ఆలయాల మూసివేత
- చంద్ర గ్రహణానంతరం మహా సంప్రోక్షణ
- నేటి ఉదయం 6.30 గంటల నుంచి ద ర్శనాలు
చోడవరం/నక్కపల్లి: చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని దేవాలయాలన్నింటినీ బుధవారం మూసివేశారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి మూసివేశారు. గ్రహణ కాలం ముగిశాక రాత్రి ఆలయాన్ని తెరచి మహా సంప్రోక్షణ, రాజభోగం, ఆరాధన, పవళింపు సేవ నిర్వహించారు.
గురువారం ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు యధావిధిగా దర్శనాలు అందజేయనున్నారు. దీంతో సింహగిరి బోసిబోయింది. నక్కపల్లి ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయం, ఒడ్డిమెట్ట లక్ష్మిగణపతి ఆలయాలను మూసివేశారు. గ్రహాణం విడిచాక సంప్రోక్షణ అనంతరం ఆలయాలను తెరుస్తామని అర్చకులు వరప్రసాద్, జయంతి గోపాలకృష్ణలు తెలిపారు.
నిత్యం పూజలతో భక్తులకు దర్శన మిచ్చే అనకాపల్లి నూకాంబిక ఆలయం, చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరాలయం, శ్రీ స్వయంభూ గౌరీశ్వరాలయంతోపాటు కేశవస్వామి ఆలయం, చోడవరం, వడ్డాది, గోవాడ, మాడుగుల వెంకటేశ్వరస్వామి ఆలయాలు, అర్జునగిరి ల క్ష్మీనృసింహస్వామి ఆలయం మూసివేశారు. వెంకన్నపాలెం షిర్డిసాయిబాబా ఆలయాల సముదాయంలో ఉన్న ఉపాలయాలు, నూకాంబిక, మరిమాంబ, ముత్యమాంబ, దుర్గాంబిక ఆలయాలు, అభయాంజనేయస్వామి ఆలయాలు కూడా మూసివేశారు.
గ్రహణం మధ్యాహ్నం ప్రారంభమైనప్పటికీ ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను పంపలేదు. గ్రహణం అనంతరం రాత్రి 7గంటలకు ఆలయాల్లో సంప్రోక్షణ అనంతరం పూజలు యథావిధిగా ప్రారంభిస్తామని స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం ప్రధాన అర్చకుడు కొండమంచిలి గణేష్ తెలిపారు. గురువారం ఉదయం నుంచి ఆలయాల్లో దర్శనాలు ఉంటాయన్నారు.