- గోదారిలో రామయ్య విహారం
- వైభవంగా తెప్పోత్సవం
- పల్లకి మోసిన మంత్రులు
భద్రాచలం: గోదావరి నదీ తీరం భక్త జనంతో పులకించింది. హంసవాహనంపై శ్రీ సీతారామచంద్రస్వామి వారు విహరిస్తుంటే వీక్షించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. జయజయధ్వానాలు చేశారు. మిరిమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల్లో ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై స్వామివారు కొలువుదీరారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ నదిలో విహరించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో బుధవారం నిర్వహించిన ఈ వేడుకకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న హాజరై స్వామివారి పల్లకిని స్వయంగా మోశారు. తెప్పోత్సవానికి ముందు స్వామివారు వివిధ పూజలు అందుకున్నారు.
దర్భారు సేవ
శ్రీ సీతారామచంద్రస్వామివారికి గర్భగుడిలో వేదపండితులు దర్భారు సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులకు విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం గావించారు. ఉదయం సేవాకాలం, శ్రీ తిరుమంగై ఆళ్వార్‌లు పరమపదోత్సవం చేశారు. మధ్యాహ్నం రాజభోగం, శాత్తు మురై, పూర్ణశరణాగతితో పగల్‌పత్తు ముగిసింది. గర్భగుడిలో ప్రభుత్వోత్సవం ( దర్భార్ సేవ) నిర్వహించారు.
తెప్పోత్సవం..
వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య తెప్పోత్సవం కోసం స్వామివారిని ఆలయం నుంచి ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకోచ్చారు. రాజాధిరాజ వాహనంపై గోదావరి నదిలో విహరించేందుకు బయలుదేరిన శ్రీ సీతారామచంద్రస్వామివారిని వీక్షించి తరించేందుకు దారి పొడవునా భక్తులు బారులు తీరారు. గోదావరి తీరంలో అర్చకులు ముందుగా పుణ్యజలాలతో హంసవాహనాన్ని సంప్రోక్షణ చేశారు. ఊరేగింపుగా వచ్చిన స్వామి వారిని హంసవాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు వేదపండితులు చతుర్వేదాలు, నాళాయర్ దివ్యప్రబంధం, పంచసూత్రాలు, స్తోత్ర పాఠాలు చదివారు. మంగళహారతి, చక్రపొంగలి నివేదన చేశారు. రామనామ సంకీర్తనలు, భక్తుల కోలాహలం మధ్య స్వామివారి తెప్పోత్సవం వైభవంగా సాగింది.
ఆకట్టుకున్న కోలాటం
ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా గోదారి తీరానికి బయలుదేరారు. రాజాధిరాజ వాహనంపై స్వామివారు వెళ్లే సమయంలో పల్లకి ముందు వివిధ కోలాట బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేద విద్యార్థుల కీర్తనలు, వికాస తరంగణి, శ్రీ కృష్ణ కోలాట భజన మండలితో పాటు వివిధ సంస్థలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం నుంచి గోదావరి స్నానఘట్టాల వరకు కోలాట బృందాల కీర్తనలతో స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది.
బాణసంచా వెలుగుల్లో...
సాయంత్రం 5 గంటలకు స్వామివారు హంసవాహనంపై కొలువుదీరారు. వాహనం 6 గంటలకు బయలుదేరింది. గోదావరిలో స్వామివారు ఐదుసార్లు విహరించారు. నదిలో హంసవాహనం తిరుగుతున్నంత సేపు బాణసంచా వెలుగుల్లో ఆకాశం హరివిల్లైంది. తెప్పోత్సవ సమయానికి నదీ తీరం భక్తజనంతో పోటెత్తింది.
స్వామివారి సేవలో మంత్రులు..
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి భద్రాద్రిలో నిర్వహించిన తెప్పోత్సవానికి రాష్ట్రమంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న స్వామివారి పల్లకిని మోశారు. తెప్పోత్సవ వేడుకలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు.
మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, సిర్పూర్ కాగజ్‌నగర్, అశ్వారావుపేట, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, తాటి వెంకటేశ్వర్లు, బాణోత్ మదన్‌లాల్, సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్‌పర్సన్ గడపల్లి కవిత, కలెక్టర్ ఇలంబరితి, జేసీ సురేంద్రమోహన్, జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం, ఐటీడీఏ పీవో దివ్య, ఆర్డీవో అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఏఈవో శ్రావణ్‌కుమార్, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండటం, రాష్ట్ర మంత్రుల రాకతో భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఓఎస్డీ జోవెల్‌డేవిస్ పర్యవేక్షణలో పోలీసుబందోబస్తు కట్టుదిట్టం చేశారు.