లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో హారతి అందుకుంటున్న దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం లలితా త్రిపుర సుందరీదేవిగా కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవురోజు కావడంతో సాయంత్రానికి 50 వేల మందికిపైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.
అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సాయంత్రం వేళ కృష్ణమ్మ అందాలను తనివితీరా ఆస్వాదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ ఘనంగా నగరోత్సవం జరిగింది. లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారిని హోం మంత్రి మేకతోటి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు దర్శించుకున్నారు. కాగా, మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లు అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment