కోనసీమలోనే నూరు శాతం సినిమా చిత్రీకరణ
ఫిలిం అసోసియేషన్ నటీనటులకు అవకాశం
అమలాపురం టౌన్: ఆయ్.. ఓయ్.. మాటలు గోదావరి జిల్లాల యాసే. గోదారోళ్ల వెటకారంతో కూడిన మాటలు, యాసలు ఇటీవల కాలంలో యూట్యూబ్, సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అవే సినిమాల్లోనూ సక్సెస్ అవుతున్నాయి. ఈ కోవలోంచే రెండు రోజుల కిందట విడుదలైన ‘ఆయ్’ సినిమా పుట్టుకొచ్చింది. దీనిని గోదారోళ్ల యాసను రంగరించి చిత్రీకరించారు. అమలాపురం కుర్రాడైన యువ దర్శకుడు అంజిబాబు కంచిపల్లి దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే నూరు శాతం కోనసీమ గ్రామీణంలో సినిమా తీసి విజయవంతం అయ్యారు.
ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, కమిటీ కుర్రాళ్లు చిత్రాలు కూడా దాదాపు కోనసీమ అందాల నడుమే రూపుదిద్దుకున్నాయి. ఈ చిత్రాల్లో కోనసీమ ఫిలిం అసోసియేషన్‌కు చెందిన వర్థమాన నటీనటులు 50 మందికి పైగా ఆయా చిత్రాల దర్శకులు అవకాశాలు ఇచ్చారంటే ఈ పచ్చని సీమకు సినిమా సిరి పెరుగుతోందని తెలుస్తోంది. ఆయ్ చిత్రంలో కోనసీమ ఫిలిం అసోసియేషన్‌కు చెందిన 12 మంది నటీనటులకు ఛాన్స్ దొరికింది.
అంజిబాబు ప్రస్థానం ఇది
అమలాపురం కొంకాపల్లికి చెందిన వర్ధమాన సినీ దర్శకుడు అంజిబాబు కంచిపల్లి ఎస్‌కేబీఆర్ కాలేజీలో చదివారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచీ ఆయన సినీ పరిశ్రమపై మక్కువ పెంచుకున్నారు. 12 ఏళ్ల కిందటే మంచి సందేశాత్మక చిత్రాలు తియ్యాలన్న ఆకాంక్షతో సినీ పరిశ్రమలోని దర్శక విభాగంలో శిక్షణ పొందారు. అసోసియేట్, కోఅసిస్టెంట్ డైరెక్టర్‌గా పలువురి దర్శకుల వద్ద పనిచేశారు. నేడు తాను కన్న సినీ కలను నెరవేర్చుకునేలా ఆయ్ చిత్రాన్ని రూపొందించారు. తాను పుట్టి పెరిగిన అమలాపురం పరిసర ప్రాంతాల్లోనే ఆ సినిమాను తీసి కోనసీమ కుర్రాడు అనిపించుకున్నారు.
దర్శకుడిగా తొలిసారిగా ఆయ్ చిత్రానికి బాధ్యత వహించి కోనసీమ నేటివిటీని, ఆ సీమతో మిళితమయ్యే కథాంశాన్ని తెరకెక్కించారు. అమలాపురం పట్టణంతోపాటు కోనసీమలోని దాదాపు 22 గ్రామాల్లోని నదీ పాయలు, కొబ్బరి, అరటి తోటలు, వరి చేలు, కాలువ గట్లు, సముద్ర తీరాన్ని తన సినిమాలో బంధించారు. చిన్నతనంలో స్నేహాలుగా చిగురించి పెద్దయ్యాక కులాల కుంపటితో రగలిపోయే నేటి తరాన్ని కులాలు కంటే స్నేహాలు గొప్పవన్న సందేశంతో సినిమాను ఆద్యంతం రక్తికట్టించారు. అందుకే ‘ఆయ్’ మెయిన్ టైటిల్‌తోనూ, ‘మేం ఫ్రెండ్స్‌ండి’ అనే సబ్ టైటిల్ (ట్యాగ్)తో చిత్రాన్ని రూపొందించారు.
మధ్యలో హాస్యం జోడించి పూర్తి ఇంటర్‌టైన్‌మెంట్ సినిమాను తన మొదటి బహుమతిగా ప్రేక్షకులకు అందించారు. కమిటీ కుర్రాళ్లు సినిమా ఇక్కడి నేటివిటీతో చిత్రీకరించి హిట్ కొడితే.. ఆయ్ చిత్రం కూడా కోనసీమ యాసను, స్నేహా బంధాలను గుర్తు చేస్తూ సాగింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, కమిటీ కుర్రాళ్లు చిత్రాల దర్శకులు కోనసీమేతురులై ఈ రెండు చిత్రాలను ఈ ప్రాంత నేటివిటీతో చిత్రీకరించారు. అయితే ఆయ్ చిత్ర దర్శకుడు అంజిబాబు అమలాపురానికి చెందిన వాడై.. ఈ ప్రాంతానికి అనువైన, అనుబంధమైన కథాంశాన్ని ఎంచుకుని కష్టపడి, ఇష్టపడి తీశారు.
ఇక్కడి నుంచే నా తొలి చిత్రం
నేను సినీ దర్శకునిగా తొలి చిత్రం ‘ఆయ్’ కోనసీమ నుంచే శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. 12 ఏళ్ల నా కల సాకారమైంది. స్నేహ సంబంధాలు కులాల రాపిడిలో పడి చెక్కు చెదరకూడదన్న సందేశంతో ఈ చిత్రం తీశాను. కేరళకు మించిన ప్రకృతి సహజ సిద్ధ అందాలు కోనసీమలోనే ఉన్నాయి. నా చిన్నతనం నుంచి చూస్తున్న కోనసీమ ప్రకృతి అందాలతో పాటు అచ్చమైన గ్రామీణ సౌందర్యాన్ని చిత్రంతో తెరకెక్కించాను. హాస్యం, సెంట్‌మెంట్ తదితర అంశాలతో మంచి చిత్రాన్ని తీశానన్న సంతృప్తి మిగిలింది.
– అంజిబాబు కంచిపల్లి, ఆయ్ చిత్ర దర్శకుడు, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment