వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తన పోరాటం ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. స్వింగ్ స్టేట్స్‌లో అక్రమాలకు సంబంధించి ట్రంప్ తరఫున వేసిన ఒక వ్యాజ్యాన్ని తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందువల్లనే తాను ఓడిపోయానని ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియాల్లో తానే గెలిచానని ట్రంప్ వాదిస్తున్నారు. ‘అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిమయ ఎన్నికలు’ అని ఆదివారం ట్రంప్ ఒక ట్వీట్ చేశారు.
‘ఇంత అవినీతి, ఇన్ని అక్రమాలు జరిగిన ఎన్నికల్లో ఫలితాలను ఎలా నిర్ధారిస్తారు?’ అని మరో ట్వీట్లో ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు వీలైన సమయం తన బృందానికి లభించలేదని ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. ‘మాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు. అయినా, మేం వదల్లేదు. చాలా అక్రమాలను వెలికితీసాం’ అని వ్యాఖ్యానించారు. చనిపోయిన వారి పేరుపై కూడా ఓట్లు వేశారని ఆరోపించారు. మరోవైపు ట్రంప్‌కు మద్దతుగా వారాంతంలో ఆయన మద్దతుదారులు వాషింగ్టన్‌లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులకు, ట్రంప్‌ను వ్యతిరేకించేవారికి మధ్య శనివారం సాయంత్రం చెదురుముదురు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలకు సంబంధించి 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైట్‌హౌస్‌ని శానిటైజ్ చెయ్యండి..
వైట్‌హౌస్‌ను పరిశుభ్రంగా శానిటైజ్ చెయ్యాలని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తన వ్యక్తిగత సిబ్బందితో వైట్ హౌస్ వీడడానికి, బైడెన్ ప్రమాణ స్వీకారం చేశాక రావడానికి మధ్య అయిదు గంటల సమయం ఉంటుందని, ఆ సమయంలోనే వైట్‌హౌస్ అంతా పరిశుభ్రం చేయాలంటూ బైడెన్ ఆదేశించారని వైట్‌హౌస్ అధికారి కేట్ ఆండర్సన్ బ్రోయర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment