- వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం చొరవతో..
మదనపల్లె సిటి: బతుకు భారంగా మారడంతో భార్యాబిడ్డల పోషణ కోసం కన్నవారిని, ఉన్న ఊరిని వదిలారు. ఉన్న కొద్దోగొప్పో పొలాలను అమ్మి, పుస్తెలను సైతం తాకట్టుపెట్టి ఆశల పల్లకిలో ఎడారి దేశాలకు పయనమయ్యారు. అయితే గల్ఫ్‌లో ఏజెంట్ల మోసాల బారినపడి అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. మరి కొందరేమో దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతూ దినదిన గండంగా కాలం నెట్టుకొస్తున్నారు. ఉన్నఫలంగా వచ్చేస్తే ఇక్కడి అప్పులు ఎలా తీరుతాయనే బెంగతో అక్కడే ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇలాంటివారి పక్షాన వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం నిలిచింది. గల్ఫ్‌లో వారు పడుతున్న బాధలను తమను కలిచివేశాయ ని, వారిని అన్ని విధాల ఆదుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కడప, రాజంపేట ఎంపీలు వైఎస్.అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం కేంద్ర విదేశాంగ, ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి గల్ఫ్‌లో సీమ వాసులు ఎదుర్కొం టున్న సమస్యలను, పడుతున్న బాధలను విన్నవించారు. వారిని ఆదుకోవాలని కోరారు. స్పందించిన కేంద్రం వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. దీంతో గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారి జీవితాల్లో ఆశలు చిగురించాయి.
ఎడారి దేశాలకు జిల్లా వాసులు
జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, పీలేరు, గుర్రంకొండ, వాల్మీకిపురం, పుంగనూరు తదితర నియోజకవర్గాల నుంచి దుబాయ్, మస్కట్, సౌదీ, ఓమన్, ఇరాక్ వంటి గల్ఫ్ దేశాలకు జీవనోపాధి కోసం వెళుతుంటారు. దాదాపు నాలుగు వేలకు పైగానే ఇక్కడి వారు గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారు. ఉన్న ఊరిలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, సాగు లాభసాటి కాకపోవడంతో చేసిన అప్పు లు తీర్చేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు గల్ఫ్‌బాట పడుతున్నారు.
అయితే కొందరు ఏజెంట్లు చేసే మోసాలతో వారు ఎడారి దేశాల్లో దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నా రు. మదనపల్లెకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఏళ్ల తరబడి సౌదీ జైలులోనే ఉన్నారు. మరికొందరైతే అక్కడి జైళ్లల్లో మగ్గుతున్నారు. ఇంకొందరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నా రు. దీంతో వారి కుటుంబాలు మరింత ఆందోళనకు గురవుతున్నాయి.
అందని ఆసరా
కొందరు ఏజెంట్లు, కొన్ని కంపెనీలు చేసిన మోసాలతో రూ.లక్షల అప్పులతో తిరిగి స్వగ్రామాలకు వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. గతంలో దుబాయి ప్రభుత్వం, ఇటీవల సౌదీ ప్రభుత్వం జారీ చేసిన నితాఖత్ చట్టాలతో వందలాది మంది స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి ఆసరా లేకుండాపోయింది. అందరికీ అప్పులు మిగిలాయి.
దీంతో అప్పులు తీర్చే మార్గాలు లేక నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. వీరికోసం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ మైనా చర్యలు తీసుకుని గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న తమ వారి ని కాపాడాలని బాధిత కుటుంబాల వారు కోరుతున్నారు. అలాగే తమ వారిని కాపాడేందుకు కోసం కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.