్దికం నాడైనా సరే మరో ప్రదేశంలో భుజింప చెయ్యాలని ధర్మశాస్త్రం నిశ్చయించి చెప్పింది. శుభకార్యం ఒకటి చేశాక మరో శుభకార్యానికి కొంత గడువు తీసుకోవాలా? ఒక ఇంట్లో ఒక శుభకార్యం చేశాక కనీసం ఒక ఆయన కాలం (6 నెలలు) వ్యవధి ఉండాలంటోంది శాస్త్రం. శుభకార్యమనగానే బంధువుల రాకపోకలతో అలసట వంటివన్నీ ఉంటాయి. వెంట వెంటనే శుభకార్యాలయిన పక్షంలో కష్టం కదా! అదీ కాక శుభకార్యాలు వరసగా జరుగుతున్న పక్షంలో అసూయ నిండిన కళ్లు ఎంత బాధపడతాయో కదా! ఆబ్దికం రోజున సంధ్యావందనం చేయవచ్చా? చేస్తే ఎంతవరకూ చేయాలి? నిజానికి ఆబ్దికం రోజున జందేన్ని మార్చుకుని మరీ సంధ్యావందనాన్ని చేయాలి. సంధ్యావందనాన్ని చేయని పక్షంలో ఏ కర్మనీ నిర్వహించే అధికారం యజమానికి సిద్ధించదు. పూర్తి సంధ్యావందనాన్ని ఆబ్దికానికి ముందు చేసి, మంత్ర తంత్ర కర్తృ భోక్తృలోపాలేవైనా ఉంటే వాటి నివారణకై దశ గాయత్రిని ఆబ్దిక కాలంలో జపించాలి. తలస్నానం చేయకుండా ఉపవాసం, పూజలు చేసినా ఫలితం ఉండదా? శరీరమనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పుణ్యకార్యమైనా అది చేయగలుగుతుంది. (శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్ు). అవకాశం ఉన్నంతలో – అంటే ఆరోగ్యం ఏమాత్రమూ దెబ్బతినదని అన్పించిన పక్షంలో– తలస్నానం చేసి ఉపవాసం, పారాయణం చేయండి. ఆరోగ్యం బాగుండి కూడ ఈ వంకతో నియమాన్ని పాటించక పోవడం నేరమే. -
ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా మహిళల పూజలు
-
ప్రజల మేలు కోసం ప్రత్యేకపూజలు చేయండి
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌రాష్ట్ర డైరెక్టర్ జ్యోషి గోపాలశర్మ అలంపూర్ రూరల్: ఈ నెల 7వ తేదీన సంభవించే కేతుగ్రస్త చంద్ర గ్రహణం నుంచి రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు ప్రజల మేలు కోసం బ్రాహ్మణులంతా గ్రహణ కాల సమయంలో ప్రత్యేక పూజలు, అనుష్టానాలు చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ రాష్ట్ర డైరెక్టర్ జ్యోషి గోపాలశర్మ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రుడు మనోఃకారకుడు కావడంతో ప్రజలు మానసిక అశాంతికి గురి కాకుండా ఉండాలంటే కేతు, చంద్ర గ్రహాలకు ప్రత్యేక జపాలు, అనుష్టానాలు నిర్వహించాలని అన్నారు. పురోహితుడు అంటే పురానికి హితం చేసేవారని నిరూపించే సమయం బ్రాహ్మణులకు వచ్చింది కాబట్టి అందరి యోగ క్షేమం కోసం గ్రహణ కాలంలో ప్రతి బ్రాహ్మణుడు శ్రద్దగా పూజలు చేసి విశ్వసనీయతను చాటుకోవాలన్నారు. ఇదిలాఉండగా, గ్రహణకాల సమయంలో గర్భవతులు జాగ్రత్తలు పాటించాలని, సోమవారం సాయంత్రం 5గంటల లోపు భోజనాలు ముగించి విశ్రాంతి తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నింటినీ సోమవారం మధ్యాహ్నం మహానివేదనలు చేసి ముగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, ప్రముఖ వేద పండితులు బుచ్చయ్య శాస్త్రి, గణేష్ శర్మ ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని మంగళవారం స్థానికులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం మహిళలు భక్తులు ఆలయాలను దర్శించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దవాగులో వేకువజామున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణవాడలోని పండరినాథ్, బాలేశ్వర, షిర్డీ సాయిబాబా, మార్కం డేయ స్వామి, శివకేశవ మందిరాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో భజనలు నిర్వహించారు. ఉపవాసదీక్షలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా అర్చకుడు ఢిల్లీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఏకాదశి పదకొండు సంఖ్యలకు సంకేతమని, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు, వెరసి పదకొండింటిపైనా నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నదే ఈ పండగ సందేశమన్నారు. -
‘దొంగ’ భక్తిని దేవుడు మెచ్చుతాడా?
ఆత్మీయం ఇటీవల కొందరు ‘పెద్ద’ మనుషులు తెల్లవారీ, తెల్లవారక ముందే బుట్టలు పట్టుకుని వాకింగ్‌కి వెళుతూ, తిరిగి వచ్చేటప్పుడు ప్రతి ఇంటి గోడ మీదకు ఎగబడి, దొంగతనంగా పూలు కోసుకుని ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికి వెళ్లగానే అలా ‘కష్టపడి’ కోసుకు వచ్చిన పూలతో పూజలు చేస్తున్నారు. ఆ పూలమొక్కలు పెంచుకున్న ఇంటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో మొక్కలకు ఆ పూలు పూసిన విషయం కూడా తెలిసే అవకాశం లేకుండా... ఇంటివారు నిద్ర లేవక ముందే వాళ్ళ ఇంటి గోడమీద నుంచి పూలు అన్నీ కోసుకుని వెళ్లే వీరభక్తులు మొదలయ్యారు. ప్రతి కాలనీలోనూ, ప్రతి ఊరిలోనూ ఇలాగే జరుగుతోంది. పోనీ అలా కోసుకు వెళ్లేది ఒకటో, రెండో పూలు కాదు.. బుట్టలు తెచ్చుకుని మరీ కోసుకెళతారు. అలా దొంగతనం చేసుకు వచ్చిన పూలతో చేసిన పూజలను దేవుడు మెచ్చుకుంటాడా? ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరం. -
పూజలు పెళ్లి కోసమేనా?
నటి అనుష్కకు ఇటీవల దైవ చింతన పెరిగిందా? తరచూ ఆలయ దర్శనాలు, అర్చనలు, దోషనివారణ పూజలు చేస్తున్న ఈ భామ నటనపై ఆసక్తి తగ్గించుకున్నారా? వీటన్నింటికీ కారణం పెళ్లేనా? ఇవే ప్రస్తుతం చిత్ర వర్గాల్లో అనుష్క గురించి చర్చలు. బాహుబలి–2 చిత్రం తరువాత ఈ బ్యూటీ ప్రేమ, పెళ్లి గురించి ప్రచారం బాగా జరుగుతోందని చెప్పవచ్చు.అంతే కాదు నటుడు ప్రభాస్‌తో ప్రేమాయణం అని, త్వరలోనే ఆయనతో ఏడడుగులకు సిద్ధం అవుతున్నారనే వదంతులు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం స్వీటీ ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని, అంతకు మించి ఏమీ లేదని ఇటీవల క్లారిటీ ఇచ్చేశారు. అదే విధంగా ఇకపై తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయినా అనుష్క గురించి ప్రేమ, పెళ్లి ప్రచారాలు ఆగడం లేదు. అందుకు కారణం ఆమె చర్యలే కావచ్చు. ఆ మధ్య బెంగళూర్ సమీపంలోని మూకాంబికాదేవి ఆలయానికి తన కుటుంబ సబ్యులు సహా వెళ్లి విశేష పూజలు నిర్వహించారు. తాజాగా దోష నివారణ పూజలకు ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి దోష నివారణ పూజలు నిర్వహించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అనుష్క పెళ్లి కోసమే ఆమె తల్లిదండ్రులు పూజలు చేయిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని అనుష్క కుటుంబ సభ్యులు కొట్టిపారేస్తున్నారనుకోండి. ఏదేమైనా అనుష్క చేతిలో భాగమతి అనే ఒకే ఒక్క చిత్రం ఉంది. బాహుబలి తరువాత ఒక్క కొత్త చిత్రాన్ని ఆమె అంగీకరించలేదు. అదే విధంగా చిన్న హీరోలతో చిత్రాలు చేయడానికి అంగీకరించడంలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక సంఘమిత్ర చిత్ర అవకాశాన్ని నిరాకరించారనే టాక్ వైరల్ అవుతోంది. బాహుబలి చిత్రం మాదిరి మరో రెండేళ్లు సంఘమిత్రకు వెచ్చించడానికి ఇష్టం లేకే ఈ అవకాశాన్ని నిరాకరించినట్లు ప్రచారం అవుతోంది. -
బ్రహ్మోత్సవ గిరి
పుణ్యతీర్థం శివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరునికి, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవునికి నిలయమైన పుష్పగిరి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. పంచనదీ సంగమక్షేత్రంగా వాసికెక్కింది. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ త్రయోదశి నుంచి వైశాఖ శుద్ధ సప్తమి వరకు పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ 28న శ్రీ చెన్నకేశవుని చందనోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. 29న అక్షయ తదియ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలి వస్తారు. 30న ముత్యాల తలంబ్రాలతో శ్రీ కామాక్షీ వైద్యనాథుల, శ్రీ లక్ష్మీ చెన్నకేశవుల కల్యాణోత్సవాలు, మే1న ఇరువురు స్వాముల రథోత్సవాలు జరగనున్నాయి. స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం పుష్పగిరిని విశేషంగా పేర్కొంది. ఇందులో పుష్పగిరి క్షేత్రంగానే కాక తీర్థంగా కూడా కొనియాడబడింది. పుష్పగిరిలో ఒక్కరోజు ఉపవాసం వుండి ఆయా దేవతలను దర్శిస్తే ఈలోకంలోనే కాక పరలోకంలో కూడా సౌఖ్యం లభిస్తుందని స్థల పురాణం చెపుతోంది. సూర్యగ్రహణ సమయంలో కానీ, అక్షయతృతీయ రోజున గానీ సంకల్ప పూర్వకంగా పినాకినీలో స్నానం చేసి శివ కేశవులను దర్శిస్తే వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఇక్కడ శ్రాద్ధ కర్మలు చేయడం ఎంతో ఫలదాయకమని, గయ క్షేత్రంలో చేసే పిండ ప్రదానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం ఇక్కడ ప్రవహిస్తున్నపినాకినీ నది పాపాగ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదుల సంగమమై ప్రవహిస్తూ పంచ నదీ సంగమంగా వాసికెక్కింది. ఇక్కడ స్నానాలాచరిస్తే సకల పాపాలూ హరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అబ్బుర పరిచే శిల్ప సంపద కొండపైన గల చెన్న కేశవ స్వామి ఆలయ కుడ్యాలపై వున్న శిల్ప సంపద మన వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాళీయ మర్దనం, క్షీర సాగర మదనం, తాండవ కృష్ణుడు, నారసింహుడు, యోగ నారసింహ మూర్తి, కృష్ణార్జున యుద్ధ ఘట్టం, ప్రత్యేకతను సంతరించుకున్న నృత్య గణపతి శిల్ప సంపద చూపరులను ఆకర్షిస్తుంది. శ్రీరామునిచే పూజలందుకున్న వైద్యనాథేశ్వరుడు ఒక ఇతిహాసం ప్రకారం శ్రీ రామచంద్రుడు రావణుని సంహరించేందుకు లంకకు వెళుతూ ఈ ప్రాంతంలో కొంతకాలం న్నాడు. ఆయన ప్రతిరోజూ ఇక్కడి వైద్యనాథేశ్వరుని పుష్పాలతో పూజించి, ముందురోజు పూజకుపయోగించిన పూలను తీసి నదిలో వేసేవాడు. కొన్నాళ్లకు ఆ పూల రాసి క్రమంగా కొండంత పెరిగి, నీటిలో తేలియాడింది. దీంతో పుష్పగిరి అనే పేరు వచ్చిందనే కథ ప్రచారంలో వుంది. ఆది శంకరాచార్యులు స్థాపించిన అద్వైత పీఠం శ్రీ జగద్గురువు ఆది శంకరాచార్యుల చేతుల మీదుగా దక్షిణాదిలో స్థాపించబడిన ఏకైక అద్వైత పీఠంగా పుష్పగిరిలోని పీఠం ప్రఖ్యాతి గాంచింది. స్వయంగా ఆది శంకరాచార్యుల శిష్యులైన శ్రీ విద్యారణ్య భారతి స్వామి అధిష్టించి ధర్మపాలన చేసిన పీఠం. ఆయన పరంపరగా శ్రీ విద్యా శంకర భారతి స్వామివారు ప్రస్తుతం ఈ పీఠానికి పీఠాధిపతిగా ధర్మ సంస్థాపనకు కృషి చేస్తున్నారు. ఈ పీఠంలోని మహిమాన్విత చంద్రమౌళీశ్వరుని రూప స్ఫటిక లింగం కైలాసం నుండి నేరుగా ఇక్కడి పీఠంలో వెలసిందని ప్రతీతి. ఈ స్ఫటిక లింగానికి అనునిత్యం పూజలు జరుగుతాయి. విశిష్టమైన శ్రీ చక్రం పుష్పగిరిలోని వైద్యనాథేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో వున్న శ్రీ కామాక్షీదేవి ఆలయంలో అమ్మవారికి ఎదుట ఎంతో విశిష్టత కల శ్రీచక్రం వుంది. చతుర్దశ భువనాలకు అధికారిణి అయిన కామాక్షీ దేవి శ్రీచక్ర సంచారిణి అని ప్రతీతి. ఇక్కడి అమ్మవారి ఎదుట బిందు, త్రికోణ, వసు కోణాలతో దాదాపు 27 అంగుళాల ఎత్తు వున్న మహామేరువు శ్రీచక్రం విజయనగర రాజ్య స్థాపనకు హరి హర బుక్క రాయలను ప్రేరేపించిన శ్రీ విద్యారణ్య స్వామి ప్రతిష్టితమని స్థలపురాణం చెబుతోంది. దర్శించాల్సిన ఆలయాలు పుష్పగిరి గ్రామంలో శ్రీ వైద్యనాథ స్వామి, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి, లక్ష్మీనారాయణ స్వామి, భీమలింగేశ్వర స్వామి ఆలయం, త్రికూటేశ్వర స్వామి ఆలయంలో త్రికూటేశ్వరుడు, భీమేశ్వరుడు, ఉమా శంకరుడు, అభినవ చెన్న కేశవ స్వామి, పాతాళ గణపతి, పుష్పగిరి పీఠం. పుష్పగిరి కొండపైన శ్రీ చెన్న కేశవ స్వామి, లక్ష్మీ దేవి, ఆంజనేయ స్వామి, సంతాన మల్లేశ్వర, సాక్షి మల్లేశ్వర, రుద్రపాదం, దుర్గ, ఇంద్ర నాథేశ్వర ఆలయాలను సందర్శించవచ్చు. చేరుకోవడం ఇలా వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప పట్టణానికి 18 కి. మీ దూరంలో పుష్పగిరి వుంది. అక్కడి నుండి బస్సులు, ఆటోల్లో పుష్పగిరికి చేరుకోవచ్చు. కడప రైల్వే స్టేషన్ నుండి దాదాపు 18 కి. మీ దూరం వుంటుంది. – నవనీశ్వర్‌రెడ్డి సాక్షి, వైఎస్సార్ జిల్లా -
కనుల పండువగా వైకుంఠ ఏకాదశి
ఆలయాల్లో భక్తులు కోలాహలం నిర్మల్(మామడ) : వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. మండలంలోని పొన్కల్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ గంగాధర్, భక్తులు హరీశ్‌కుమార్, గంగారెడ్డి, భూమేశ్వర్, హన్మంత్‌రావులు పాల్గొన్నారు. దిలావర్పూర్ : స్థానిక రామాలయంతో పాటు అత్యంత ప్రాచీన ప్రాశస్త్యంగల మండలంలోని కదిలి పరిసర అటవీప్రాంతంలోని పాపహేశ్వరాలయంలో, కాల్వ పరిసర అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీలక్షీ్మనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో స్థానిక సర్పంచ్ నంద అనిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధనె నర్సయ్య, వీడీసీ నాయకులు ధనె రవి, గుణవంత్‌రావు, ఉమాశంకర్, ఎస్ఎంసీ చైర్మన్ నందముత్యం, సప్పలరవి, కదిలిలో మాజీ చైర్మన్ నార్వాడి సంభాజీరావుపాటిల్, నాయకులు యన్ .భుజంగ్‌రావు, భూమేశ్, నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కార్తీక’ శోభ
పరమశివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా‘అనంత’ లోగిళ్లు ‘కార్తీక’ దీపకాంతులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. మహిళల దీపోత్సవంతో ఆలయాల్లో సందడి కన్పించింది. వేకువజామునే పుణ్యస్నానాలతో కార్తీకానికి ఆహ్వానం పలికిన మహిళలు..అనంతరం ఆదికేశవునికి అభిషేకాలు, పూజలతో భక్తిప్రపత్తులను చాటుకున్నారు. - అనంతపురం -
చాకరిమెట్లలో భక్తుల పూజలు
శివ్వంపేట : జిల్లాలో ప్రసిద్ధి చెందిన చాకరిమట్లె శ్రీసహకార ఆంజనేయస్వామి, సత్యనారాయణస్వామి ఆలయాల్లో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జంట నగరాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. దంపతులు సత్యనారాయణస్వామి మంటపంలో సామూహిక వ్రతాలు ఆచరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, పౌండర్ ఆంజనేయశర్మ, ఈఓ సారశ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
గోదావరికి పుష్కర పూజలు
ఏటూరునాగారం : అంత్య పుష్కరాలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని రామన్నగూడెం గోదావరి నదిలో బుధవారం భక్తులు పుష్క రస్నా నం చేశారు. అలాగే కాజీపేటలోని స్వయం భూ శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ సిద్ధాంతి అనం త మల్లయ్యశర్మ ఆధ్వర్యంలో అక్కడి దేవతమూర్తు ల ఉత్సవ విగ్రహాలకు కూడా స్నానం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది పుష్కరాల సమయంలో దేవతామూర్తులకు గంగస్నానం చేయించినట్లు చెప్పారు. భక్తులు గోదావరిని పవిత్ర నదిగా భావించి పూజలు చేయాలన్నా రు. కాగా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరిలో పుష్కరస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు కూడా చేశారు. అలాగే నది లో దీపాలను వదిలి ఆడబిడ్డలకు నూతన వస్త్రాలను వాయినాలుగా అందజేశారు. కార్యక్రమంలో ఎడ్లమల్ల రవీందర్ సిద్ధాంతి, చొక్కారావు, నాగార్జున, రజిత, నాగమణి, సీతమ్మ పాల్గొన్నారు. గోదావరికి పూజలు మంగపేట : అంత్యపుష్కరాల్లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించారు. ఈ సందర్భం గా పలువు రు మహిళలు గోదావరి నదిలో పసుపు, కుంకుమ, పూలు, దీపాలు వదిలి గంగమ్మకు పూజలు చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గం టల వరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడం తో పుష్కరఘాట్ వద్ద సందడి నెలకొంది. సాయంత్రం వేళలో అర్చకులు గోదావరి నదికి హారతి ఇచ్చారు. -
కృష్ణమ్మ ఒడిలో..
-
అప్పన్న సన్నిధిలో వైవీఎస్ చౌదరి
సింహాచలం :సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి మంగళవా రం సింహాచలం శ్రీవరాహలక్ష్మీనసింహస్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాల యం లో అషో్టత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశా రు. స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు. . -
నాలుకలుకలు
చేతనబడి మనసులో దోషం ఉంటే... నాలుక వంకర్లు తిరుగుతుంది. జనంలో అమాయకత్వం ఉంటే... ప్రకృతిలో వికృతి కనిపిస్తుంది. మోసం చేసే వాళ్ల మాట... నరం లేని నాలుక. ఏ ఎండకా గొడుగులా... ఏ చెట్టుకా పుట్టలా... ఈ మోసానికీ ఓ పుట్ట ఉంది. ఓ గొడుగూ ఉంది! దీనంతటి వెనకాల... లుకలుకలు ఉన్నాయి. హుండీని చప్పరించిన నాలుకలుకలున్నాయి. ఉదయం ఏడవుతోంది. పద్మలత వంటగదిలో హడావుడిగా ఉంది. ‘‘నరసమ్మ ఇంకా రాలేదు. అంట్ల గిన్నెలు ఎప్పుడు కడగాలి, ఇల్లు ఎప్పుడు ఊడవాలి’’.. విసుక్కుంటోంది. ‘పైకి ‘నరసమ్మ ఇంకా రాలేదు’ అంటోంది. కానీ లోలోపల మాత్రం ‘ఇక రాదేమో’ అనే భయం. రాకపోతే ఆ పనులన్నీ తాను చేసుకోవాల్సిందేననే భయం. ఆ భయం ఆమె మాటల్లోనూ ధ్వనిస్తోంది. అంతలోనే వచ్చింది నరసమ్మ. ఆలస్యమైందని పద్మ అడగడానికి అవకాశమివ్వకుండా తానే మొదలుపెట్టింది. ‘‘అమ్మోరికి కోపమొచ్చిందమ్మా! తాంబూలం పెట్టి శాంతి చేసి సల్లంగా కాపాడమని మొక్కి వచ్చిన’’ అన్నది. ఆలస్యంగా వచ్చినందుకు కోప్పడే అవకాశం కూడా ఇవ్వని నరసమ్మ లౌక్యానికి ఉడికిపోయింది పద్మలత. అంతలోనే... ఆలస్యంగానైనా వచ్చింది. రేపొచ్చి ఇదే మాట చెప్పినా చేయగలిగిందేముంది. పనంతా నేను చేసుకోవడమే మిగిలేది... అని సమాధాన పడింది. అమ్మో! కోపమే!! ఎలా మొదలైందో తెలియదు, ఎప్పుడు మొదలైందో తెలియదు. టౌన్లో చాపకింద నీరులా ప్రవహిస్తోంది. ఎవరి నోట విన్నా ‘‘అమ్మోరికి కోపం వచ్చిందంట’’ అనే మాట తప్ప మరొక ప్రస్తావన ఉండడం లేదు. సీతాలక్ష్మికి పని పూర్తయిందా, కబుర్లలోకి దించవచ్చా... అని పక్క పోర్షన్లోకి తొంగి చూసింది పద్మ. ఆమె కనబడగానే నేరుగా విషయంలోకి వచ్చింది. ‘‘అమ్మోరికి కోపం ఎందుకొచ్చింది’’ అడిగింది పద్మలత పక్కింటి సీతాలక్ష్మిని. ‘‘ఏమో! ఎవరికి తెలుసు? ఏటా పూజలు చేయకపోయినా ఆగ్రహం వస్తుందట’’ కారణం తెలియకపోయినా తనకు తెలిసిన విషయానికి కొంత స్వపరిజ్ఞానాన్ని జోడించింది సీతాలక్ష్మి. ‘‘అమ్మోరు... కోపం వచ్చిందని ఎవరికి చెప్పింది మమ్మీ, ఎవర్ని కోప్పడింది? అమ్మోరు ఎలా ఉంటుంది? అమ్మోరు మాట్లాడుతుందా’’.. పద్మలత కూతురు పూజిత అడిగింది. మూడు రోజులుగా ఆ పసి మెదడును తొలుస్తున్న తార్కిక సందేహాలకు సమాధానం కోసం ఇద్దరినీ మార్చి మార్చి చూస్తోంది పూజిత. ఆ చిన్ని మెదడును ఇంకా విశ్వాసపు పొరలు అలుముకోలేదు. కాబట్టి తార్కికతను కాపాడుకుంటోంది చిట్టిబుర్ర. ‘‘అమ్మోరంటే మనిషి కాదు, దేవత. ఆ వేపచెట్టు లేదూ! మనకు తెలియదు కానీ, అది అమ్మోరు చెట్టంట. పూజలు చేస్తున్నారు. నువ్వు స్కూలుకెళ్లే దారే కదా! చూడలేదా?’’ పూజితను రెట్టిస్తోంది పద్మలత. ‘‘మేము దొంగ-పోలీస్ ఆడుకునే చెట్టుకి చీర కట్టారు. మమ్మల్ని ఆడుకోనివ్వడం లేదక్కడ’’ బుంగమూతి పెట్టింది పూజిత. ‘‘ఏంటీ! చెట్టుకి చీరకట్టారా’’ ఆశ్చర్యపోయింది పద్మ. ‘‘ఒక్క చీరేంటి? వేపమాను చుట్టూ దారాలు కట్టారు. పూలదండలు వేశారు. ముత్తయిదువకు తాంబూలం పెట్టినట్లు రవికె గుడ్డ, పండ్లు, ఆకు-వక్కలు, డబ్బులు పెడుతున్నారు. గుడి కడతారంట. మూడు రోజుల్లోనే హుండీ డబ్బా నిండిపోయింది...’’ తాను విన్నవి, కన్నవి కలిపి చెప్పుకుపోతోంది సీతాలక్ష్మి. ‘‘మనమూ వెళ్దామా!!’’ ఉత్సాహపడుతోంది పద్మ. ‘‘పిల్లల్ని స్కూలుకు పంపించి మధ్యాహ్నం పోదాం. పిల్లలు ఇంటికొచ్చేలోగా వచ్చేయచ్చు’’ అంగీకారాన్ని తెలిపింది సీతాలక్ష్మి. చెట్టుకు నాలుక! నిజామాబాద్ జిల్లా కేంద్రం, న్యాల్కల్ రోడ్‌లోని వివేకానంద నగర్ కాలనీలో ఓ ఇంటి ముందు పెద్ద వేపచెట్టు. ఏళ్లనాటి వృక్షం. చెట్టు చుట్టూ వెడల్పాటి చప్టా. దాని మీద చెట్టు మొదలు నుంచి రెండడుగుల పైన చీర చుట్టి ఉంది. బెరడు చీల్చుకుని చొచ్చుకుని వచ్చినట్లుంది చిన్న ఆకారం. ‘‘అదిగో అమ్మోరు ఆగ్రహంతో నాలుకెళ్లబెట్టింది చూడు’’ అని పద్మలతకు చూపించింది సీతాలక్ష్మి. ‘‘చెట్టు నుంచి నాలుక బయటకు వస్తుందా’’ మనసులోని సందేహం బయటకు వచ్చేసింది, కానీ వెంటనే నాలుక జారాననుకుని లెంపలు వేసుకుంది పద్మ. ‘‘అవునమ్మా! అమ్మోరి నాలుకే. పూజ చేసేటప్పుడు చేయి తగిలితే మెత్తగా మనిషి నాలుక ఉన్నట్లే ఉంది. ఊరందరికీ చెప్పి గుడి కట్టిస్తానమ్మా, ఆగ్రహించకు, శాంతించమని మొక్కా! నా మాట పోనివ్వకుండ్రి తల్లులూ’’ అని అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకూ చెప్తోంది అక్కడే కూర్చుని ఉన్న మారెమ్మ. ‘‘ఊరిని చల్లంగా కాపాడాలని వానలు కురిపించిందన్న జ్ఞానమైనా లేకపోయె. అమ్మోరికేం చేశాం. ఒక్క కొబ్బరికాయ కొట్టామా!’’ ఆరోపిస్తోందామె. మారెమ్మ జుట్టు జడలు కట్టి ఉంది. మెడలో తెల్ల పూసల దండలు రెండు. పలుపు లాంటి కాషాయరంగు దారపు దండ, రుద్రాక్ష దండలు, చేతులకు నిండుగా పచ్చగాజులు, కాళ్ల వేళ్లకు బరువైన మట్టెలు చూడగానే ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పక్కనే అనుచరురాలి చేతిలో వేపమండలు. కొత్తగా వచ్చిన వాళ్లు చెట్టును వదిలి మారెమ్మను చూస్తూ... మంత్రం వేసినట్లు ఆమె చెప్పే మాటల మీదనే లగ్నమైపోతున్నారు. తల్లి మనసు! ‘‘నువ్వు రేడియో స్టేషన్ ఎదురుగా ఉండేదానివి కదా!’’ ఆమెను గుర్తు పట్టింది పద్మలత. ‘‘అవునమ్మాయి! రేణుక ఎల్లమ్మ కల్లోకొచ్చి చెబితే అక్కడే ప్రతిష్టించా. అక్కడ గుడి కట్టలేదని అమ్మోరు ఏకంగా నేనుండే ఇంటి ముందుకే వచ్చింది’’ అని చెప్తూ మారెమ్మ అరమోడ్పు కళ్లతో అలౌకికానందాన్ని పొందుతోంది. ఆమె మాటల్లో ఏదో ఆకర్షణ ఉంది. వినేవాళ్లు మాయ కమ్మేసినట్లవుతారు. ‘‘ఊరిని కాపాడమ్మా! పిల్లలకు గాలిసోకకుండా రక్షించమ్మా!! బాలింతలను, చూలింతలను ఓ కంట కనిపెట్టు తల్లీ! నీకు దణ్ణం పెడతా తల్లీ! ఊరి బిడ్డలంతా నీ బిడ్డలే తల్లీ. నీ బిడ్డలంటే నాకూ బిడ్డలే. ఏ ఒక్క బిడ్డ జ్వరాన పడకుండా ఊరిని కాచుకో అమ్మోరు తల్లీ!’’ అంటూ పాటపాడినట్లు వేడుకుంటోంది మారెమ్మ. చిన్న పిల్లల తల్లుల మనసును తాకిందా మొక్కు. ‘‘పిల్లలకు చీడ సోకకుండా దారం మంత్రించి ఇవ్వమ్మా’’ అడుగుతోంది సీతాలక్ష్మి. కొబ్బరికాయ, పూలు, పండ్లు, తాంబూలం, కానుక డబ్బులకు ఖర్చు కాగా, ఇంకా పర్సులో ఎంత మిగిలి ఉందో చూసుకుంది పద్మలత. చెట్టుకు పూచిన గొడుగు! ‘‘మమ్మీ! నువ్వు వద్దన్నా వినకుండా నా మెడలో దారం కట్టావు చూడు! అంతా హంబక్ అంట’’ స్కూలు నుంచి వచ్చిన పూజిత మెడలో దారాన్ని బయటకు తీసి చూపిస్తోంది. దాన్ని తీసేయాలని ఉన్నా అమ్మ కోప్పడుతుందేమోననే బెరుకు ఆ పాప కళ్లలో. హంబక్ అన్న తన మాటను అంగీకరిస్తే ధీమాగా తీసేయవచ్చనే పెద్ద వ్యూహం పూజితది. పద్మలత రియాక్షన్ కోసం కళ్లలోకే చూస్తోందా పాప. ‘‘అమ్మో! తీస్తే అమ్మోరికి కోపం వస్తుంది. నీకు జ్వరం వస్తుంది. తియ్యకూడదు. అసలే ఊరి మీద కోపంతో అమ్మోరి నాలుక చాచింది చూళ్లేదా’’ కళ్లు పెద్దవి చేసి నోటిని సున్నాలా చుట్టి, నోటి మీద వేలు పెట్టి మరీ భయం చెప్పింది అక్కడే ఉన్న సీతాలక్ష్మి. ‘‘అది అమ్మోరి నాలుక కాదమ్మా! మష్రుమ్ నాలుకంట. ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకున్నారు. చాలా మంది వచ్చారు. ఆటో అంకుల్ని ఇంకొద్దిసేపు ఉండమంటే వినకుండా తెచ్చేశాడు’’ అలుకగా అంది పూజిత. మాటల్లోనే నరసమ్మ వచ్చింది. ‘‘అవ్ అమ్మా! నాలుకను విరిచి చూపించారు. అంతా మారెమ్మ మాయ. ఇట్టాంటి మాయలెన్ని చూసినా మళ్లీ కొత్త మాయలోళ్ల మోసంలో మోసపోతాం. ఒట్టి ఎర్రిబాగులోళ్లం’’ అంటూ గదులు ఊడవడానికి చీపురు తీసుకుంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి గమనిక: కథనంలో పాత్రల పేరు మార్చడమైంది వాన పడింది! శిలీంధ్రం మొలిచింది!! వర్షాలకు చెట్టు బెరడులో నీరు నిలిచి ఫంగస్ పెరిగింది. చెట్టు మొదళ్ల మీద పుట్టగొడుగులు మొలుస్తుంటాయి కదా! అదే ఇది కూడా. అయితే ఇది బెరడులో చీలిక మధ్యగా విస్తరించి అడ్డంగా లావుగా తయారైంది. దానిని నాలుకగా నమ్మించే ప్రయత్నం చేసింది మారెమ్మ. ఆమెకు గతంలోనూ ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. ఎల్లమ్మ గుడి కడతానని చెప్పేదట. దేవుడి గుడి అనే నమ్మకంతో వచ్చిన వాళ్లకు భవిష్యత్తు చెప్తానని డబ్బు దక్షిణ తీసుకోవడం, దారాలు కట్టి డబ్బు హుండీలో వేయించుకోవడం వంటివి చేసేదని తెలిసింది. అప్పుడు కొందరు స్థానికులే ఆమెను మందలించి రేడియో స్టేషన్ దగ్గర నుంచి పంపించేశారు. ఇప్పుడు తాను అద్దెకుండే ఇంటి ముందు వేప చెట్టు చుట్టూ కథ అల్లింది. మేము దానిని విరిచి చూపించిన తర్వాత అందరూ అది పుట్టగొడుగేనని నమ్మారు. శాస్త్రీయంగా ఆలోచించమని చెప్పాం. - నర్రా రామారావు, జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
గోదావరి జలాలకు పూజలు
రంగన్నగూడెం (హనుమాన్‌జంక్షన్ రూరల్) / గన్నవరం రూరల్ : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు పోలవరం కుడికాలువ ద్వారా శుక్రవారం బాపులపాడు మండలానికి చేరాయి. మండల పరిధిలోని రంగన్నగూడెం వద్ద ఉదయం ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు నీటికి హారతులిచ్చారు. జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణారావు, ఎంపీపీ తుమ్మల కోమలి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వి.వీర్రాజు పూజలు నిర్వహించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వీర్రాజు మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం కాలువలో 2400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, ఎన్ఎస్పీ నూజివీడు ఓ అండ్ ఎం ఈఈ అర్జునరావు, జగ్గయ్యపేట ఎన్ఎస్పీ ఈఈ శ్రీనివాసరావు, పోలవరం డీఈఈ జె.ప్రసాద్, ఏఈ శ్యామ్‌కుమార్, సర్పంచి ప్రసన్నరావు పాల్గొన్నారు. కొత్తగూడెం చీమలవాగు యూటీ వద్ద.. కొత్తగూడెం(గన్నవరం రూరల్) : మండలంలోని కొత్తగూడెం చీమలవాగు అండర్ టన్నెల్ వద్ద శుక్రవారం పోలవరం కాలువ నీటికి రాష్ర్ట జలవనరుల శాఖ అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు పూజలు చేశారు. నీరు శుక్రవారం ఉదయం 11 గంటలకు బల్లిపర్రు గ్రామానికి నీరు చేరాయి. బల్లిపర్రు, తెంపల్లె, వీరపనేనిగూడెం, కొత్తగూడెం, చింతగుంట, గొల్లనపల్లి, గోపవరపుగూడెం, కట్టుబడిపాలెం దాటి సూరంపల్లి వద్దకు పోలవరంలో నీరు మధ్యాహ్నం 3 గంటలకు చేరాయి. -
సరిగమల శిల్ప సంపద!
పుణ్యతీర్థం రాజుల కాలం పోయింది. రాజ్యాలు అంతరించాయి. అప్పట్లో కాకతీయులు నిర్మించిన కట్టడాలు, ఆలయాలు అప్పటి కళావైభవం, భక్తి భావానికి ప్రతీకగా... చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. శివుని మీద ఉన్న అపారమైన భక్తితో కాకతీయులు రామప్ప దేవాలయాన్ని నిర్మించారు. వరంగల్ జిల్లాలో నిర్మించిన కాకతీయ కట్టడాలన్నింటిలోనూ రుద్రేశ్వరుడిని ప్రతిష్టించి దైవభక్తి, ప్రత్యేకతను చాటారు. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు 1213 సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. 40 ఏళ్ల పాటు ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప పేరునే ఆలయానికి నామకరణం చేయడం కాకతీయుల గొప్పతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేక పద్ధతులతో ఇక్కడ పూజలు జరుగుతాయి. ప్రపంచ వారసత్వ సంపదగా పిలువబడుతున్న రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించినట్లయితే భవిష్యత్ తరాలకు వరంగా మారనుంది. 803 ఏళ్ల కట్టడం రామప్ప దేవాలయం నిర్మించి 803 ఏళ్లు దాటినా ఆలయ శిల్పాలు చెక్కు చెదరలేదు. ఆలయం నిర్మించిన 1213 నుండి 1323 వరకు ఇక్కడ నిత్య పూజలు జరిగాయి. కాకతీయ సామ్రాజ్యం ఆనంతరం 1910 వరకు ఆలయంలో ఎలాంటి పూజలు జరగలేదు. 1911లో నిజాం ప్రభుత్వం రామప్ప ఆలయాన్ని గుర్తించి స్వల్ప మరమ్మతులు చేపట్టి ఆలయాన్ని వినియోగంలోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఏటా రామప్పలో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శివపార్వతుల కళ్యాణం, అగ్నిగుండాలలో నడిచే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. విద్యుత్తు లేకుండా వెలుగు ఆలయ గోపురాన్ని నీటిలో తేలాడే ఇటుకలతో నిర్మించారు. గోపురం ఇటుకలను తీసి నీళ్లలో వేస్తే అవి తేలుతాయి. ఇలా మరెక్కడా జరగదు. రామప్ప రామలింగేశ్వరునికి మరో ప్రత్యేకత ఉంది. ఏ ఆలయంలో అయినా గర్బగుడిలో వెలుతురు ఉండదు. అన్ని చోట్ల విద్యుత్ బల్బులు ఏర్పాటు చేస్తారు. రామప్ప ఆలయంలో మాత్రం సూర్యోదయం నుండి సుర్యాస్తమయం వరకు గర్భగుడిలోని రామలింగేశ్వరుడు కాంతివంతంగానే దర్శనమిస్తాడు. ఆలయంలో ఎర్పాటు చేసిన మంటపం స్థంభాలపై పడే సూర్యకాంతి పరావర్తనం(రిఫ్లెక్ట్) చెంది గర్భగుడిలోని శివలింగం కాంతివంతంగా దర్శనమిస్తుంది. పూజలకు సంబంధించీ ఇక్కడ ప్రత్యేకత ఉంది. ప్రతీ ఆలయంలో మధ్యాహ్నం వరకే పూజలు నిర్వహిస్తారు. రామప్ప ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూజలు నిర్వహిస్తారు. ‘ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అభిషేకాలు, ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అర్చన పూజలు నిర్వహిస్తాం’ అని ఆలయ పూజారులు కోమల్లపల్లి హరీష్‌శర్మ, ఉమాశంకర్ లు వివరించారు. శిల్పకళా అందాలు రామప్పకే సొంతం రామప్ప ఆలయం శిల్ప కళాసంపదకు ప్రసిద్ధి. శిల్పాలను నిశితంగా పరీశీలిస్తే... ద్వాపర, త్రేతాయుగాల చరిత్ర, జైన, బౌద్ధ మతాల అంశాలు, ఈజిప్టు మమ్మీలు, వాస్తు, జ్యోతిష్యం, నాట్యం, నీతి, శంగారం, లౌకితత్వం, చరిత్ర, హేతువాదం, క్రీడలు, అధునిక సైన్స్ పరిజ్ఞానం శిల్పాల్లో కనిపిస్తుంది. ఆలయంలో తూర్పు ముఖద్వారం వైపు గణపతి విగ్రహాన్ని ఎర్పాటు చేశారు. ఆలయంలోని స్థంభానికి దిష్టిచుక్క పెట్టారు. ఈ అంశాలను పరిశీలిస్తే కాకతీయులు ఆ కాలంలోనే వాస్తును బాగా నమ్మినట్టు తెలుస్తోంది. గర్భగుడికి ఎడమవైపున ఉన్న పొన్న చెట్టు శిల్పాన్ని చేతి వేళ్లతో గీటితే సంగీత(సరిగమపదనిస) స్వరాలు వినిపిస్తాయి. తేలియాడే ఇటుకలు గణపతిదేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు 1213 సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు 40 ఏళ్ల పాటు ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప పేరునే ఆలయానికి నామకరణం చేశారు గోపురం ఇటుకలను తీసి నీళ్లలో వేస్తే తేలి ఉంటాయి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూజలు గర్భగుడికి ఎడమవైపున ఉన్న పొన్న చెట్టు శిల్పాన్ని చేతి వేళ్లతో గీటితే సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఇలా చేరుకోవచ్చు.. వరంగల్ జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో రామప్ప దేవాలయం ఉంది. హైదారాబాద్ నుండి వచ్చే పర్యాటకులు హన్మకొండకు చేరుకుని అక్కడి నుండి ములుగుకు చేరుకోవాలి. ములుగు నుంచి ప్రైవేటు వాహనాలల్లో రామప్ప గుడికి వెళ్లవచ్చు. ఆదిలాబాద్, మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్ నుంచి వచ్చే పర్యాటకులు భూపాలపల్లి, గణపురం క్రాస్‌కు చేరుకోవాలి. అక్కడి నుండి ప్రైవేట్ వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. ఖమ్మం, భద్రాచలం మీదుగా వచ్చే వారు జంగాలపల్లి క్రాస్‌రోడ్‌కు చేరుకొని, అక్కడి నుండి ప్రైవేట్ వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. రామప్పను సందర్శించే పర్యాటకుల, భక్తుల సౌకర్యార్థం టూరిజం శాఖ వారు రామప్ప సరస్సు కట్టపై కాటేజీలు నిర్మించారు. పర్యాటకులు విడిది చేసేందుకు హరిత హోటల్ అందుబాటులో ఉంది. -
కక్షతో ఖలీ పూజలు
ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ కోలుకున్నాడు. ఆదివారం జరుగనున్న మ్యాచ్‌లో తనపై తీవ్రంగా దాడి చేసిన ప్రత్యర్థులపై రివేంజ్ తీర్చుకోవడానికి అతను సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం డెహ్రాడూన్‌లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించాడు. ఈ పూజలో ఖలీతోపాటు అతని అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ బల్దానీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఖలీ తీవ్రంగా గాయపడ్డాడు. ఫైట్ సందర్భంగా రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు కూడా వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్టు కొట్టారు. మొత్తం ముగ్గురు కెనడాకు చెందిన రెజ్లర్లు ఖలీని కుర్చీతో కొట్టడమే కాక బలంగా పంచ్లివ్వడంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందిన ఖలీ శనివారం కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. ‘ది గ్రేట్ ఖలీ షో’లో భాగంగా ఆదివారం జరుగనున్న ఫైట్ కోసం సిద్ధమవుతున్నాడు. తనపై దాడి చేసిన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటానని తన తదుపరి ఫైట్‌లో దెబ్బకు దెబ్బ కొట్టి తన సత్తా చాటుతానని ఖలీ ఇప్పటికే ప్రకటించాడు. 7.1 అడుగుల ఎత్తుతో చూడడానికే రెజ్లర్లకు దడ పుట్టించేలా ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీసు ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ సాధించాడు. భారత్ పేరును రెజ్లింగ్ ద్వారా ఖండాతరాలు దాటేలా చేశారు. -
మేడారంలో బుధవారం ‘మండమెలిగె’
వరంగల్ : సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం మేడారం సిద్ధమవుతోంది. వన దేవతల వారంగా భావించే బుధవారం రోజున... మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలలో జాతరకు శ్రీకారం చుడతారు. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో మేడారం జాతర లాంఛనంగా మొదలవుతుంది. మేడారం మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజ కార్యక్రమాలను ‘మండ మెలిగె’ పేరుతో పిలుస్తారు. మండ మెలిగె పూర్తయితే జాతర మొదలైనట్లేనని ఆదివాసీలు భావిస్తారు. మేడారం జాతర ఈ నెల 17 నుంచి 20 వరకు జరగనుంది. మండ మెలిగె రోజు నుంచి మేడారం జాతర పూర్తయ్యే వరకు ఆదివాసీలు ప్రతి రోజు వన దేవతలకు పూజలు నిర్వహిస్తారు. మండ మెలిగె రోజు నుంచే ఆదివాసీల ఇళ్లకు బంధువులు వస్తారు. ప్రధాన పూజారి(వడ్డె) నేతత్వంలోని బందం బుధవారం ఉదయం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటుంది. గుడిని శుభ్రం చేస్తారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పిస్తారు. మహా జాతరకు ఉపయోగించే సామగ్రిని శుద్ధి చేస్తారు. పసుపు, కుంకుమలు పెడతారు. ముగ్గులు వేసి శక్తి పీఠాన్ని పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. దుష్టశక్తులను నివారించేందుకు కోడిపిల్లను మామిడి తోరణాలకు కడుతారు. ఆదివాసీ సంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. గురువారం ఉదయం మేకపోతును బలి ఇచ్చి వన దేవతలకు నైవేద్యం ఇస్తారు. సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు గుడి ఉండే పూనుగొండ్లలోనూ ఇదే రకమైన పూజ కార్యక్రమాలు జరుగుతాయి. -
తిరుపతిలో పాక్షికంగా చంద్రగ్రహణం
తిరుపతి కల్చరల్: తిరుపతి నగరంలో చంద్రగ్రహణం దృశ్యాలు సాయంత్రం 7.10 నుంచి 7.40 గంటల మధ్య దర్శనమిచ్చాయి. చంద్రగ్రహణం సందర్భంగా నగరంలో గర్భిణులు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఇంటికే పరిమితమయ్యారు. గ్రహణం వీడిన అనంతరం గర్భిణులతో పాటు ప్రజలందరూ తమ గృహాలను శుభ్రం చేసుకుని దీపారాధనలు చేసి పూజలు చేశారు. కొందరు పేదలకు వస్త్రాలు, ధాన్యం, బెల్లం ప్రసాదాలు వండి వితరణ చేశారు. -
‘రథం’పై రామయ్య
భక్తులతో కిటకిటలాడిన భద్రాద్రి నిత్య కల్యాణంలో 125 జంటలు భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆలయ అర్చకులు రథసప్తమి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రథసప్తమిని పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున అంతరాలయంలో మూలవరులు, ఉత్సవమూర్తులకు ఏకాంత అభిషేకం జరిపారు. స్వామివారికి నూతన పట్టు వస్త్రాలతో అర్చకులు అలంకరించా రు. సాయంత్రం సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కొలువు తీర్చారు. మేలతాళాలు, వేద మంత్రాలు, భక్తుల కోలాటాల నడుమ తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు. వెండిరథోత్సవం, ఆలయ చుట్టు సేవలు నిర్వహించి ప్రత్యేక పూజ లు చేశారు. రథసప్తమి, వారంతపు సెలవులకు తోడు రిపబ్లిక్ డే సెలవు కూడా కలిసిరావడంతో భద్రాచలంలో సోమవారం భక్తుల తాకిడి పెరిగిం ది. రాష్ట్ర, ఏపీ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించా రు. క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకున్నారు. బేడామండపంలో స్వామివారికి నిర్వహించిన నిత్యకల్యాణంలో 125జంటలు పాల్గొన్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో నిత్యకల్యాణాన్ని కమనీయం గా జరిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తు లు పెద్దసంఖ్యలో రావడంతో లడ్డూ కౌంటర్ల వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. -
అట్టహాసంగా గణేశ్, మార్కండేయ జయంతి
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం గణేశ్, మార్కండేయ జయంతిని భక్తులు అట్టహాసంగా జరుపుకున్నారు. పట్టణంలోని ప్రముఖ గణేశ్ ఆలయాలలో భక్తులు తెల్లవారు జామునుండే బారులు తీరారు. అనేక ఆలయాలలో అధర్వశిఘ పఠనం, భజన, పూజార్చనలు నిర్వహించి మహా ప్రసాదంగా అన్నదానం చేశారు. గురువార్పేట్లోని ఐశ్వర్య సంపన్న గణేశ్ ఆలయంలో ఉదయం అభ్యంగన స్నానం గావించి అభిషేకం, పూజలు నిర్వహించారు. జోడుబసవన్న చోక్‌లోని తాతాగణపతి ఆలయంలో భక్తులు వేకువ జాము నుంచే భారీ ఎత్తున పూజలు నిర్వహించారని అధ్యక్షుడు గౌరీశంకర్ కొండా తెలిపారు. పద్మశాలి సమాజ్ సభ్యులు గణేశ్, మార్కండేయ ఆల యాలలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారని పద్మశాలి జ్ఞాతి సంస్థ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గుర్రం చెప్పారు. పట్టణంలో తెలుగువారు ప్రతి కూడలి నందు మండపాలు వేసి మార్కండేయ జయంతిని నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఘనంగా మార్కండేయ జయంతి సాక్షి, ముంబై: ఎల్ఫిన్స్టన్ రోడ్‌లోని అంబేడ్కర్‌నగర్‌లో ఉన్న శ్రీ మార్కండేయ పద్మశాలి యువక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం శ్రీ మార్కండేయ మహాముని జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబ్కర్, నగర్ సేవకులు సుధీర్ జాదవ్, ఆంధ్ర మహాసభ ట్రస్టికి చెందిన ఏక్నాథ్ సంఘం, ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశం పాల్గొన్నారు. ఉదయం శ్రీ శివభక్త శ్రీ మార్కండేయ మహాముని పూజ, హోమం నిర్వహించారు. ఆ తరువాత అతిథుల చేత దీప ప్రజ్వలన గావించారు. తదనంతరం భగవంతున్ని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. జయంతిని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు మూడువేల మందికి పైగా పాల్గొన్నారని సంఘం అధ్యక్షుడు పిట్ల నారాయణ, ప్రధాన కార్యదర్శి పూల రామలింగం, సలహాదారుడు ద్యావర్శెట్టి విలాస్ తెలిపారు. పద్మశాలి భవనం ప్రారంభం భివండీ, న్యూస్‌లైన్ : శ్రీ మార్కండేయ జయంతి పురస్కరించుకొన్ని వినాయక్‌నగర్ పద్మశాలి సమాజ్ భవన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అఖిల పద్మశాలి సమాజ సభ్యులు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ చౌగులే, స్థానిక కార్పోరేటర్ కమ్లాకర్ పాటిల్, సంతోష్ ఎమ్ శెట్టి, బీజేపీ ప్రదేశ్ సభ్యులు శ్యామ్ అగ్రవాల్ తదితరులు పాల్గొన్నారు. భివండీలో పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో భివండీ, న్యూస్‌లైన్: పద్మశాలి కుల సంఘాలతో పాటు పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ మార్కండేయ మహాముని జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అఖిల పద్మశాలి సమాజం పద్మనగర్ పద్మశాలి సమాజ మంగళ్ భవనంలో శుక్రవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కముటం శంకర్, కార్యదర్శి దాసి అంబాదాస్, వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, నాయనాని కమిటీ చైర్మన్ కొంక మల్లేశం, వంగ పురుషోత్తం, కుందెన్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పద్మశాలి సమాజ్ యువక్ మండలి మార్కండేయ ముని చౌక్రోడ్లో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మండలి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు వడ్లకొండ రాము, వాసం రాజేందర్, బాలే శ్రీనివాస్, పాము మనోహర్, కళ్యాడపు భూమేశ్, బొల్లి నవీన్, మార్గం రవి తదితరులు హాజరయ్యారు. పద్మశాలి యువక్ ప్రతిష్టాన్ పద్మనగర్‌లోని బాలాజీ మందిర్‌లో శ్రీ మార్కండేయ మహాముని ఉత్సవ మూర్తిని ప్రతిష్ఠించి వేద పండితులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు దావత్ కైలాస్ నేతృత్వంలో నిర్వహించారు. స్వామి వారి దర్శనానికి భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలొ అధ్యక్షుడు భీమనాతిని శివప్రసాద్, న్యాయవాది సిరిసిల్ల మహేశ్, మామిడాల ధన్వంతరి, కొంక మనోహర్, గుండు వసంత్, తడిగొప్పల జయ్‌ప్రకాశ్, కొక్కుల రవితో పాటు సమాజ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ మార్కండేయ మహాముని వాచనాలయ సమితి ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా అయ్యప్ప మందిరం పక్కన ఉన్న శ్రీ మార్కండేయ మహాముని వాచనాలయంలో స్వామి వారికి సమితి సంస్థాపకులు సంతోష్ ఎం. శెట్టి నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి మార్కండేయ మహాముని హోమం, అర్చనలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు మేర్గ భాస్కర్, కార్యదర్శి వడిగొప్పల శంకర్, అడ్డగట్ల సత్తయ్య, చాట్ల రాజారాం, ఆడెపు శ్రీనివాస్, అడ్డగట్ల దత్తాత్రేయ, పాము ఈశ్వర్‌తో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహిళల పసుపు-కుంకుమ కార్యక్రమం శ్రీ మార్కండేయ మహాముని వాచనాలయ సమితి ఆధ్వర్యంలో మహిళలకు పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక నగర్ సేవిక శశిలత శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 200 మంది మహిళలకు పూలు, పండ్లు, చిరు కానుకలు పంచిపెట్టారు. శ్రీ మార్కండేయ ఉత్సవ సమితి కాసర్ఆలి పట్టణంలో ప్రసిద్ది గాంచిన శ్రీ మార్కండేయ మందిరంలో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరాన్ని రంగు రంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకంరించారు. ఉదయం 6 గంటలకు 108 మంది మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించి, మందిరం నుంచి కాసర్ ఆలి, పురవీధుల మీదుగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం నూతన దంపతులు 11 హోమాలతో మార్కండేయ మహాయజ్ఞం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. -
అందరివాడు దేవుడు...
అడపాదడపా పూజలు చేసి ముడుపులిస్తే చాలు. దేవుడు ప్రసన్నుడవుతాడన్నది చాలామందికున్న ఒక చులకన భావం. ఆది మానవుడైన ఆదాము హవ్వల కుమారులు కయీను, హేబెలు ఒకసారి దేవునికి కానుకలర్పించారు. దేవుడు కయీనుని తిరస్కరించి మేబెలు కానుకలు స్వీకరించాడు. దాంతో అసూయపడిన కయీను పగబట్టి తమ్ముడైన హేబెలును హత్య చేశాడు. విశ్వాన్నే సృష్టించి పాలించే దేవునికి నా కానుక ఎంత? ఆయన కోరేది నా కానుకలా, నా సత్ప్రవర్తనా? అన్న ఇంగితం కోల్పోయిన కయీను అలా చరిత్రలో తొలి హంతకుడయ్యాడు. దేవునికి దూరమైతే, విశ్వాసం లోపిస్తే ఎదురయ్యేవి ఈ అనర్థాలే. ‘నిషిద్ధ ఫలాన్ని తింటే మీరు దేవునితో సమానమవుతారు’ అన్న అపవాది అబద్ధాన్ని నమ్మి ఆ ఫలం తిన్న ఆదాము, హవ్వలు, ‘దేవుడు తమను ఆయన పోలికలోనే సృష్టిస్తే మళ్లీ దేవుళ్లము కావడమేమిటి? అన్న కనీస జ్ఞానం లోపించి అవిధేయులయ్యారు. అలా సాతాను సృష్టించిన ఒక అబద్ధం, అవిధేయతకు ఆ తరువాత తరంలో అసూయ, కోపం, పగకు తద్వారా హత్యకు మానవాళిని పురికొల్పింది. అలా తరాలు గడిచేకొద్దీ మనిషికి దేవునితో అంతరం పెరిగింది. ఆ దూరం కొన్ని తప్పుడు అభిప్రాయాల్ని మనిషిలో ఏర్పర్చింది. అత్యంత పరిశుద్ధుడైన దేవుడు అక్కడెక్కడో దూరంగా అందకుండా ఉంటాడని, నానా ప్రయత్నాలు చేస్తే తప్ప ఆయన ప్రసన్నుడు కాడని మనిషి అలా సిద్ధాంతీకరించుకున్నాడు. సూర్యుడెక్కడో కోట్లాది మైళ్ల దూరంలోనే ఉన్నా ఆయన కిరణాలు రోజూ భూమిని తాకకుండా ఉంటాయా? దేవుడూ అంతే! సూర్యుణ్ణి, ఆయన రశ్మిని విడదీయలేనట్టే దేవుణ్ణి, ఆయన స్వభావమైన ప్రేమనూ విడదీయలేము. ఆయనెక్కడున్నా ఆయన ప్రేమ, కృప మనిషికి నిత్యం అందుబాటులోనే ఉంటుంది. విశ్వాన్నే సృష్టించి పరిపాలించే దేవుడు గుప్పెడైనా లేని మనిషి గుండెలో నివాసం ఉండాలనుకోవడం ఎంతో ఆశ్చర్యకరం. తిరుగులేని ఆయన ప్రేమకు నిదర్శనం కూడా. - రెవ. టి.ఎ.ప్రభుకిరణ్ -
హంస వాహనాధీశుడై..
గోదారిలో రామయ్య విహారం వైభవంగా తెప్పోత్సవం పల్లకి మోసిన మంత్రులు భద్రాచలం: గోదావరి నదీ తీరం భక్త జనంతో పులకించింది. హంసవాహనంపై శ్రీ సీతారామచంద్రస్వామి వారు విహరిస్తుంటే వీక్షించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. జయజయధ్వానాలు చేశారు. మిరిమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల్లో ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై స్వామివారు కొలువుదీరారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ నదిలో విహరించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో బుధవారం నిర్వహించిన ఈ వేడుకకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న హాజరై స్వామివారి పల్లకిని స్వయంగా మోశారు. తెప్పోత్సవానికి ముందు స్వామివారు వివిధ పూజలు అందుకున్నారు. దర్భారు సేవ శ్రీ సీతారామచంద్రస్వామివారికి గర్భగుడిలో వేదపండితులు దర్భారు సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులకు విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం గావించారు. ఉదయం సేవాకాలం, శ్రీ తిరుమంగై ఆళ్వార్లు పరమపదోత్సవం చేశారు. మధ్యాహ్నం రాజభోగం, శాత్తు మురై, పూర్ణశరణాగతితో పగల్‌పత్తు ముగిసింది. గర్భగుడిలో ప్రభుత్వోత్సవం ( దర్భార్ సేవ) నిర్వహించారు. తెప్పోత్సవం.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య తెప్పోత్సవం కోసం స్వామివారిని ఆలయం నుంచి ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకోచ్చారు. రాజాధిరాజ వాహనంపై గోదావరి నదిలో విహరించేందుకు బయలుదేరిన శ్రీ సీతారామచంద్రస్వామివారిని వీక్షించి తరించేందుకు దారి పొడవునా భక్తులు బారులు తీరారు. గోదావరి తీరంలో అర్చకులు ముందుగా పుణ్యజలాలతో హంసవాహనాన్ని సంప్రోక్షణ చేశారు. ఊరేగింపుగా వచ్చిన స్వామి వారిని హంసవాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు వేదపండితులు చతుర్వేదాలు, నాళాయర్ దివ్యప్రబంధం, పంచసూత్రాలు, స్తోత్ర పాఠాలు చదివారు. మంగళహారతి, చక్రపొంగలి నివేదన చేశారు. రామనామ సంకీర్తనలు, భక్తుల కోలాహలం మధ్య స్వామివారి తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఆకట్టుకున్న కోలాటం ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా గోదారి తీరానికి బయలుదేరారు. రాజాధిరాజ వాహనంపై స్వామివారు వెళ్లే సమయంలో పల్లకి ముందు వివిధ కోలాట బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేద విద్యార్థుల కీర్తనలు, వికాస తరంగణి, శ్రీ కృష్ణ కోలాట భజన మండలితో పాటు వివిధ సంస్థలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం నుంచి గోదావరి స్నానఘట్టాల వరకు కోలాట బృందాల కీర్తనలతో స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది. బాణసంచా వెలుగుల్లో... సాయంత్రం 5 గంటలకు స్వామివారు హంసవాహనంపై కొలువుదీరారు. వాహనం 6 గంటలకు బయలుదేరింది. గోదావరిలో స్వామివారు ఐదుసార్లు విహరించారు. నదిలో హంసవాహనం తిరుగుతున్నంత సేపు బాణసంచా వెలుగుల్లో ఆకాశం హరివిల్లైంది. తెప్పోత్సవ సమయానికి నదీ తీరం భక్తజనంతో పోటెత్తింది. స్వామివారి సేవలో మంత్రులు.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి భద్రాద్రిలో నిర్వహించిన తెప్పోత్సవానికి రాష్ట్రమంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న స్వామివారి పల్లకిని మోశారు. తెప్పోత్సవ వేడుకలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, సిర్పూర్ కాగజ్‌నగర్, అశ్వారావుపేట, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, తాటి వెంకటేశ్వర్లు, బాణోత్ మదన్‌లాల్, సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గడపల్లి కవిత, కలెక్టర్ ఇలంబరితి, జేసీ సురేంద్రమోహన్, జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం, ఐటీడీఏ పీవో దివ్య, ఆర్డీవో అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఏఈవో శ్రావణ్‌కుమార్, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండటం, రాష్ట్ర మంత్రుల రాకతో భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఓఎస్డీ జోవెల్డేవిస్ పర్యవేక్షణలో పోలీసుబందోబస్తు కట్టుదిట్టం చేశారు. -
కర్ణాటకలో... ఎల్లమ్మ జాతర..
ఎల్లమ్మ దేవతకు మన దగ్గర పూజలు జరపడం, జాతరలు నిర్వహించడం చేసినట్టుగానే కర్ణాటక రాష్ట్రంలోనూ ఎల్లమ్మకు పండగ జరుపుతారు. డిసెంబర్ నెలలో వచ్చే మార్గశిర పౌర్ణమి (ఈ నెల 6న పౌర్ణమి) రోజున పెద్ద ఎత్తున జరిగే జాతరకు ఎక్కడెక్కడి నుంచో జనం తండోపతండాలుగా తరలివస్తారు. ఇక్కడ అమ్మవారిని శక్తి స్వరూపిణిగా కోరి కొలుస్తారు భక్తులు. ఆధ్యాత్మికతకు నెలవైన ఆ ప్రాంత విశేషాలు... కర్ణాటక రాష్ట్రంలో బెల్గామ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో సౌనదత్తి అనే పట్టణం ఉంది. ఈ పట్టణాన్ని సవదత్తి అని కూడా అంటారు. ఈ ప్రాంతానికి 5 కి.మీ దూరంలో ఎల్లమ్మ గుట్టపైన ఎల్లమ్మదేవి కొలువుదీరిన అతి ప్రాచీన ప్రసిద్ధ దేవాలయం ఉంది. ఇక్కడ ఎల్లమ్మను రేణుకా మాతగానూ కొలుస్తారు. మన దగ్గరా రేణుకామాతకు పూజలు నిర్వహించడం ప్రసిద్ధమే! పురాణాలలో రేణుకామాత జమదగ్ని భార్యగా చెబుతారు. ఇక్కడ రే ణుకామాతను దుర్గామాతగా కొలుస్తారు. పౌర్ణమి వెలుగుల్లో... అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు 5 సార్లు పౌర్ణమి రోజులలో ఎల్లమ్మ వేడుకలు జరుపుతారు. అయితే, మార్గశిర మాసమైన డిసెంబర్లో వచ్చే పౌర్ణమి (ఈ ఏడాది డిసెంబర్ 6న పౌర్ణమి)నాడు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు స్థానికులు. అంగరంగ వైభవంగా జరిగే సౌనదత్తి ఎల్లమ్మ జాతరకు ఆ ప్రాంతవాసులే గాక పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవాల నుంచి భక్తులు తరలివచ్చి, మొక్కులు తీర్చుకుంటారు. భారతదేశ సంస్కృతి తెలుసుకోవడానికి ఇలాంటి జాతరలు ఎంతో కీలకమని నమ్మే విదేశీయుల సైతం పరిశోధనల కోసం ఈ ప్రాంతానికి విచ్చేస్తుంటారు. సవదత్తి ఎల్లమ్మ జాతరలో ప్రాచీన కాలం నుంచి దేవదాసీ వ్యవస్థ కొనసాగుతుంది. ఇప్పటికీ జాతర సమయాలలో కొనసాగే దేవదాసీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడానికి, అక్కడి ప్రజలలో అవగాహన తేవడానికి పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. చూడదగినవి ఈ దేవాలయంలో చాళుక్యులు, రాష్ట్రకూటుల నిర్మాణ శైలి కనపడుతుంది. శిల్పాలలో జైనుల సంస్కృతి కళ్లకు కడుతుంది. సవదట్టి ఎల్లమ్మ దేవాలయం పరిసరాలలో ప్రసిద్ధ గణపతి, మల్లికార్జున, పరశురామ, ఏక్నాథ్, సిద్ధేశ్వర దేవాలయాలు ఉన్నాయి. సవదత్తికి: బెంగళూరు - 500 కి.మీ, తూముకూర్ - 397 కి.మీ చిక్మగళూర్ - 355 కి.మీ, మంగళూర్ - 401 కి.మీ కర్వార్ - 209 కి.మీ, బళ్లారి - 245 కి.మీ, ధార్వాడ్ - 38 కి.మీ, బిజాపూర్ - 165 కి.మీ, రాయ్‌చూర్ - 297 కి.మీటర్ల దూరంలో ఉన్నాయి. సమీప విమానాశ్రయం: బెల్గామ్ సమీప రైల్వే స్టేషన్: ధార్వాడ్ సవదత్తికి అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. -
కనకమ్మకు నీరాజనం
వైభవంగా తొలి గురువారం పూజలు లక్షకు పైబడి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు డాబాగార్డెన్స్ : ఉత్తరాంధ్రుల కల్పవల్లి, భక్తుల కొంగు బంగారం శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తొలి గురువారం పూజలను వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసోత్సవాలలో అమ్మవారి దర్శన భాగ్యం కోసం భక్తులు తపిస్తారు. అందునా గురువారం దర్శించుకునేందుకు జన సంద్రమై పోటెత్తుతారు. తొలి గురువారం లక్షమందికి పైగా భక్తులు కనకమ్మను దర్శించినట్టు అంచనా. బుధవారం అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడి మొదలైంది. క్యూలైన్లు టౌన్కొత్తరోడ్డును తాకాయి. దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. ఈ దఫా సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పించారు. వీఐపీ పాసులకు భారీగా కోత పెట్టడంతో భక్తులకు ఇబ్బంది కలగలేదు. పాసుకు రూ.100 ధర నిర్ణయించారు. అవీ కూడా రెండు వేలు మాత్రమే జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశాల మేరకు ఇక్కడి నిబంధనలను కఠినతరం చేశారు. అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు భక్తుల తాకిడి సాధారణంగా కనిపించినా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దీ అధికంగా ఉంది. సాయంత్రం కూడా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలి పూజను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ నిర్వహించగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం 10 గంటల ప్రాంతంలో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో హరికథా గానం భక్తులను అలరించింది. తెల్లవారుజామున, సాయంత్రం అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు జరిపారు. స్వర్ణాభరణాలతో అలంకరించారు. ఆలయ మండపంలో శ్రీచక్రనవార్చన, శ్రీలక్ష్మీ హోమాలు, ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు. 24 గంటలూ ఆలయం తెరిచే ఉంచారు. తోపులాటలు జరగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పా టు చేశారు. పోలీస్ బందోబస్తు పటిష్టం చేశారు. అగ్నిమాపక వాహనాన్ని ఆలయం సమీపంలోనే అందుబాటులో ఉంచారు. మొబైల్ టాయ్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నీటి సౌకర్యం లేకపోవడంతో కొంతమంది ఇబ్బందిపడ్డారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. కురుపాం మార్కెట్, పాతపోస్టాఫీస్‌కు వెళ్లే వారి కోసం టౌన్ కొత్తరోడ్డు వద్దనే ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి (ఘోషా ఆస్పత్రి) వద్ద స్టాపర్లను ఏర్పాటు చేసి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. -
గంగమ్మా.. కాపాడమ్మా..
మత్స్యకారుల మహిళలు పూజలు ఘనంగా మత్స్యకారుల దినోత్సవం డాబాగార్డెన్స్ : మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకార మహిళలు పసుపు నీళ్లతో గంగమ్మతల్లికి పూజలు నిర్వహించారు. ఫిషింగ్ హార్బర్ గాంధీ విగ్రహం నుంచి జెట్టీ సమీపంలో ఉన్న గంగమ్మతల్లి ఆలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులను కాపాడాలని వేడుకున్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం రోజున పబ్లిక్ హాలీడేగా ప్రకటించాలని విశాఖ మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గరికిన దానయ్య ఈ సందర్భంగా కోరారు. వేటకు వెళ్లేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలపై యువభారత్ ఫోర్స్ అధ్యక్షుడు సాధిక్ రెల్లివీధి గాంధీ విగ్రహం వద్ద మత్స్యకారులకు అవగాహన కల్పించారు. ఎస్టీ జాబితాలో చేర్చాలి : మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఫిషరీ ఇండస్ట్రీస్(ఏఐఎఫ్ఐ) అధ్యక్షుడు డాక్టర్ వై.జి.కె.మూర్తి డిమాండ్ చేశారు. మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరిం చుకొని ఫిషింగ్ హార్బర్లో గల ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఫారిన్ ఫిషింగ్‌కు అనుమతి ఇవ్వరాద ని, మత్స్యకారుల అభివృద్ధికి మత్స్యశాఖను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమం లో మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు కోటేశ్వరరావు, సహాయ సంచాలకుడు లక్ష్మణరా వు, ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సి.అప్పారావు, డాల్ఫిన్ బోటు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణమూర్తి, ఎం.రాముడు, జి.కుంజుమన్, జి.గరగయ్య, సి.హెచ్.ఎల్లాజీ, పోలరాజు, ఎల్లారావు పాల్గొన్నారు. -
ఆలయాల మూసివేత
చంద్ర గ్రహణానంతరం మహా సంప్రోక్షణ నేటి ఉదయం 6.30 గంటల నుంచి ద ర్శనాలు చోడవరం/నక్కపల్లి: చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని దేవాలయాలన్నింటినీ బుధవారం మూసివేశారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి మూసివేశారు. గ్రహణ కాలం ముగిశాక రాత్రి ఆలయాన్ని తెరచి మహా సంప్రోక్షణ, రాజభోగం, ఆరాధన, పవళింపు సేవ నిర్వహించారు. గురువారం ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు యధావిధిగా దర్శనాలు అందజేయనున్నారు. దీంతో సింహగిరి బోసిబోయింది. నక్కపల్లి ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయం, ఒడ్డిమెట్ట లక్ష్మిగణపతి ఆలయాలను మూసివేశారు. గ్రహాణం విడిచాక సంప్రోక్షణ అనంతరం ఆలయాలను తెరుస్తామని అర్చకులు వరప్రసాద్, జయంతి గోపాలకృష్ణలు తెలిపారు. నిత్యం పూజలతో భక్తులకు దర్శన మిచ్చే అనకాపల్లి నూకాంబిక ఆలయం, చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరాలయం, శ్రీ స్వయంభూ గౌరీశ్వరాలయంతోపాటు కేశవస్వామి ఆలయం, చోడవరం, వడ్డాది, గోవాడ, మాడుగుల వెంకటేశ్వరస్వామి ఆలయాలు, అర్జునగిరి ల క్ష్మీనృసింహస్వామి ఆలయం మూసివేశారు. వెంకన్నపాలెం షిర్డిసాయిబాబా ఆలయాల సముదాయంలో ఉన్న ఉపాలయాలు, నూకాంబిక, మరిమాంబ, ముత్యమాంబ, దుర్గాంబిక ఆలయాలు, అభయాంజనేయస్వామి ఆలయాలు కూడా మూసివేశారు. గ్రహణం మధ్యాహ్నం ప్రారంభమైనప్పటికీ ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను పంపలేదు. గ్రహణం అనంతరం రాత్రి 7గంటలకు ఆలయాల్లో సంప్రోక్షణ అనంతరం పూజలు యథావిధిగా ప్రారంభిస్తామని స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం ప్రధాన అర్చకుడు కొండమంచిలి గణేష్ తెలిపారు. గురువారం ఉదయం నుంచి ఆలయాల్లో దర్శనాలు ఉంటాయన్నారు. -
వెలుగులు విర‘జమ్మి’
సాక్షి, సిటీబ్యూరో: తంగేడు, గునుగు, గడ్డి పూలతో తొమ్మిది రోజుల పాటు కనువిందు చేసిన రంగు రంగుల పూల బతుకమ్మల పండుగ ముగిసింది. సరదాల పండుగ దసరా వచ్చేంది. ఆనందోత్సాహాలను తెచ్చింది. దసరా అంటేనే ఒక పెద్ద ఉత్సవం. తెలంగాణ ప్రాంతంలో పుష్కలంగా పండిన మెట్ట పంటలకు ప్రతీక. ఏపుగా పెరిగిన జొన్న కర్రలను జెండాలుగా ఎత్తుకొని... బ్యాండు మేళాలతో వెళ్లి పాలపిట్టను చూసి విజయోత్సాహంతో కేరింతలు కొడతారు. అక్కడి నుంచి నేరుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. పాపాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటారు. జమ్మి ఆకు, జొన్న కంకి, మారేడు పత్రిని (దీనిని బంగారంగా భావిస్తారు) దేవతలకు సమర్పించి, ఒకరికొకరు జమ్మి ఆకు చేతిలో పెట్టుకొని అలయి బలయి (ఆలింగనం) తీసుకొంటారు. పిల్లలైతే పెద్దల చేతుల్లో జమ్మి ఆకును పెట్టి పాదాభివందనం చేస్తారు. మనుషుల మధ్య కల్మషాలన్నింటినీ కడిగి పారేసి, ప్రేమ, ఆత్మీయత,అనురాగాలను పంచిపెట్టే పండుగ దసరా. గుండెల నిండా ఆర్తిని నింపుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకొనే క్షణాలు మరచిపోలేనివి. పూజలు జరిగే ప్రాంతాలు దసరా వేడుకల్లో భాగంగా నగర వాసులు జమ్మి చెట్టును సందర్శించి పూజ చేసేందుకు, ఆకులను తెచ్చుకొనేందుకు పలుచోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. కాలనీ సంఘాలు స్థానికంగా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రత్యేకంగా పెద్ద పెద్ద జమ్మి కొమ్మలను నాటి, ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. అవి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఖైరతాబాద్ చింతల్‌బస్తీ రాంలీలా గ్రౌండ్స్ అంబర్పేట్ పోలీస్ గ్రౌండ్స్ గోల్కొండ కోట ప్రాంగణం సీతారాంబాగ్ దేవాలయం ఆర్ కే పురం అష్టలక్ష్మీ దేవాలయం జిల్లేల గూడ వేంకటేశ్వర దేవాలయం సైదాబాద్ పూసబస్తీ ఓల్డ్ మలక్‌పేట్ అక్బర్‌బాగ్ -
బాసరలో పోటెత్తిన భక్తజనం
భైంసా/బాసర : ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలంలోని సుప్రసిద్ధ బాసర సరస్వతీ క్షేత్రంలో బుధవారం మూలా నక్షత్ర మహా సరస్వతీ పూజలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి 1,980 మంది చిన్నారులకు ఈ సందర్భంగా అక్షర శ్రీకార పూజలు చేయించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మూలనక్షత్ర పర్వదినాన తన మనవళ్లు రితిశ్, రిశాంత్లకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, జేడీఏ రోజ్లీలాతోపాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 40 వేలకు మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. -
నవ్యాంధ్రగా అవతరించాలి
సిక్కిం పూర్వ గవర్నర్ రామారావు కైకలూరు : నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పయనించాలని సిక్కిం మాజీగవర్నర్, బీజేపీ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు వెంట్రప్రగడ రామారావు అన్నారు. కైకలూరు మండలంలోని వివిధ దేవాలయాల సందర్శనకు భార్య వసంతకుమారి, కుమారుడు శ్రీనివాస్‌తో కలసి సోమవారం ఆయన వచ్చారు. ముందుగా స్థానిక శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మేనేజర్ శింగనపల్లి శ్రీనివాసరావు ఆయనను ఘనంగా సత్కరించారు. ఆటపాకలోని కామినేని రామకృష్ణ నివాసంలో అల్పహారం తీసుకున్నారు. అనంతరం వరహాపట్నం గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ లక్ష్మీనృసింహ దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. కైకలూరులోని శ్రీ రామకృష్ణా సేవాసమితిని సందర్శించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు చెరుకువాడ శివరామరాజు, చింతపల్లి వెంకటనారాయణలు ఆయనను ఘనంగా సత్కరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేంపాటి విష్ణురావు , ఎంపీపీ బండి సత్యవతి, బీజేపీ నాయకులు లావేటి వీరశివాజీ, ప్రత్తిపాటి అమృత కమలాకరరావు, బండి శ్రీనివాసరావు, బందా సత్యనారాయణ ప్రసాద్, గుల్లపల్లి పద్మినీ, సుబ్బరాజు, జోసఫ్, వీరరాఘవులు, శ్రీనివాసగుప్తా పాల్గొన్నారు. కేంద్రం, రాష్ట్రాల మైత్రి పెరగాలి కేంద్ర, రాష్ట్రాల మధ్య మైత్రీబంధం పెరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని వెంట్రప్రగడ రామారావు ఆకాంక్షించారు. దేవాలయాల సందర్శనలో భాగంగా కైకలూరు వచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా నూతన రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అసెంబ్లీలో చిన్న చిన్న విషయాలకు సమయాన్ని వృథా చేయకూడదని సూచించారు. పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. -
విశ్వరూప విజయవంతం
చంద్రకాంతులు వెదజల్లుతున్న వేళ... భక్తుల జయజయధ్వానాల మధ్య కైలాస విశ్వరూప మహాగణపతి దుర్గామాత వెంటరాగా ‘మహా’రథంపై ఆశీనుడయ్యాడు. వేల మెగావాట్ల విద్యుత్ దీప కాంతుల మధ్య జరిగిన ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించి భక్తకోటి తరించింది. ‘జై బోలో గణేశ్ మహరాజ్ కీ’ అంటూ స్తుతించింది. ఆనంద పరవశంతో నర్తించింది. వెరసి ‘ఆపరేషన్ విశ్వరూప’ విజయవంతమైంది. సోమవారం అర్ధరాత్రి సమీపిస్తున్న తరుణంలో భారీగణపయ్య గంగ ఒడికి కదిలాడిలా..! అపురూప ఘట్టాలు.. మధ్యాహ్నం 3 గంటలకు: క్రేన్ మహాగణపతి ప్రాంగణానికి చేరుకుంది. 3.20: భారీ వాహనం పొజిషన్ తీసుకుంది. 4.00: భక్తుల దర్శనం నిలిపివేశారు. 4.50: లక్ష్మీనర్శింహ స్వామి విగ్రహాన్ని కదిలించేందుకు క్రేన్ సిద్ధమైంది. 5.00: భక్తులు ఎక్కువగా ఉండడంతో వారిని మళ్లీ దర్శనానికి అనుమతించారు. 6.00: తిరుమల తిరుపతి దేవస్థానం కళాకారుల కోలాట ప్రదర్శన 6.10: క్రేన్‌కు పూజలు 7.30: లక్ష్మీ నర్శింహ స్వామి విగ్రహాన్ని పైకి లేపి మండపానికి దూరంగా పెట్టారు. 8.00: లడ్డూపై నున్న గొడుగును తొలగించారు. 8.30: లడ్డూని కిందకు దించారు. 9.50: దుర్గామాత విగ్రహాన్ని పైకిలేపి వాహనంపై ఉంచారు. 9.55: కైలాస విశ్వరూపుడి విగ్రహానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చివరి పూజ చేశారు. 10.10: మహాగణపతిని పైకి లేపేందుకు విగ్రహం అడుగుభాగంలో వైర్లను అమర్చారు. 10.15: భారీ వినాయకుడిని వాహనంపై అమర్చేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. 10.35: కైలాస విశ్వరూపుడి విగ్రహాన్ని కొంచెం కదిలించారు. 10.55: భారీ గణనాథుడ్ని వాహనంపై అమర్చారు. 11.00: వాహనానికి వెల్డింగ్ పనులు మొదలయ్యాయి. అర్ధరాత్రి తర్వాత విశ్వరూపుడు శోభాయాత్రకి కదిలాడు. -
తడిసి ముద్దయిన నగరం
పలుచోట్ల భారీ వర్షం సాక్షి,సిటీబ్యూరో: అల్పపీడన ప్రభావంతో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వినాయక చవితి వేడుకలకు వర్షంతో ఆటంకం ఏర్పడింది. దీంతో విగ్రహాలను మండపాలకు తరలించడం, పూజలు నిర్వహించడం వంటి సందర్భాల్లో భక్తులు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 వరకు నగరంలో 4.7 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదైనట్టు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 0.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని, ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆస్పత్రి గదుల్లోకి వరద నీరు.. వెంగళరావునగర్: గురువారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలోని పేయింగ్ గదుల్లోకి నీరు చేరింది. దీంతో శుక్రవారం రాత్రంతా నీరు బయటకు తోడుకుంటూ కునుకు లేకుండా గడపాల్సి రోగులు, వారి సహాయకులు గడపాల్సి వచ్చింది. సెల్లార్లో నిర్మించిన ఈ గదులన్నీ ఉపరితలానికి దాదాపు ఐదు అడుగుల దిగువున ఉండటంతో ఆస్పత్రి ఆవరణలో నుంచి, ఈఎస్ఐ ప్రధాన రోడ్డుగుండా పారే వాన నీరంతా గదుల్లోకి చేరుతోంది. -
గల్ఫ్ బందీల జీవితాల్లో చిరు ఆశలు
వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం చొరవతో.. మదనపల్లె సిటి: బతుకు భారంగా మారడంతో భార్యాబిడ్డల పోషణ కోసం కన్నవారిని, ఉన్న ఊరిని వదిలారు. ఉన్న కొద్దోగొప్పో పొలాలను అమ్మి, పుస్తెలను సైతం తాకట్టుపెట్టి ఆశల పల్లకిలో ఎడారి దేశాలకు పయనమయ్యారు. అయితే గల్ఫ్‌లో ఏజెంట్ల మోసాల బారినపడి అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. మరి కొందరేమో దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతూ దినదిన గండంగా కాలం నెట్టుకొస్తున్నారు. ఉన్నఫలంగా వచ్చేస్తే ఇక్కడి అప్పులు ఎలా తీరుతాయనే బెంగతో అక్కడే ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలాంటివారి పక్షాన వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం నిలిచింది. గల్ఫ్‌లో వారు పడుతున్న బాధలను తమను కలిచివేశాయ ని, వారిని అన్ని విధాల ఆదుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కడప, రాజంపేట ఎంపీలు వైఎస్.అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం కేంద్ర విదేశాంగ, ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి గల్ఫ్‌లో సీమ వాసులు ఎదుర్కొం టున్న సమస్యలను, పడుతున్న బాధలను విన్నవించారు. వారిని ఆదుకోవాలని కోరారు. స్పందించిన కేంద్రం వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. దీంతో గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారి జీవితాల్లో ఆశలు చిగురించాయి. ఎడారి దేశాలకు జిల్లా వాసులు జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, పీలేరు, గుర్రంకొండ, వాల్మీకిపురం, పుంగనూరు తదితర నియోజకవర్గాల నుంచి దుబాయ్, మస్కట్, సౌదీ, ఓమన్, ఇరాక్ వంటి గల్ఫ్ దేశాలకు జీవనోపాధి కోసం వెళుతుంటారు. దాదాపు నాలుగు వేలకు పైగానే ఇక్కడి వారు గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారు. ఉన్న ఊరిలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, సాగు లాభసాటి కాకపోవడంతో చేసిన అప్పు లు తీర్చేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు గల్ఫ్‌బాట పడుతున్నారు. అయితే కొందరు ఏజెంట్లు చేసే మోసాలతో వారు ఎడారి దేశాల్లో దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నా రు. మదనపల్లెకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఏళ్ల తరబడి సౌదీ జైలులోనే ఉన్నారు. మరికొందరైతే అక్కడి జైళ్లల్లో మగ్గుతున్నారు. ఇంకొందరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నా రు. దీంతో వారి కుటుంబాలు మరింత ఆందోళనకు గురవుతున్నాయి. అందని ఆసరా కొందరు ఏజెంట్లు, కొన్ని కంపెనీలు చేసిన మోసాలతో రూ.లక్షల అప్పులతో తిరిగి స్వగ్రామాలకు వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. గతంలో దుబాయి ప్రభుత్వం, ఇటీవల సౌదీ ప్రభుత్వం జారీ చేసిన నితాఖత్ చట్టాలతో వందలాది మంది స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి ఆసరా లేకుండాపోయింది. అందరికీ అప్పులు మిగిలాయి. దీంతో అప్పులు తీర్చే మార్గాలు లేక నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. వీరికోసం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ మైనా చర్యలు తీసుకుని గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న తమ వారి ని కాపాడాలని బాధిత కుటుంబాల వారు కోరుతున్నారు. అలాగే తమ వారిని కాపాడేందుకు కోసం కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. -
వాన కోసం ఊరు ఖాళీ
ఒకరోజు వలస వెళ్లిన గ్రామస్తులు గ్రామంలోకి ఎవరూ రాకుండా కాపలా పూజలు చేసిన బిరుదనపల్లె వాసులు కుప్పం: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ఆ గ్రామ ప్రజలు ఒకరోజు వలస వెళ్లారు. సూర్యోదయానికి పూర్వమే ఊరు ఖాళీ చేశారు. గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా గేట్లు అడ్డుగా ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలిమేరల్లో వంటావార్పుతో గడిపారు. 1963 నాటి రోజులను గుర్తు చేశారు. ఇదీ మండలంలోని బిరుదనపల్లెలో ఆదివారం చోటు చేసుకున్న సంఘటన. దాదాపు వంద కుటుంబాలకు పైగా ఉన్న బిరుదనపల్లెలో మూడేళ్లుగా వర్షాలు లేక నీటి కో సం అల్లాడిపోతున్నారు. పశువులకు మేత కూడా కష్టం గా ఉంది. వింతరోగాలతో పశువులు మరణిస్తుంటే, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రావూనికి ఏదో కీడు జరిగిందని భావించి శాంతి పూజలు చేసేం దుకు గ్రామస్తులంతా సిద్ధవుయ్యూరు. 1963లో కూడా ఇలాంటి శాంతి పూజలు చేసినట్టు తెలిపారు. ఆదివా రం ఉదయుం సూర్యోదయుం ముందే ఇళ్లకు తాళాలు వేసి పశువులు, కోళ్లను వెంట తీసుకుని వలసబాట పట్టారు. గ్రావు సమీపంలోని వూమిడితోపులోకి వెళ్లి అక్కడే ఉదయుం నుంచి సాయుంత్రం వరకు వంటవార్పులు చేపట్టారు. వనభోజనాలు చేశారు. బిరుదనపల్లె గ్రావూనికి ఉన్న ఏడు ముఖ ద్వారాలను ముసివేసి గ్రావుంలోకి ఎవరినీ వెళ్లకుండా కాపలా కాశారు. సాయుంత్రం ఆరు గంటల అనంతరం గ్రావు పొలిమేరల్లో పూజలు జరిపి పొలిమేరల చుట్టూ అష్టబంధకం చేసి గ్రావుంలోకి ప్రవేశించారు. ఇలాంటి పూజల వల్ల గ్రామానికి పట్టిన కీడు వదులుతుందని, ప్రజలు సుఖ శాంతులతో జీవనం సాగిస్తారనే నవ్ముకాన్ని వెలిబుచ్చారు. 1963కు ముందు గ్రావుంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వరుణ పూజలు, వలసబాటతో పూజలు చేయుడం వల్ల అప్పటినుంచి ఇప్పటివరకు గ్రావూనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని స్థానికులు తె లిపారు. 50 ఏళ్ల తర్వాత గ్రావుంలో ఏర్పడిన కరువు పరిస్థితులు తొలగిపోవాలని గ్రావుస్తులు ఏకనిర్ణయుం తో ఆదివారం పూజలు చేపట్టడం గవునార్హం. -
సందడే..సందడి!
కడ్తాల: ఆమనగల్లు మండలం మైసిగండి మైసమ్మ అమ్మవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం వర కు అక్కడే కాలక్షేపం చేసి..ఆనందోత్సహాలతో గడిపారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, చందంపేట జెడ్పీటీసీ సభ్యుడు బాలునాయక్ వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడే ఏర్పాటుచేసిన విందులో టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. వారికి ఆలయ ఈఓ రంగారెడ్డి, ఫౌండర్‌ట్రస్టీ శిరోలీ, గ్రామ సర్పంచ్ శేఖర్‌గౌడ్, యాదగిరిగౌడ్ స్వాగతం పలికారు. -
ఇదేం పండగ బాబోయ్..!
విడ్డూరం పండుగ అంటే ఏదో కొత్త బట్టలు వేసుకుని, పిండి వంటలు చేసుకుని, దేవుడికి పూజలు చేయడం అని మనమనుకుంటాం. కానీ విదేశాల్లో జరుపుకునే కొన్ని పండుగల గురించి వింటే ఇవేం పండుగల్రా బాబూ అనిపిస్తుంది. వాటిలో ఇవి కొన్ని... కూపర్స హిల్ చీజ్ రోలింగ్ అండ్ వేక్ - ఇదో విచిత్రమైన పండుగ. ఇంగ్లండ్‌లోని కూపర్స కొండ మీద జరగడం వల్ల దానికా పేరు వచ్చింది. పోటీదారులంతా కొండమీద నిలబడి ఉంటారు. బెల్ కొట్టగానే అందరూ కింద పడి దొర్లడం మొదలు పెడతారు. వేగంగా దొర్లుకుంటూ ఎవరైతే మొదట కొండ కిందకు వెళ్తారో వారే విజేత! మంకీ బఫే ఫెస్టివల్ - థాయ్‌ల్యాండ్‌లో ఇది ముఖ్యమైన పండుగ. అక్కడి లోప్బురీ ప్రాంతంలో కోతుల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. అందుకే ఏటా ఓ రోజు అక్కడ కోతుల పండుగ జరుపుతారు. ఆ రోజున దాదాపు రెండువేల కిలోల పండ్లు, కూరగాయలు, ఇతరత్రా ఆహార పదార్థాలు కోతులకు పెడతారు. ఈ వేడుకలో పాల్గొనడానికి విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తుంటారు! హడకా మత్సూరీ - ఇది జపాన్ వాళ్లకెంతో ఇష్టమైన పండుగ. ఏటా వేసవిలో ఘనంగా జరుగుతుంది. పురుషులంతా గోచీలాంటి ఆచ్ఛాదనను మాత్రమే ధరించి ఈ పండుగలో పాల్గొంటారు. దేవుడి సన్నిధిలో ఉంచిన రెండు పవిత్రమైన వెదురు ముక్కలను మత గురువు విసురుతాడు. అవి ఎవరికి చిక్కుతాయో వారు ఆ సంవత్సరమంతా సంతోషంగా ఉంటారని విశ్వాసం! ఫెస్టా డెల్ కార్నుటో - రోమ్‌లోని రోకా కాన్టెరానో అనే పట్టణంలో ఏటా ఈ పండుగ జరుగుతుంది. ప్రేమలో మోసపోయినవారు మాత్రమే ఇందులో పాల్గొనాలి. వీళ్లందరికీ ఒక కొమ్ముల జతను ఇస్తారు. వాటిని ధరించి అందరూ వీధుల్లో ఊరేగింపులా తిరుగుతారు. తద్వారా తాము ఒంటరిగా ఉన్నామని, జంటను కోరుకుంటున్నామని తెలియజేస్తారు. చాలామందికి ఈ వేడుకలోనే జోడీ దొరుకుతుందట!