
సీఎస్పీ రావు
తాడేపల్లిగూడెం : ఏపీ నిట్ డైరెక్టర్‌గా చిలకలపల్లి సూర్యప్రకాశరావు (సీఎస్పీ రావు) నియమితులయ్యారు. ఏపీ నిట్ ప్రారంభించాక వరంగల్ నిట్ డైరెక్టరే దీనికి మెంటార్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్లమెంటులో నిట్ డైరెక్టర్ పోస్టు భర్తీకి ఆమోద ముద్ర లభించడంతో పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించి భర్తీ ప్రక్రియ పూర్తిచేశారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన సీఎస్పీరావును ఏపీ నిట్ డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. అధికారిక ఉత్తర్వులు మంగళవారం వచ్చాయి. రావు ఢిల్లీ వెళ్లి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ నిట్ మెంటర్ డైరెక్టర్‌గా వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు వ్యవహరిస్తున్నారు.
అంకితభావంతో పనిచేసే వ్యక్తి
చిలకలపల్లి సూర్యప్రకాశరావు అంకిత భావంతో పనిచేసే వ్యక్తి అని ఆయన గురించి తెలిసినవారు చెబుతున్నారు. ఆయన పలుమార్లు కేంద్ర మానవవనరుల శాఖ ప్రశంసలు అందుకున్నారు. 1985లో కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తిచేశారు. 1988లో వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్, ఇదే కళాశాలలో పీహెచ్‌డీ చేశారు. వరంగల్ నిట్‌లో డిపార్టుమెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ హెచ్‌ఓడీగా, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ హెడ్‌గా, రిజిస్ట్రార్‌గా, గెస్టు హౌస్ ఫెసిలిటీ ఇన్‌చార్జిగా, నిట్ హాస్టళ్ల వార్డెన్‌గా పనిచేశారు.
ఎన్నో అవార్డులు
పీహెచ్‌డీ విద్యార్థులకు మార్గదర్శకం చేసినందుకు 30 అవార్డులు రావుకు దక్కాయి. మరో 8 ప్రతిపాదనలో ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో రావు వ్యాసాలు రాశారు. పది జాతీయ జర్నల్స్, 75 జాతీయ జర్నల్స్‌లో ఆయన వ్యాసాలు ప్రచురించారు. 75 జాతీయ సమావేశాలు, 109 జాతీయ సమావేశాలలో రావు పాల్గొన్నారు. రావు నాలుగు పుస్తకాలు రాశారు. 11 ప్రాజెక్టులను పూర్తి చేశారు. ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, గవర్నమెంటు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2008లో పొందారు. 2008లోనే సైంటిస్టు ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించారు. 2013లో ఎక్కువ పీహెచ్‌డీలు పూర్తిచేసినందుకు పురస్కారం అందుకున్నారు. 25ఏళ్లపాటు వరంగల్ నిట్‌కు సేవలను అందించినందుకు 2015లో పురస్కారం అందుకున్నారు. క్యాడ్ అండ్ క్యామ్‌కు సంబంధించి 2004లో, ప్రొడక్షన్ టెక్నాలజీపై 2008లో, ఆటోక్యాడ్ వినియోగంపై 2014లో పుస్తకాలు రాశారు. డిఫెన్సు ఫోర్సులకు సంబంధించి ఆర్మామెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
పోస్టుల భర్తీకిలైన్ క్లియర్
నిట్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తులనూ పరిశీలించారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, పోస్టుల భర్తీ చేయడానికి డైరెక్టర్ రాకతో మార్గం సుగమమైంది.
Comments
Please login to add a commentAdd a comment