
ఏడుపడగల పాము విడిచిన పొరగా చెప్పబడుతున్న పొర
దొడ్డబళ్లాపురం : ఏడు పడగల పాము గురించి మనం సాధారణంగా సినిమాల్లో చూస్తాం లేదంటే కథల్లో వింటుంటాం..నిజానికి ఏడుపడగల పాము ఉందా. అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పలేము..ఉందా? అంటే ఉందని సాక్ష్యాలూ చూపలేము..అది నమ్మిన వారికి నిజం, నమ్మనివారికి కట్టుకథ... ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటారా.. రామనగర జిల్లా కనకపుర తాలూకా కోడిహళ్లి గ్రామం సమీపంలో ఏడుపడగల పాముకు చెందినదిగా చెప్పబడుతున్న పాము పొరకు జనం సాక్ష్యాత్ నాగదేవతగా భావించి పూజలు చేసేస్తున్నారు.
గత మూడు రోజుల క్రితం గ్రామం సమీపంలో స్థానికులకు కనిపించిన పాము పొర ఏడు పడగలను కలిగి ఉంది. దీంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు అదో మహత్యంగా భావించి పూజలు ప్రారంభించారు. సమీపంలోనే పాము పుట్ట కూడా ఉండడంతో జనం నమ్మకాలకు ఊతమిచ్చినట్టయింది. విషయం కాస్త పక్క గ్రామాలకూ తెలిసి జనం తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. 6 నెలల క్రితం దగ్గరలోని కోటెకొప్పఅనే గ్రామం నివాసి దొడ్డకెంపేగౌడ అనే వ్యక్తికి ఏడుపడగల పాము కనిపించినట్టు చెప్పుకున్నాడు. అప్పుడు దగ్గరలో పనిచేస్తున్న కొందరితో ఏడుపడగల పాము పోతోంది చూద్దురు రండి అంటూ పిలిచాడట. అయితే అప్పుడు పాము కనిపించలేదట. ఇప్పుడు వారి నమ్మకాలను బలపరిచేలా ఏడుపడగలు గల పాము పొర కనిపించడంతో జనం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పూజలు చేస్తున్నారు.