రామనగర(కర్ణాటక): జిల్లాలోని లింగాయత్ మఠాధిపతి ఆత్మహత్య ఉదంతంలో విస్మయానికి గురి చేసే కోణం ఒకటి వెలుగు చూసింది. హనీట్రాప్‌లో చిక్కుకుని ఆ బ్లాక్‌మెయిలింగ్‌ను భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.
రామనగర జిల్లా కంచుగల్ బండ్ మఠానికి చెందిన బసవలింగ స్వామిజీ(45).. తన పూజా మందిరంలో కిటికీ గ్రిల్‌కు ఉరేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను పీఠాధిపతిగా తొలగించే యత్నాలు జరుగుతున్నాయని, ఆ వేధింపులను తట్టుకోలేకే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ నోట్ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసుపై ఓ అంచనాకి వచ్చారు. అయితే..
సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు.. ఇది హనీట్రాప్ కోణంతో ముడిపడి ఉందని గుర్తించారు. ఓ మహిళ సాయంతో ఆయన్ని అసభ్య కోణంలో చిత్రీకరించి.. ఆ వీడియోల ద్వారా ఆయనపై వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. వీడియోలో ఉన్న మహిళ ఎవరో తెలియదు.. కానీ, ఆమె వల్లే ఇదంతా అంటూ ఆయన లేఖలో రాసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఓ మహిళతో ఆయన అభ్యంతరకర రీతిలో వీడియో కాల్ మాట్లాడినట్లు.. అందుకు సంబంధించిన మొత్తం నాలుగు వీడియోలను పోలీసులు గుర్తించారు. మహిళ తన ఫోన్‌లోని స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఆ వీడియోలను రికార్డ్ చేసినట్లు ఉంది. ఆ మహిళ ఎవరు? ఆ వీడియోల ద్వారా ఆయన్ని స్థానం నుంచి తప్పించాలనుకున్నారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక కన్నడనాట మఠాలపై, మఠాధిపతులపై రాజకీయ ప్రభావం ఉండడంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేస్తామని వెల్లడించారు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న కంచుగల్ బండ్ మఠానికి బసవలింగ స్వామిజీ.. తన 20వ ఏట(1997లో) మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్యే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి కూడా.
Comments
Please login to add a commentAdd a comment