కనకమ్మకు నీరాజనం
వైభవంగా తొలి గురువారం పూజలు
లక్షకు పైబడి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
డాబాగార్డెన్స్ : ఉత్తరాంధ్రుల కల్పవల్లి, భక్తుల కొంగు బంగారం శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తొలి గురువారం పూజలను వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసోత్సవాలలో అమ్మవారి దర్శన భాగ్యం కోసం భక్తులు తపిస్తారు. అందునా గురువారం దర్శించుకునేందుకు జన సంద్రమై పోటెత్తుతారు. తొలి గురువారం లక్షమందికి పైగా భక్తులు కనకమ్మను దర్శించినట్టు అంచనా. బుధవారం అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడి మొదలైంది. క్యూలైన్లు టౌన్‌కొత్తరోడ్డును తాకాయి. దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. ఈ దఫా సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పించారు.
వీఐపీ పాసులకు భారీగా కోత పెట్టడంతో భక్తులకు ఇబ్బంది కలగలేదు. పాసుకు రూ.100 ధర నిర్ణయించారు. అవీ కూడా రెండు వేలు మాత్రమే జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశాల మేరకు ఇక్కడి నిబంధనలను కఠినతరం చేశారు. అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు భక్తుల తాకిడి సాధారణంగా కనిపించినా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దీ అధికంగా ఉంది.
సాయంత్రం కూడా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలి పూజను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ నిర్వహించగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం 10 గంటల ప్రాంతంలో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో హరికథా గానం భక్తులను అలరించింది.
తెల్లవారుజామున, సాయంత్రం అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు జరిపారు. స్వర్ణాభరణాలతో అలంకరించారు. ఆలయ మండపంలో శ్రీచక్రనవార్చన, శ్రీలక్ష్మీ హోమాలు, ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు. 24 గంటలూ ఆలయం తెరిచే ఉంచారు.
తోపులాటలు జరగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పా టు చేశారు. పోలీస్ బందోబస్తు పటిష్టం చేశారు. అగ్నిమాపక వాహనాన్ని ఆలయం సమీపంలోనే అందుబాటులో ఉంచారు. మొబైల్ టాయ్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నీటి సౌకర్యం లేకపోవడంతో కొంతమంది ఇబ్బందిపడ్డారు.
పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. కురుపాం మార్కెట్, పాతపోస్టాఫీస్‌కు వెళ్లే వారి కోసం టౌన్ కొత్తరోడ్డు వద్దనే ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి (ఘోషా ఆస్పత్రి) వద్ద స్టాపర్లను ఏర్పాటు చేసి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు.