
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ విషయంలో తాను నిర్దోషినని తనకే పాపం తెలీదని చెప్పారు. ఇండియన్ అమెరికన్ మహిళా న్యాయమూర్తి మోక్సిలా ఎ ఉపాధ్యాయ ఎదుట ట్రంప్ హాజరయ్యారు.
రాజకీయ ప్రత్యర్థులే ఈ కేసులో ఇరికించారని ట్రంప్ పేర్కొన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించినప్పటికీ దానిని అధికారికంగా వెల్లడించకుండా 2021 జనవరిలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదయ్యాయి. ట్రంప్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టు హాలు వెనుక తలుపులోంచి లోపలికి ప్రవేశించారు.
ఎవరీ ఉపాధ్యాయ ?: న్యాయమూర్తి మోక్సిలా ఎ ఉపాధ్యాయ గుజరాత్‌లో జన్మించారు. ఆమె చిన్నతనంలో తల్లిదండ్రులు అమెరికా వెళ్లిపోవడంతో కన్సస్‌లో పెరిగారు.