Why is Gauri Puja performed prior to the marriage? - Sakshi
Sakshi News home page

పెళ్లిలో గౌరి పూజ ఎందుకు? ఏ సరస్వతినో, లక్ష్మీ దేవినో పూజించొచ్చు కదా!

Published Wed, Jul 5 2023 11:12 AM | Last Updated on Fri, Jul 14 2023 3:41 PM

Why Gauri Puja Can Be Worshiped In The Marriage  - Sakshi

వివాహానికి ముందు కన్యలు గౌరీ పూజ చేస్తారు. ఈ ఆచారం ఇంచుమించు భారతదేశమంతటా ఉంది. శ్రీ కృష్ణుడిని ప్రేమించి అతనినే వివాహము  చేసుకోదలచిన రుక్మిణీదేవి కూడా గౌరీపూజ చేసింది. అయితే గౌరీపూజ ఎందుకు చేయాలి? లక్ష్మీదేవినో, సరస్వతినో పూజించవచ్చు కదా? ఈ ప్రశ్నకు శ్రీ కంచి పరమాచార్యుల వారు ఇచ్చిన వివరణ!.. దాని సారాంశం ఏంటో చూద్దామా!.

అన్నింటికీ అతీతంగా భర్తను ప్రేమించినప్పుడే..
లక్ష్మీదేవి భర్త శ్రీ మహావిష్ణువు అందం, చందం, అలంకారం, ఐశ్వర్యం ఉన్న మహాప్రభువు. ఆయనతో కాపురం నల్లేరు మీద బండిలా హాయిగా సాగిపోతుంది. మరి శివుడు అలా కాదే అయన స్మశానవాసి. పాములు మెడలో వేసుకుంటాడు. చేతిలో కపాలం ధరిస్తాడు. చూడడానికి మహ భయంకరంగా ఉంటాఢు. ఇంత బూడిద తప్ప అయనకు ఐశ్వర్యమేముంది కనుక? ఆయనతో కాపురం చేయడం మాటలు కాదు. అందుకు ఎంతో ఓపిక ఉండాలి. ఎన్నో అవమానాలు దిగమింగాలి. ఇంకోవైపు అసంతృప్తి చిహ్నలు కనిపించకూడదు, చిరునవ్వు చెరగకూడదు. ఇది ఎప్ఫుడు సాధ్యమవుతుంది? వీటన్నింటికీ అతీతంగా భర్తను ప్రేమించి, ఆరాధించినప్పుడే.

వివాహానికి ముందు, వివాహానికి తర్వాత ఎందరో అడపిల్లల అనుభవం చూడండి. పెళ్ళంటే అంతవరకు పరిచయం లేని కొత్త వ్యక్తి తాను కలగన్న రాకుమారుడు కాకపోవచ్చు. తాను కోరుకున్నంత సంపన్నడు కాకపోవచ్చు. కానీ, తన జీవితం అతనితో ముడిపడిపోయింది. అందుకే వివాహాలు స్వర్గంలో నిర్ణయమవుతాయని సామెత. నిజానికి ఈసూత్రం మన దేశానికీ, మన వివాహ వ్యవస్థకే కాదు ప్రపంచంలో ఎక్కడైనా వర్తిస్తుంది. భర్త పట్ల భార్యకీ, భార్య పట్ల భర్తకి ఉన్న ప్రేమ మాత్రమే వీటిని జయించగలుగుతుంది. అందుకు అదర్శం సతీదేవి. కన్నతండ్రి దక్షుడు, తన భర్త రూపురేఖలను, దరిద్రాన్ని ఎత్తి చూపించి దూషించినప్పుడు భరించలేక సతీదేవిగా అగ్నిప్రవేశం చేసింది. అందుకు ప్రధాన కారణం మమేకభావమే.

అందుకే ఈ గౌరి పూజ..
అటువంటి గౌరీదేవిని గుర్తు చేసుకుంటే వైవాహిక జీవితంలో కలతలు రావు. సంసారం స్వర్గతుల్యం అవుతుంది. పెళ్లికి ముందు ఆడపిల్లల చేత గౌరీపూజ చేయించడం అందుకే. ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి, సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన.. విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు. వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్తారు.

గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా ఆడ పెళ్ళి వారు వారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వానిస్తారు.

నాయనా! నా కుమార్తెను భార్యగా స్వీకరించి..
వరపూజలోనే ఇరువైపువారు ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది. మగ పెళ్లివారందరు కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం, సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం కోసం కన్యను వరించడానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్లండి" అని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది.

(చదవండి: మంగళవారం మంచిదికాదా? ఎందుకు ఆ రోజు ఆ పనులు చేయరు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement