ఆసుపత్రికి పక్షవాతం | No working in government hospital | Sakshi
Sakshi News home page

ఆసుపత్రికి పక్షవాతం

Published Sat, Sep 12 2015 2:41 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

ఆసుపత్రికి పక్షవాతం - Sakshi

ఆసుపత్రికి పక్షవాతం

జిల్లాలోనే మొదటిది... ఒకేఒకటి. పక్షవాతానికి చికిత్సలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి. కానీ... మూడేళ్లుగా వైద్య సేవలు లేక... చికిత్సలు అందించక పడకేసింది తూప్రాన్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ దవాఖానాకు ఇప్పుడు పక్షవాతం వచ్చింది. అన్నీ ఉన్నా... ఏదీ పనిచేయక నిరుపయోగంగా పడివుంది.
 
- మూడేళ్లుగా పడకేసిన ఆయుర్వేద దవాఖానా  
- వైద్య సేవలు లేక రోగుల అవస్థలు
 

మండల కేంద్రంలోని ఆయుర్వేద ఆసుపత్రి చరిత్ర ఘనం.. ప్రస్తుతం ఓ శాపం. వైద్యం కోసం మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి రోగులు చికిత్స కోసం ఇక్కడికి వచ్చేవారు. పక్షవాతంతో పాటు ఇతర దీర్ఘకాలిక రోగాలకు ఈ దవాఖానా ప్రసిద్ధి. ఎప్పుడూ కిటకిటలాడుతుండేది. కానీ.. నేడు వెలవెలబోతోంది. తుప్పుపట్టిన మంచాలు... చెత్తకుప్పలా మారిన వైద్య పరికరాలతో వెక్కిరిస్తోంది. 1951 అక్టోబర్ 18న తొలుత ఇక్కడ ఆయుర్వేద డిస్పెన్సరీ ఏర్పాటు చేశారు. మంచి స్పందన రావడంతో... 1964లో నాలుగు పడకలతో... ఆ తరువాత 1984లో 9 పడకల ఆసుపత్రిగా స్థాయి పెరిగింది. రాష్ట్రంలో ఉన్న ఏడు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రుల్లో ఇదీ ఒకటి. జిల్లాలో దీనికి అనుబంధంగా 24 ఆయుర్వేద డిస్పెన్సరీలు ఉన్నాయి.
 
సిబ్బంది కొరత...
ఈ ఆసుపత్రిలో మొత్తం 15 పోస్టులున్నాయి. సీనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, కాంపౌండర్, ఇద్దరు ఎఫ్‌ఎస్‌ఓలు, కుక్, అటెండర్, ఇద్దరు పీటీఎస్, దోభీలను ప్రభుత్వం నియమించింది. కానీ ప్రస్తుతం సగం మంది మాత్రమే విధుల్లో ఉన్నారు.  
 
ఆకస్మిక తనిఖీతో పతనం...
దశాబ్దాల సేవలతో ఇంతింతై పెరిగిన ఆసుపత్రి ఒక్కసారిగా పతనమైంది. 2012 మార్చి 15న రాష్ట్ర హోమియో అడిషనల్ డెరైక్టర్ సత్యనారయణరెడ్డి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యుడితో పాటు సిబ్బంది ఆ సమయంలో విధుల్లో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆరుగురిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆయుష్ కమిషనర్ అరుణ ఆదేశాలు జారీ చేశారు. అది మొదలు... ఇక్కడ వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఉన్నట్టుండి సిబ్బంది తగ్గిపోవడంతో ఇన్‌పేషెంట్లు భోజనం, వైద్యం అందక ఆసుపత్రి వదిలి పారిపోయారు. రెగ్యులర్ సిబ్బందిలో సగం మంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు.

వారు కూడా చుట్టం చూపుగా వచ్చి వెళుతున్నట్టు తెలిసింది. వచ్చినా రిజిస్టర్‌లో సంతకానికే వారి సేవలు పరిమితమవుతున్నాయి. అందరికీ అందుబాటులో ఉన్న ఈ ఆసుపత్రి పడకేయడంతో రోగులు, ముఖ్యంగా పక్షవాతం వచ్చినవారు నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భం, అందునా సీఎం కేసీఆర్ నియోజకవర్గం కావడంతో దీనికి పూర్వ వైభవం వస్తుందని భావించిన చుట్టుపక్కల వాసులకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి ఈ దవాఖానాకు పట్టిన రోగాన్ని వదిలించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement