‘దొంగ’ భక్తిని దేవుడు మెచ్చుతాడా?
ఆత్మీయం
ఇటీవల కొందరు ‘పెద్ద’ మనుషులు తెల్లవారీ, తెల్లవారక ముందే బుట్టలు పట్టుకుని వాకింగ్‌కి వెళుతూ, తిరిగి వచ్చేటప్పుడు ప్రతి ఇంటి గోడ మీదకు ఎగబడి, దొంగతనంగా పూలు కోసుకుని ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికి వెళ్లగానే అలా ‘కష్టపడి’ కోసుకు వచ్చిన పూలతో పూజలు చేస్తున్నారు. ఆ పూలమొక్కలు పెంచుకున్న ఇంటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో మొక్కలకు ఆ పూలు పూసిన విషయం కూడా తెలిసే అవకాశం లేకుండా... ఇంటివారు నిద్ర లేవక ముందే వాళ్ళ ఇంటి గోడమీద నుంచి పూలు అన్నీ కోసుకుని వెళ్లే వీరభక్తులు మొదలయ్యారు.
ప్రతి కాలనీలోనూ, ప్రతి ఊరిలోనూ ఇలాగే జరుగుతోంది. పోనీ అలా కోసుకు వెళ్లేది ఒకటో, రెండో పూలు కాదు.. బుట్టలు తెచ్చుకుని మరీ కోసుకెళతారు. అలా దొంగతనం చేసుకు వచ్చిన పూలతో చేసిన పూజలను దేవుడు మెచ్చుకుంటాడా? ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరం.