- సిక్కిం పూర్వ గవర్నర్ రామారావు
కైకలూరు : నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పయనించాలని సిక్కిం మాజీగవర్నర్, బీజేపీ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు వెంట్రప్రగడ రామారావు అన్నారు. కైకలూరు మండలంలోని వివిధ దేవాలయాల సందర్శనకు భార్య వసంతకుమారి, కుమారుడు శ్రీనివాస్‌తో కలసి సోమవారం ఆయన వచ్చారు.
ముందుగా స్థానిక శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మేనేజర్ శింగనపల్లి శ్రీనివాసరావు ఆయనను ఘనంగా సత్కరించారు. ఆటపాకలోని కామినేని రామకృష్ణ నివాసంలో అల్పహారం తీసుకున్నారు. అనంతరం వరహాపట్నం గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ లక్ష్మీనృసింహ దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
కైకలూరులోని శ్రీ రామకృష్ణా సేవాసమితిని సందర్శించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు చెరుకువాడ శివరామరాజు, చింతపల్లి వెంకటనారాయణలు ఆయనను ఘనంగా సత్కరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేంపాటి విష్ణురావు , ఎంపీపీ బండి సత్యవతి, బీజేపీ నాయకులు లావేటి వీరశివాజీ, ప్రత్తిపాటి అమృత కమలాకరరావు, బండి శ్రీనివాసరావు, బందా సత్యనారాయణ ప్రసాద్, గుల్లపల్లి పద్మినీ, సుబ్బరాజు, జోసఫ్, వీరరాఘవులు, శ్రీనివాసగుప్తా పాల్గొన్నారు.
కేంద్రం, రాష్ట్రాల మైత్రి పెరగాలి
కేంద్ర, రాష్ట్రాల మధ్య మైత్రీబంధం పెరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని వెంట్రప్రగడ రామారావు ఆకాంక్షించారు. దేవాలయాల సందర్శనలో భాగంగా కైకలూరు వచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా నూతన రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అసెంబ్లీలో చిన్న చిన్న విషయాలకు సమయాన్ని వృథా చేయకూడదని సూచించారు. పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.