
వెలుగులు విర‘జమ్మి’
సాక్షి, సిటీబ్యూరో: తంగేడు, గునుగు, గడ్డి పూలతో తొమ్మిది రోజుల పాటు కనువిందు చేసిన రంగు రంగుల పూల బతుకమ్మల పండుగ ముగిసింది. సరదాల పండుగ దసరా వచ్చేంది. ఆనందోత్సాహాలను తెచ్చింది. దసరా అంటేనే ఒక పెద్ద ఉత్సవం. తెలంగాణ ప్రాంతంలో పుష్కలంగా పండిన మెట్ట పంటలకు ప్రతీక. ఏపుగా పెరిగిన జొన్న కర్రలను జెండాలుగా ఎత్తుకొని... బ్యాండు మేళాలతో వెళ్లి పాలపిట్టను చూసి విజయోత్సాహంతో కేరింతలు కొడతారు.
అక్కడి నుంచి నేరుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. పాపాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటారు. జమ్మి ఆకు, జొన్న కంకి, మారేడు పత్రిని (దీనిని బంగారంగా భావిస్తారు) దేవతలకు సమర్పించి, ఒకరికొకరు జమ్మి ఆకు చేతిలో పెట్టుకొని అలయి బలయి (ఆలింగనం) తీసుకొంటారు. పిల్లలైతే పెద్దల చేతుల్లో జమ్మి ఆకును పెట్టి పాదాభివందనం చేస్తారు. మనుషుల మధ్య కల్మషాలన్నింటినీ కడిగి పారేసి, ప్రేమ, ఆత్మీయత,అనురాగాలను పంచిపెట్టే పండుగ దసరా. గుండెల నిండా ఆర్తిని నింపుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకొనే క్షణాలు మరచిపోలేనివి.
పూజలు జరిగే ప్రాంతాలు
దసరా వేడుకల్లో భాగంగా నగర వాసులు జమ్మి చెట్టును సందర్శించి పూజ చేసేందుకు, ఆకులను తెచ్చుకొనేందుకు పలుచోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. కాలనీ సంఘాలు స్థానికంగా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రత్యేకంగా పెద్ద పెద్ద జమ్మి కొమ్మలను నాటి, ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. అవి
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్
ఖైరతాబాద్ చింతల్‌బస్తీ రాంలీలా గ్రౌండ్స్
అంబర్‌పేట్ పోలీస్ గ్రౌండ్స్
గోల్కొండ కోట ప్రాంగణం
సీతారాంబాగ్ దేవాలయం
ఆర్ కే పురం అష్టలక్ష్మీ దేవాలయం
జిల్లేల గూడ వేంకటేశ్వర దేవాలయం
సైదాబాద్ పూసబస్తీ
ఓల్డ్ మలక్‌పేట్
అక్బర్‌బాగ్