వాషింగ్టన్: అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి) కాదని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆమెకు అంత సామర్థ్యం లేదని, ఉపాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేసుకోనని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున అగ్రభాగాన ఉన్న ట్రంప్ శుక్రవారం కాంకార్డ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు.
న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్‌కు సమీప ప్రత్యర్థిగా ఉన్న నిక్కీ హేలీ..తాను ఉపాధ్యక్ష పదవి రేసులో లేనని ఇప్పటికే ప్రకటించగా ట్రంప్ పైవిధంగా స్పందించడం గమనార్హం. అదేవిధంగా, ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో నిక్కీ హేలీని జాతిపరంగా హేళన చేశారు.
పంజాబ్‌కు చెందిన సిక్కు తల్లిదండ్రుల కుమార్తె అయిన నిక్కీ హేలీని ‘నింబ్రా’అంటూ పలుమార్లు పేర్కొన్నారు. నిక్కీ తల్లిదండ్రులు అమెరికన్లు కానందున అధ్యక్ష పదవికి ఆమె అర్హురాలు కాదని ఇటీవల పేర్కొన్న ట్రంప్..ఆమె పేరును ‘నిమ్రద’అంటూ తప్పుగా ఉచ్చరించారు. సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్‌గా పనిచేసిన నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రతా నిక్కీ హేలీ. వివాహానంతరం నిక్కీ హేలీగా మార్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment