పెళ్లిలో గౌరీపూజ ఎందుకు?
• ఒక నిమిషం – ఒక విశేషం
పెళ్లిళ్లలో గౌరీపూజ ప్రధాన క్రతువు. ఇంతకూ గౌరీపూజ ఎందుకు చేస్తారో తెలుసా? గౌరి అంటే గౌరవర్ణం కలది అని అర్థం. తెలుపు, ఎరుపు, పసుపు, బంగారం, కుంకుమపువ్వు వర్ణాలు కలగలసిన తల్లి గౌరి. నల్లగా ఉన్న పార్వతీదేవిని కాళి అని పరిహసించాడు పరమేశ్వరుడు. ఆ పరిహాసానికి ఆత్మాభిమానం దెబ్బతిని, స్వామివారిని వీడి, భూలోకానికి వచ్చి, తపస్సు చేసి, తన రంగును మార్చుకుని, శివుణ్ణి మెప్పించి వివాహమాడింది. అంటే భర్త తిరస్కరించినా, అదేవిధంగా పార్వతీదేవి మాంగల్యబలం చాలా గొప్పది. తన మాంగల్యబలం మీదున్న నమ్మకంతోటే తన పతి దేవుడు క్షీరసాగర మథనంలో వెలువడిన కాలకూట విషాన్ని ఉండగా చేసుకుని, మింగుతున్నా, వారించలేదు.
ఆ నమ్మకం వమ్ముకాలేదు. బ్రహ్మవిష్ణువులు కూడా సాహసించని విషాన్ని మింగినా గరళకంఠుడు, విషకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు తప్ప ఆయనకు ఏమీ కాలేదు. ఆ మాంగల్యబలం ఉండాలనే వివాహానికి ముందు కన్నెపిల్లల చేత గౌరీపూజ చేయిస్తారు. కాబోయే దంపతులు ఆదిదంపతులైన గౌరీశంకరుల ఆశీర్వాదాలతో ఆదిదంపతుల్లా నిలిచి ఉండాలన్న ఆకాంక్షతో.
వాస్తు ఎందుకు?
మన శరీరం పాంచభౌతికమైనది. అంటే నింగి, నేల, గాలి, నీరు, నిప్పు అనే పంచభూతాలతో నిర్మితమైంది. మనిషి జీవించే గృహం కూడా అలాగే ఉండాలి. ఇంటి వాస్తు సక్రమంగా ఉంటే, పంచభూతాలు తమ అనుకూల ప్రకంపనలతో ఇంటిని నందనవనం చేస్తాయి. గృహనిర్మాణ సమయం లోనే వాస్తు సూత్రాలను పాటిస్తే తర్వాత ఇబ్బందులు ఉండవు. ఇంటి వాస్తు ప్రభావం ఆ ఇంటిలో ఉండే వారిమీదే ఉంటుంది. ఆ ఇంటి యజమాని వేరొక నగరంలో ఉన్నా, ఇతర దేశాలలో ఉన్నా, ఆ ప్రభావం వారి మీద దాదాపు ఉండదని, కాకపోతే అదే ఊరిలో వారికి ఇల్లు ఉండి, వేరొకచోట అద్దెకు ఉంటే వారి మీద సొంత ఇంటి వాస్తుప్రభావం 20 శాతం వరకు ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు.
ఒక్క ఇంటివాస్తే కాకుండా, ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసరాల ప్రభావం కూడా ఆ ఇంటిమీద ఉంటుందని వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.
• సూక్తులు... సుభాషితాలు
శాంతి, సౌఖ్యం నీలోనే ఉన్నాయి!
ప్రపంచంలో మతానికి సంబంధించిన సిద్ధాంతాలు, శాస్త్రాలు అనేకం ఉన్నా, జాగ్రత్తగా పరిశీలిస్తే, ఉన్నది ఒక్క మతమే అన్న సంగతి బోధపడుతుంది. ఉన్నతమైన వ్యక్తిత్వం, మానసిక పరిశుద్ధత, భగవంతుని యెడల ప్రేమ, సత్యాన్ని చేరుకోవాలనే తపన ఈ ఒక్కమతంలో ఇమిడి ఉంది.
ఎంత ఎక్కువగా నీవు భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావో, అంత తక్కువగా నీవు అతణ్ణి అర్థం చేసుకుంటావు.
జీవిత లక్ష్యం భగవంతుడిని ప్రేమించడం. జీవిత గమ్యం భగవంతుడిలో ఐక్యమవటం. భగవంతుడినుంచి ఏదో ఆశించి భగవంతుడిని ప్రేమించటం, నిజంగా అతణ్ణి ప్రేమించటం కాదు. భగవంతుడి నుండి నీవు ఏదో ఆశించి, నీవు దేనినో త్యాగం చేయడం ఎలా ఉంటుందంటే, గుడ్డివాడు చూపుకోసం తన కళ్లను త్యాగం చేయటంలా ఉంటుంది.
శాంతి, సౌఖ్యం పోరాటం వలన సిద్ధించేవి కావు. తనలోనే వాటిని వెతకవలసి ఉంది. ఈ సత్యాన్ని ఎప్పుడయితే తెలుసు కుంటారో, అప్పుడే పోరాటాన్ని వదిలి, ప్రశాంతంగా ఉండగలరు.
– అవతార్ మెహర్ బాబా