మా మంచి అల్లుడు | Dasara festival special story | Sakshi
Sakshi News home page

మా మంచి అల్లుడు

Published Thu, Oct 18 2018 12:13 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

Dasara festival special story - Sakshi

పండగ వస్తే కొత్త అల్లుడు అత్తారింటికి బయలుదేరతాడు. మరి ఈసారి అతడు ఏం తెలుసుకున్నాడు?...

దసరా పండగ వచ్చింది. కొత్త అల్లుడిలో ఉత్సాహం నింపింది. మరి పండగ వస్తే అల్లుడిని అత్తవారు మర్యాదలు చేయాలి కదా. కొత్త బట్టలు, పిండి వంటలు, అమ్మవారి పూజలు,  మరదళ్ల వేళాకోళాలు... ఓహ్‌.... అంతా హుషారే. ‘నేను కొత్త అల్లుడిని కనుక అత్తవారి ఇంటికి వెళ్లి తీరవలసిందే. అల్లుడి హోదాలో కట్నకానుకలు పిండి వసూలు చేసుకోవలసిందే’... అనుకుంటూ ఒక కొత్త అల్లుడు అత్తవారి ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక వింత జరిగింది. తనలాగే దేవుళ్లు అత్తగారింటికి వెళుతూ కనిపించారు. త్రేతాయుగం నాటి రాముడు పుష్పక విమానంలో, ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడు రథం మీద, విష్ణుమూర్తి వైనతేయుడి మీద, శివుడు నంది మీద, బ్రహ్మదేవుడు హంస మీద అత్తవారి ఇళ్లకు వెళుతూ కనిపించారు. యుగాలు గడిచి కలియుగం ప్రవేశించినా ఇంకా వీరు అత్తవారింటికి వెళ్తున్నారంటే అల్లుళ్ల దర్జా చూపించుకోవడానికేగా అనుకున్నాడు కొత్త అల్లుడు. ‘పురాణ పురుషులే వెళ్తున్నప్పుడు నేను వెళ్లడంలో తప్పేంటి’ అనుకున్నాడు. వారి దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘మహానుభావులారా! నాదొక చిన్న సందేహం. లోకంలో అల్లుడంటే ఎందుకు చిన్నచూపు.  ‘జామాతా దశమగ్రహః ’అని ఎందుకు అంటారు. మీరూ ఒకింటి అల్లుళ్లే. నా సందేహాన్ని నివృత్తి చేయండి’ అన్నాడు. 

వారంతా చిరునవ్వులు చిందించారు. ముందుగా విష్ణుమూర్తి ‘చిరంజీవీ! దశమగ్రహం అంటే వ్యతిరేకం అని ఎందుకనుకుంటావు. నవగ్రహాలు లేకుండా సృష్టిలేదు కదా. వాటితో సమాన స్థానం వచ్చినందుకు ఆనందించాలి. ఖగోళంలో చూపు సారించి అవస్థ పడే అవసరం లేకుండా నీ పేరుతో ఒక గ్రహం ఏర్పడినందుకు సంతోషించు’ అన్నాడు.అప్పుడు శివుడు కల్పించుకున్నాడు. ‘నాయనా! నువ్వు అడిగావు కనుక నీకో విషయం చెబుతాను విను. నేను మా మామగారు హిమవంతుడి ఇంటికి ఇన్ని సంవత్సరాలుగా వెళ్తున్నాను. ఒక్కనాడు కూడా వారు నేను వస్తున్నందుకు భయపడకపోగా, ఎప్పుడెప్పుడు వస్తానా అని ఎదురుచూస్తుంటారు. మా అత్తగారు మేనాదేవి... కూతురూ – అల్లుడూ వస్తున్నారని ఎంత ఆనందపడుతుందో చెప్పలేను. మా వల్ల ఇబ్బంది ఉంటే, ఇన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తారో చెప్పు. నీకు ఈ సందర్భంగా మరో విషయం చెప్పాలి. నాది, పార్వతిది ప్రేమ వివాహం. పార్వతి సంపన్నుల ఇంటి పుట్టింది. నేను శ్మశానవాసిని. మరి మా ఇద్దరి వివాహం ఎలా జరిగిందా అనుకోవచ్చు. మా ఇద్దరి జ్ఞానం సమస్థాయి. అందుకే మా వివాహం ప్రపంచానికే ఆదర్శమైంది. మమ్మల్ని ఆదిదంపతులుగా కొనియాడుతున్నారు. మా ప్రేమ వివాహాన్ని మా అత్తమామలు మంచి మనసుతో అంగీకరించారు. నేను ఏనాడూ ఆ ఇంటి అల్లుడిననే భావనే లేదు వారికి, వారి ఇంటి బిడ్డగానే ఆదరించారు. అల్లుడు ఇంటికి వస్తున్నాడు అనగానే అత్తమామలు గడగడలాడిపోవాలా చెప్పు నాయనా’ అన్నాడు.

శివుడి మాటలు ఈ కొత్త అల్లుడిని ఆలోచింపచేశాయి. అయినా ఇంకా మనసులో ఏవో సందేహాలు వస్తూనే ఉన్నాయి. ‘మహానుభావా! మీ రోజులు వేరు, మా రోజులు వేరు. ఈ రోజుల్లో అల్లుడు కట్నం తీసుకోకపోయినా, అత్తవారింట్లో కొడుకులా ప్రవర్తించినా చేతకానివాడిగా చూస్తున్నారు. ఏదో లోపం ఉండబట్టే ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ నిందిస్తారు’ అన్నాడు. అందుకు విష్ణుమూర్తి శంఖుచక్రాలు సరిచేసుకుంటూ ‘కుమారా!  కలియుగంలో మనుషులు ఎంతో అభివృద్ధి సాధించారని అందరూ అనుకుంటుంటే ఇంకా  కట్నాలు, కానుకలు ఏంటయ్యా, దురాచారాలను విడిచిపెట్టట్లేదు’ అన్నాడు మందస్మిత వదనంతో.అప్పుడు శ్రీరామచంద్రుడు ‘వత్సా! అల్లుడు అనే పదానికి అర్థం తెలుసుకోవయ్యా. ఒక తండ్రి కన్యాదానం చేసే సమయంలో అల్లుడిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తాడు. అంతటి ఉన్నత స్థానం ఇచ్చారు అల్లుడికి. ఆ విషయం పక్కన పెడితే, మా వివాహం గురించి మీకు తెలుసు కదా. శివధనుస్సును ఎత్తగలిగినవారికే జానకితో వివాహం అని చాటింపు వేయించాడు. అంతేకాని మిథిలా నగరంతో సరితూగగలిగే సంపదలున్న వారికే నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించలేదు. వివాహబంధం పటిష్టంగా ఉంటే అల్లుడు, అలకలు, హోదాలు, మర్యాదలు అనే భావనే రాదు. నేను ఇన్ని వేల సంవత్సరాలుగా ప్రతి దసరాకీ మిథిలకు వెళుతూనే ఉన్నాను. ఒక్క సంవత్సరం వెళ్లకపోయినా జనకమహారాజు ఆందోళన చెందుతాడు. అల్లుడు వస్తున్నాడంటే ఆయనకు ఎంత సంబరమో. రెండు పండుగలు చేసుకున్నంత పరవశం చెందుతాడు’ అన్నాడు. 

కొత్త అల్లుడికి ఇంకా తనకు కావలసిన సమాధానం దొరకలేదు. ఆ పక్కనే ఉన్న శ్రీకృష్ణుడితో ‘నల్లనయ్యా! నువ్వు ఇన్నివేల మందిని వివాహం చేసుకున్నావు కదా. వీరే కాకుండా అష్టభార్యలు కూడా ఉన్నారు కదా! మరి నువ్వు ఎవరింట అల్లుడిగా సాక్షాత్కరిస్తావయ్యా శ్రీకృష్ణా’ అని ప్రశ్నించాడు. నవ్వురాజిల్లెడు మోముతో శ్రీకృష్ణుడు, ‘చిరం జీవీ.  నన్ను ఎవరు మనసులో స్మరించుకుంటారో, వారికి ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తానని తెలియదా. నేను అందరివాడినయ్యా! మరో విషయం రుక్మిణితో నా వివాహం గురించి తెలుసు కదా! రుక్మిణి తండ్రి భీష్మకుడికి మా వివాహం ఇష్టం లేదు. కాని రుక్మిణి అందరినీ ఎదిరించి నాతో వచ్చింది. ఎందుకు! నేనేమైనా రాజవంశీయుడినా, సంపన్నుడినా. కాదు కదా! మా ఇద్దరిదీ ఒకే జ్ఞానం, ఒకే సంస్కృతి. అందుకే మా వివాహాన్ని భీష్మకుడు కొంతకాలం తరవాత అంగీకరించాడు. ప్రతి దసరాకి మమ్మల్ని ఆనందంగా, ఆప్యాయంగా ఆహ్వానిస్తూనే ఉన్నాడు. మేం రావడమే తనకు పండుగ అంటాడు. మా వల్ల వారికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవు కదా’ అన్నాడు. 
ఒక్కొక్కరితో మాట్లాడుతూంటే కొత్త అల్లుడికి ఒక్కో కొత్త విషయం అర్థం కాసాగింది. దసరా అంటే సరదాల పండగ, సరసాల పండగే కాని, కట్నకానుకల పండుగ కాదని అర్థం చేసుకున్నాడు. అల్లుడంటే అత్తమామలను పీడించేవాడు కాదని, అల్లుడంటే  పండుగకు అత్తవారింటికి కొడుకు రూపంలో వచ్చేవాడని తెలుసుకున్నాడు. దారిలో అత్తమామలకు, మరదళ్లకు... ఇంటిల్లిపాదికీ కొత్త బట్టలు, మిఠాయిలు, పండ్లు, పూలు తీసుకుని తేలికపడిన మనసుతో అత్తవారిల్లు చేరాడు.

‘చిరంజీవీ! దశమగ్రహం అంటే వ్యతిరేకం అని ఎందుకనుకుంటావు. నవగ్రహాలు లేకుండా సృష్టిలేదు కదా. వాటితో సమాన స్థానం వచ్చినందుకు ఆనందించాలి. ఖగోళంలో చూపు సారించి అవస్థ పడే అవసరం లేకుండా నీ పేరుతో ఒక గ్రహం ఏర్పడినందుకు సంతోషించు!!!

నాది పార్వతిది ప్రేమ వివాహం. పార్వతి సంపన్నుల ఇంటి పుట్టింది. నేను శ్మశానవాసిని. మరి మా ఇద్దరి వివాహం ఎలా జరిగిందా అనుకోవచ్చు. మా ఇద్దరి జ్ఞానం సమస్థాయి. అందుకే మా వివాహం ప్రపంచానికే ఆదర్శమైంది. మమ్మల్ని ఆదిదంపతులుగా కొనియాడుతున్నారు.

మా వివాహం గురించి మీకు తెలుసు కదా. శివధనుస్సును ఎత్తగలిగినవారికే జానకితో వివాహం అని చాటింపు వేయించాడు. అంతేకాని మిథిలా నగరంతో సరితూగగలిగే సంపదలున్నవారికే నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించలేదు.  వివాహబంధం పటిష్టంగా ఉంటే అల్లుడు, అలకలు, హోదాలు, మర్యాదలు అనే భావనే రాదు. నేను ఇన్ని వేల సంవత్సరాలుగా ప్రతి దసరాకీ మిథిలకు వెళుతూనే ఉన్నాను. 
– వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement