
పెళ్లి కాక ముందు నేను ఒక కుందెలో దీపారాధన చేస్తూ వచ్చాను. పెళ్లయ్యాక అత్తగారింట్లో రెండు కుందెలు పెట్టాలన్నారు. దేనిని అనుసరించాలి?
సూర్యుడు ప్రత్యక్ష దీపం. ఆయన ఉదయించక ముందూ, ఆయన అస్తమించిన వెనుకా ఆయనకి ప్రతినిధిగా మన ఇంట్లో వెలిగించేది ప్రత్యక్ష దీపం. ఈ కాలంలో శ్రోత్రియులూ, నిష్ఠాపరులూ అయిన వాళ్లు మంత్రపూర్వకంగా అగ్నిహోత్రాన్ని చేస్తారు.
నిజానికి ఒక దీపాన్ని మూడు వత్తులతో (సాజ్యం త్రివర్త సంయుక్తం .... తిమిరాపహమ్) వెలిగిస్తే చాలు. అయితే ఇటు ఒక దీపం, అటు పక్క ఒక దీపం పెడితే రెండువైపుల కాంతి నడుమా భగవంతుడు బాగా కనిపిస్తాడనే ఆలోచనతో రెండు దీపాలని ఎవరో ప్రారంభించి ఉంటారు. గృహాణ మంగళం దీపమ్ (ఒక దీపాన్నే) అని ఏకవచనమే ఉంది తప్ప రెండు దీపాలనే నియమం ఏమీ లేదు.
తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలంటారు కదా! మరి దేవుళ్లకి ఈ పూజలూ వ్రతాలూ ఎందుకు? తలిదండ్రులకి రోజూ నమస్కరిస్తే చాలుగా?!
భగవంతుడి పేరిట పూజలూ వ్రతాలూ చేస్తూ వాటిలో మునిగిపోయి వయసులో పెద్ద అయిన తల్లిదండ్రులకి సకాలంలో భోజనం పెట్టని పక్షంలో, అలాగే తలిదండ్రుల్ని సక్రమంగా గౌరవించని పక్షంలో ఈ వ్రతాలూ, పూజలూ వ్యర్థమే అని చెప్పడం వాళ్లని ప్రత్యక్ష దైవాలనడంలోని అంతరార్థం. తిండి తినని పక్షంలో వ్యాధి వికటించే పరిస్థితిలో తల్లిగాని తండ్రిగాని ఉంటే వాళ్లకి ప్రత్యేకమైన వంటని చేయించి ఆబ్దికం నాడైనా సరే మరో ప్రదేశంలో భుజింప చెయ్యాలని ధర్మశాస్త్రం నిశ్చయించి చెప్పింది.
శుభకార్యం ఒకటి చేశాక మరో శుభకార్యానికి కొంత గడువు తీసుకోవాలా?
ఒక ఇంట్లో ఒక శుభకార్యం చేశాక కనీసం ఒక ఆయన కాలం (6 నెలలు) వ్యవధి ఉండాలంటోంది శాస్త్రం. శుభకార్యమనగానే బంధువుల రాకపోకలతో అలసట వంటివన్నీ ఉంటాయి. వెంట వెంటనే శుభకార్యాలయిన పక్షంలో కష్టం కదా! అదీ కాక శుభకార్యాలు వరసగా జరుగుతున్న పక్షంలో అసూయ నిండిన కళ్లు ఎంత బాధపడతాయో కదా!
ఆబ్దికం రోజున సంధ్యావందనం చేయవచ్చా? చేస్తే ఎంతవరకూ చేయాలి?
నిజానికి ఆబ్దికం రోజున జందేన్ని మార్చుకుని మరీ సంధ్యావందనాన్ని చేయాలి. సంధ్యావందనాన్ని చేయని పక్షంలో ఏ కర్మనీ నిర్వహించే అధికారం యజమానికి సిద్ధించదు. పూర్తి సంధ్యావందనాన్ని ఆబ్దికానికి ముందు చేసి, మంత్ర తంత్ర కర్తృ భోక్తృలోపాలేవైనా ఉంటే వాటి నివారణకై దశ గాయత్రిని ఆబ్దిక కాలంలో జపించాలి.
తలస్నానం చేయకుండా ఉపవాసం, పూజలు చేసినా ఫలితం ఉండదా?
శరీరమనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పుణ్యకార్యమైనా అది చేయగలుగుతుంది. (శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్‌ు). అవకాశం ఉన్నంతలో – అంటే ఆరోగ్యం ఏమాత్రమూ దెబ్బతినదని అన్పించిన పక్షంలో– తలస్నానం చేసి ఉపవాసం, పారాయణం చేయండి. ఆరోగ్యం బాగుండి కూడ ఈ వంకతో నియమాన్ని పాటించక పోవడం నేరమే.
Comments
Please login to add a commentAdd a comment