శతాభిషేక మహోత్సవంలో పాములకు పూజలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అదో శతాభిషేక మహోత్సవం. బంధుమిత్రులతో ఎంతో సరదాగా, సందడిగా గడుపుదామని వచ్చిన ఆహ్వానితులంతా బిక్కచచ్చిపోయి ఉన్నారు. మరికొందరు శిలాప్రతిమల్లా నీలుక్కుపోయి ఉన్నారు. శతాభిషేకం చేయించుకుంటున్న 80 ఏళ్ల తండ్రి, అతని ధర్మపత్ని ఊపిరి బిగబట్టి భయంతో వణికిపోతున్నారు. తల్లిదండ్రులకు శతాభిషేకం నిర్వహిస్తున్న కుమారుడు సైతం ప్రాణభయంతో మంత్రాలు చెబుతున్నాడు. వీరందరితోపాటు నాగుపాములు సైతం శతాభిషేకానికి హాజరు కావడమే అందరి భయాందోళనలకు కారణం. కడలూరు మంజాకుప్పంలో చోటుచేసుకున్న ఈ చోద్యం వివరాలు ఇలా ఉన్నాయి.
కడలూరు మంజాకుప్పంకు చెందిన సుందరేశన్ (45)అదే ఊరిలోని ఒక ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. 80 ఏళ్లు పూర్తిచేసుకున్న తన తండ్రికి శతాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తలచాడు. నాగుపాములు పెట్టి పూజలు చేస్తే తల్లిదండ్రులకు పూర్ణాయుష్షు లభిస్తుందని కొందరు చెప్పిన మాటలను అక్షరాల పాటించాడు. పాములు పట్టే వ్యక్తి ద్వారా రెండు నాగుపాములను తెప్పించాడు. బుట్టలో ఉన్న పాములను బైట పెట్టి పూజలు ప్రారంభించారు. కుమారుని పక్కనే కూర్చోవాల్సిన వృద్ధ తల్లిదండ్రులు దూరంగా కుర్చీ వేసుకుని జరుగుతున్న తంతును కళ్లప్పగించి చూడడం ప్రారంభించారు.
చుట్టూ జనం, వేదమంత్రాల ఘోషతో కంగారుపడుతున్న నాగుపాములు కుమారుడు సుందరేశన్‌పైకి ఉరికే ప్రయత్నం చేయడం, పాములు పట్టేవాడు వాటినితనవైపునకు తిప్పుకోవడం పదే పదే సాగింది. చిర్రెత్తుకొచ్చిన నాగులు సుందరేశన్‌పై బుసలు కొట్టగా భయపడిపోయాడు. ఈ కార్యక్రమానికి హాజరైన బంధువుల్లో కొందరు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియోగా చిత్రీకరించి వాట్సాప్‌లో పోస్టు చేశారు. 17 నిమిషాల నిడివిగల ఈ దృశ్యాలు వైరలై తిన్నగా అటవీ అధికారులకు చేరాయి. అటవీ అధికారులు అధికారులు విచారణకు ఆదేశించి పాములు పెట్టి పూజలు చేయడాన్ని నిర్ధారించుకున్నారు. పూజల పేరుతో పాములతో పరాచికాలాడిన సుందరేశన్‌ను గురువారం అరెస్ట్‌చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. పరారైన పాములవాడి కోసం గాలిస్తున్నారు. మేళతాళాల మధ్య సాగిన శతాభిషేకం చివరకు విషాదంగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment