ఆయుధ పూజనాడు అందరూ ఆయుధాలకు పూజలు చేస్తారు.అమ్మవారి చేతిలో ఉండే ఆయుధాలు ఏ గుణాలకు సంకేతమో తెలుసా? వాటిని పూజించడం వల్ల ఏ దుర్గుణాలను రూపుమాపుకోవచ్చో తెలుసా? మనలోని సద్గుణమే ఆయుధం. ఆ సద్గుణానికి పదును పెట్టుకోవలసిన తరుణమే దసరా.అమ్మవారికి చేసే పూజల్లో ఆయుధపూజని కూడా చేయడం సంప్రదాయం. ఆయుధమనగానే ఎవరినో వధించడానికో లేక మనని రక్షించుకోవడానికో సిద్ధంగా ఉంచుకున్న ఓ పరికరం అని మనసులో ఆలోచన వస్తుంది. కాని అమ్మ ధరించిన ఆయుధాల ఉద్దేశ్యం వేరు. వారి అంతరార్థం వేరు. అమ్మవారి చేతిలో కనిపించే ప్రతి ఆయుధానికీ మనం చేయాల్సిన పూజే ఆయుధపూజ. క్రమంగా చూద్దాం.
పాశ పూజ
‘ధృతపాశాంకుశ పుష్ప బాణ చాపామ్’ అని కనిపిస్తుంది అమ్మవారి స్తోత్రంలో. ఓ చేతిలో పాశాన్ని, మరో చేతిలో అంకుశాన్ని, ఇంకొక చేతిలో పుష్పాలు ఐదింటినీ కలిపి బాణంగా చేసుకుని, మరో చేతిలో వింటిని ధరించి ఉంటుందని దీని భావం. ముందుగా పాశానికి అర్థాన్ని చెప్పుకుందాం. పాశం అంటే తాడు అని అర్థం. తాడుతో కట్టబడేది పశువు. నాలోని పశుత్వాన్ని తొలగించు లేదా నాలో పశుత్వం అసలు ప్రవేశించకుండా రక్షిస్తూ ఉండు అని ప్రార్థించడమే పాశానికి పూజ చేయడంలోని అంతరార్థం.ఉదాహరణకి ఓ అరటిగెల ఎక్కడైనా బాగా కనిపిస్తూంటే మనమైతే ఆ అంగడికి వెళ్తాం. కొంటాం. అదే మరి పశువైతే వెళ్తూనే నోటితో ఆ గెలని పట్టుకుంటుంది. ఆ యజమాని కర్రదెబ్బల్ని తిని వెనక్కి వెళ్లిపోతుంది. అభిమానం లేకుండా ప్రవర్తించడమే పశుత్వం. జరిగిన అవమానాన్ని మళ్లీ జరిగేలా బుద్ధిహీనతతో చేసుకోవడమే పశుత్వం. ఒక్క తప్పుని చేసి అవమానాన్ని పొంది, మళ్లీ అదే తప్పుని చేసి మరో అవమానానికి సిద్ధపడే ఎందరినో చూస్తుంటాం. అదే పశుత్వం. కొన్ని తెలిసిన పశుత్వాలూ, కొన్ని మనకి తెలియకుండా చేసే పశుత్వాలూ మనలో దాగుంటాయి. అందుకని ఆ పశుత్వాన్ని నా నుండి తొలగించవలసిందని ప్రార్థిస్తూ చేసే పాశానికి సంబంధించిన పూజ పాశ ఆయుధపూజ. అమ్మ పాశంతో మనని కట్టేసి తన వాళ్లలో ఒకరినిగా మనని చేసుకుంటుంది కాబట్టి పాశమనేది మన రక్షణకి ఉపయోగించే రక్షక వస్తువే. శ్రీకృష్ణుణ్ణి యశోద రోటికి కట్టేస్తే, ఆ రోటిని రెండు చెట్ల మధ్యగా ఈడ్చుకు వెళ్లిన బాలకృష్ణుడు ఇద్దరు రాక్షసులకి రాక్షసత్వం నుండి విముక్తి కలిగించాడు కదా! ఆ పాశం ఈ ఇద్దరి రక్షక వస్తువు కాలేదూ! అదే మరి దుర్యోధనుడేం చేశాడు? తమ దగ్గరికి కృష్ణుడు రాయబారిగా వచ్చి విశ్వరూపాన్ని చూపిస్తే, ఆ రూపం ఎంత ఎత్తుందో అంత తాటితో అతణ్ణి కట్టేద్దామని భావించి తాళ్లని తెప్పించాడు కదా! ఎంతటి పశుత్వం దుర్యోధనునిది! అన్ని తాళ్ల సమూహాన్ని తెచ్చినా కట్టుబడని శ్రీకృష్ణుడు యశోదమ్మ మూరెడు తాటికి బంధిపబడ్డాడా? లేదా? కాబట్టి ‘అమ్మా! నీ అనురాగ పాశంతో నన్ను కట్టేసి నీ ఆయుధాన్ని నా రక్షణకి ఉపయోగించవలసింద’ని ప్రార్థిస్తూ పాశానికి చేసే పూజ పాశ ఆయుధపూజ.
అంకుశ పూజ
అంకుశమంటే చివర కూసుగా వంకీ తిరగబడి ఉండే ఒక పరికరం. ఆ అంకుశం ఎప్పుడూ ఏ మృగాన్ని, జంతువుని చంపదు – చంపలేదు. అయితే బాగా మందమైన చర్మం కలదీ, మరింత గట్టిగా ఉండేదీ అయిన ఏనుగు కుంభస్థలం మీద గుచ్చి, దాన్ని అదుపు చేసేందుకు వాడబడే వస్తువు ఇది. లౌకికంగా ఇది దీనర్థం. అంతరార్థం అది కాదు. ఏనుగు నల్లగా ఉంటుంది. అది తమోగుణానికి (గర్వం, దర్పం, అహంకారం, మదం... అన్నీ కలిపిన గుణం) సంకేతం. వ్యక్తుల్లో అలాంటి లక్షణాలున్న ఎవరైనా ఏనుగుతో సమానం. ‘అమ్మా! నాలో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే నా ఏనుగుని (నా లోపలి తమోగుణాన్ని) నీ చేతితో అంకుశంతో ఒక్కసారి గట్టిగా పొడిచి నన్ను సరైన తోవలో, సరైన బుద్ధితో నడిచేలా రక్షించవలసిందని ఆ అంకుశానికి చేయాల్సిన పూజ అంకుశ పూజ. రావణుడు తమోగుణానికి ప్రతీక. సీతమ్మ ఎదురుగా నిలబడి ‘మమ శయాన మారోహా’ (నా పక్కమీదికి రా) అని అన్నంతటి అహంకార స్థితి నిండిన శరీరం రావణుడిది. అమ్మ అంది– నీకు బుద్ధి లేదా? లేక నీకు మంచిచెడుల తేడాని చెప్పేవారూ చెప్పగలవారూ లంకలో లేరా? – అని. అదిగో అవే మాటల్ని మనమూ మననం చేసుకుంటూ – అమ్మా! నాలో ఏదైనా వినని లక్షణముంటే వినిపించుకునేతనాన్ని కలిగించవలసిందని పూజ చేయడమే అంకుశపూజలోని పరమార్థం. అలా చేస్తే ఆ అంకుశమే మనకి రక్షక వస్తువుగా మన పాలిట నిలిచి ఉంటుంది ఎప్పటికీ.
పుష్పబాణాలు
అమ్మ చేతిలో ఉండే 5 బాణాలూ ‘పృథివి అప్ తేజస్ వాయు ఆకాశాల’కి సంకేతం. ‘అమ్మా! పృథివి ద్వారా వచ్చే భూకంపానికి నేనూ నా కుటుంబం లోను కాకుండా, అప్ (నీరు) ద్వారా వచ్చే వరదలూ తద్వారా కలిగే నిరాశ్రయ విధానానికి నేనూ నా కుటుంబమూ గురికాకుండా ఉండేలా, ఉష్ణ రోగాలు రాకుండా తేజస్సు ద్వారా, వాతరోగాలు తాకకుండా ఉండేలా వాయువు ద్వారా, ఏ పిడుగులూ రాహు కేతు గ్రహాల అననుకూల పరివర్తనల ద్వారా కష్టం కలగకుండా ఆకాశం ద్వారా మమ్మల్ని రక్షిస్తూనే ఉండవలసిందని ప్రార్థించడం పంచ పుష్పబాణ పూజలోని అంతరార్థం. ఈ పుష్పబాణ పూజ మరోవిధంగా మన శరీరంలో ఉండే ఆరు దుర్గుణాలూ అయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని తొలగించవలసిందని కూడా ప్రార్థించడానికి సరిపోతుంది.
చాపం
చాపమంటే విల్లు. అమ్మ చేతిలోని వింటికి పూజ చేయడం మరింత గొప్ప ఆయుధపూజ. నమక మంత్రంలోని మొదటి మంత్రం శంకరుణ్ని స్తుతిస్తూ – ‘శంకరా! నీ కోపానికి నమస్కారం (రుద్ర మన్యవే) – ఆ కోపంతో అమ్ములపొదిలో నుండి తీసిన బాణానికి నమస్కారం (ఉతోత ఇషవే నమః) – ఆ బాణాన్ని వింటిలో పెట్టి బాణాన్ని విడవడానికి సిద్ధంగా ఉన్నావే! ఆ వింటికి నమస్కారం (నమస్తే అస్తు ధన్వనే) – ఆ వింటినీ దానిలో ఎక్కుపెట్టిన నారినీ ఆ వింటినారిలో బిగించేలా చేసిన నీ రెండు బాహువులనీ ప్రార్థిస్తూ నాకు ఏ తీరు అపకారాన్ని సకుటుంబంగా కలిగించకుండా ఉండవలసింది (బాహుభ్యాముత తే నమః)’ – అంటూ చేసే ఈ నమస్కారాలన్నీ ఆయుధ పూజే. అలా అమ్మని ప్రార్థిస్తే అమ్మ తన చేతిలోని వింటితో మన శత్రువులని భయపెడుతూ తప్పక రక్షనిస్తుంది.
చక్రం
శ్రీమహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రాన్ని అమ్మ తన దుర్గారూపంలో ధరిస్తుంది. చక్రమనగానే అందరి తలలనీ నరికేసేదే అని మన అభిప్రాయం. ఏ శిశుపాలుడు వంటివాళ్లని సంహరించవలసి వచ్చినా ముందుగా హెచ్చరించి మాత్రమే చంపాడు శ్రీహరి. చక్రం అకస్మాత్తుగా వధించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. శ్రీహరి తన చేతి చక్రాన్ని – నిత్య భక్తుడైన అంబరీషునికి ఇస్తూ ఏ కష్టం వచ్చినా ఇది నీకు రక్షక చక్రంగా ఉపయోగపడుతుందని ఇచ్చాడు. (ప్రదత్తో నిత్య రక్షయామ్). అదుగో ఆ చక్రాన్ని గనుక మనం పూజిస్తే అది మనని వధించదు సరికదా మన మనసుకి గాయం చేయబోయేవారిని తన అంచుల కాంతులతో హెచ్చరిస్తుంది – జాగ్రత్త అని. ఇదే తీరుగా అమ్మ రాక్షస వధ చేయడానికి విఘ్నేశ్వరుని నుండి అంకుశాన్నీ, కుమారస్వామి నుండి భల్లాన్నీ (బల్లెం), శంకరుని నుండి త్రిశూలాన్నీ, శ్రీహరి నుండి చక్రాన్నీ... ఇలా ఎవరెవరు తమ తపశ్శక్తిని ఏయే ఆయుధాల్లో దాచి ఉంచారో ఆయా తపశ్శక్తి దాగిన ఆయుధాలన్నింటినీ తన చేతుల్లో ఉంచుకుని మరీ – సిద్ధపడింది తప్ప, తనకున్న ఆయుధాలు సరిపోతాయని భావించనే లేదు. అలా తీసుకోవడం ఆమె అసమర్థతకి నిదర్శనం కాదు.శత్రువనేవాడు లేకుండా ప్రవర్తించడం – తన ప్రవర్తనని సరిదిద్దుకోవడం ఉత్తమం. మనం అలా ప్రవర్తించినా, నిష్కారణంగా వశిష్ఠుని మీదికి దండెత్తిన విశ్వామిత్రునిలా కొందరు మన మీద శత్రుత్వంలో ఉండి తీరుతారు కాబట్టి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. అందుకని అమ్మ అంటుంది గదా – శత్రుత్వంరాకుండా చూసుకో! ఒకవేళ శత్రువు మనతో పోరాడేంత స్థాయిలో గనుక వస్తే – తగిన జవాబు చెప్పడానికి ఇందరి సహకారంతో పోరాడి గెలుపొందడం అత్యుత్తమం అని.
అందుకని ఇన్ని ఆయుధాలకీ రక్షణని కోరుతూ ప్రార్థించడమే ఆయుధపూజలోని అంతరార్థం. తన్నోదేవీ ప్రచోదయాత్.
శత్రువనేవాడు లేకుండా ప్రవర్తించడం – తన ప్రవర్తనని సరిదిద్దుకోవడం ఉత్తమం. మనం అలా ప్రవర్తించినా, నిష్కారణంగా వశిష్ఠుని మీదికి దండెత్తిన విశ్వామిత్రునిలా కొందరు మన మీద శత్రుత్వంలో ఉండి తీరతారు కాబట్టి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. అందుకని అమ్మ అంటుంది గదా – శత్రుత్వం రాకుండా చూసుకో! ఒకవేళ శత్రువు మనతో పోరాడేంత స్థాయిలో వస్తే – తగిన జవాబు చెప్పడానికి ఇందరి సహకారంతో పోరాడి గెలుపొందడం అత్యుత్తమం అని.
∙ డా. మైలవరపు శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment