
ఇదేం పండగ బాబోయ్..!
విడ్డూరం
పండుగ అంటే ఏదో కొత్త బట్టలు వేసుకుని, పిండి వంటలు చేసుకుని, దేవుడికి పూజలు చేయడం అని మనమనుకుంటాం. కానీ విదేశాల్లో జరుపుకునే కొన్ని పండుగల గురించి వింటే ఇవేం పండుగల్రా బాబూ అనిపిస్తుంది. వాటిలో ఇవి కొన్ని...
కూపర్‌స హిల్ చీజ్ రోలింగ్ అండ్ వేక్ - ఇదో విచిత్రమైన పండుగ. ఇంగ్లండ్‌లోని కూపర్‌స కొండ మీద జరగడం వల్ల దానికా పేరు వచ్చింది. పోటీదారులంతా కొండమీద నిలబడి ఉంటారు. బెల్ కొట్టగానే అందరూ కింద పడి దొర్లడం మొదలు పెడతారు. వేగంగా దొర్లుకుంటూ ఎవరైతే మొదట కొండ కిందకు వెళ్తారో వారే విజేత!
మంకీ బఫే ఫెస్టివల్ - థాయ్‌ల్యాండ్‌లో ఇది ముఖ్యమైన పండుగ. అక్కడి లోప్‌బురీ ప్రాంతంలో కోతుల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. అందుకే ఏటా ఓ రోజు అక్కడ కోతుల పండుగ జరుపుతారు. ఆ రోజున దాదాపు రెండువేల కిలోల పండ్లు, కూరగాయలు, ఇతరత్రా ఆహార పదార్థాలు కోతులకు పెడతారు. ఈ వేడుకలో పాల్గొనడానికి విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తుంటారు!
హడకా మత్సూరీ - ఇది జపాన్ వాళ్లకెంతో ఇష్టమైన పండుగ. ఏటా వేసవిలో ఘనంగా జరుగుతుంది. పురుషులంతా గోచీలాంటి ఆచ్ఛాదనను మాత్రమే ధరించి ఈ పండుగలో పాల్గొంటారు. దేవుడి సన్నిధిలో ఉంచిన రెండు పవిత్రమైన వెదురు ముక్కలను మత గురువు విసురుతాడు. అవి ఎవరికి చిక్కుతాయో వారు ఆ సంవత్సరమంతా సంతోషంగా ఉంటారని విశ్వాసం!
ఫెస్టా డెల్ కార్నుటో - రోమ్‌లోని రోకా కాన్టెరానో అనే పట్టణంలో ఏటా ఈ పండుగ జరుగుతుంది. ప్రేమలో మోసపోయినవారు మాత్రమే ఇందులో పాల్గొనాలి. వీళ్లందరికీ ఒక కొమ్ముల జతను ఇస్తారు. వాటిని ధరించి అందరూ వీధుల్లో ఊరేగింపులా తిరుగుతారు. తద్వారా తాము ఒంటరిగా ఉన్నామని, జంటను కోరుకుంటున్నామని తెలియజేస్తారు. చాలామందికి ఈ వేడుకలోనే జోడీ దొరుకుతుందట!