
ప్రజల మేలు కోసం ప్రత్యేకపూజలు చేయండి
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌రాష్ట్ర డైరెక్టర్ జ్యోషి గోపాలశర్మ
అలంపూర్ రూరల్: ఈ నెల 7వ తేదీన సంభవించే కేతుగ్రస్త చంద్ర గ్రహణం నుంచి రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు ప్రజల మేలు కోసం బ్రాహ్మణులంతా గ్రహణ కాల సమయంలో ప్రత్యేక పూజలు, అనుష్టానాలు చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ రాష్ట్ర డైరెక్టర్ జ్యోషి గోపాలశర్మ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రుడు మనోఃకారకుడు కావడంతో ప్రజలు మానసిక అశాంతికి గురి కాకుండా ఉండాలంటే కేతు, చంద్ర గ్రహాలకు ప్రత్యేక జపాలు, అనుష్టానాలు నిర్వహించాలని అన్నారు.
పురోహితుడు అంటే పురానికి హితం చేసేవారని నిరూపించే సమయం బ్రాహ్మణులకు వచ్చింది కాబట్టి అందరి యోగ క్షేమం కోసం గ్రహణ కాలంలో ప్రతి బ్రాహ్మణుడు శ్రద్దగా పూజలు చేసి విశ్వసనీయతను చాటుకోవాలన్నారు. ఇదిలాఉండగా, గ్రహణకాల సమయంలో గర్భవతులు జాగ్రత్తలు పాటించాలని, సోమవారం సాయంత్రం 5గంటల లోపు భోజనాలు ముగించి విశ్రాంతి తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నింటినీ సోమవారం మధ్యాహ్నం మహానివేదనలు చేసి ముగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, ప్రముఖ వేద పండితులు బుచ్చయ్య శాస్త్రి, గణేష్ శర్మ ఉన్నారు.