తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలంటారు కదా! మరి దేవుళ్లకి ఈ పూజలూ వ్రతాలూ ఎందుకు? తలిదండ్రులకి రోజూ నమస్కరిస్తే చాలుగా?!
భగవంతుడి పేరిట పూజలూ వ్రతాలూ చేస్తూ వాటిలో మునిగిపోయి వయసులో పెద్ద అయిన తల్లిదండ్రులకి సకాలంలో భోజనం పెట్టని పక్షంలో, అలాగే తలిదండ్రుల్ని సక్రమంగా గౌరవించని పక్షంలో ఈ వ్రతాలూ, పూజలూ వ్యర్థమే అని చెప్పడం వాళ్లని ప్రత్యక్ష దైవాలనడంలోని అంతరార్థం. తిండి తినని పక్షంలో వ్యాధి వికటించే పరిస్థితిలో తల్లిగాని తండ్రిగాని ఉంటే వాళ్లకి ప్రత్యేకమైన వంటని చేయించి ఆబ్దికం నాడైనా సరే మరో ప్రదేశంలో భుజింప చెయ్యాలని ధర్మశాస్త్రం నిశ్చయించి చెప్పింది.
ఏకలవ్యుని విషయంలో ద్రోణుడు ఎందుకలా చేశాడు?
ఏకలవ్యుడు ఒక ఆటవిక జాతి యువకుడు. ద్రోణాచార్యుని వద్ద విలువిద్యను అభ్యసించాలన్న తన కోరికను ద్రోణుడికి తెలియచేసాడు. కొన్ని కారణాల వల్ల ద్రోణుడు అతని కోరికను తిరస్కరించాడు. దాంతో ఏకలవ్యుడు బంకమట్టితో ద్రోణుని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సంపాదించాడు. ఒకసారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు తదితరులు అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్తవేషధారణతో ఏకలవ్యుడు కనిపించేసరికి గట్టిగా అరిచింది. కుక్క అరుపుకు చిరాకు కలిగిన ఏకలవ్యుడు ఆ కుక్క నోరు తెరచి. తిరిగి మూసుకునే వ్యవధిలో దాని నోటిలోనికి 7 బాణాలు వేసాడు. తరువాత ఆ కుక్క అత్యంత దయనీయంగా అర్జునునికి కనిపించింది.
విచారించగా ఆ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలిసింది. ద్రోణాచార్యులు ఏకలవ్యుడిని చూడటానికి వెళ్లారు. ఏకలవ్యుడు తన గురువు గారికి ఘనంగా స్వాగతం పలికాడు. ఏకలవ్యుడి విలువిద్య చూసి ఎంతో సంతోషించారు. అయితే, విలువిద్యలో ఎంతో నైపుణ్యం ఉండి కూడా ధర్మా«దర్మ విచక్షణ లేకుండా తనను చూసి అరచింది అనే చిన్న కారణానికి దాని నోట్లోకి బాణాలు వేసి మూగజీవం మీద తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఏకలవ్యుడి వల్ల లోకానికి, ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుందని భావించిన ద్రోణుడు, రాబోయే ప్రమాదాలను ముందే నివారించటానికి ఏకలవ్యుని కుడిచేతి బొటన వేలుని దక్షిణగా ఇమ్మని అడిగాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడిచేతి బొటనవేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు. ద్రోణుడు ఆశించినట్లుగానే ఏకలవ్యుడు ఇక తన విలువిద్యను ప్రదర్శించలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment