
సాక్షి, హైదరాబాద్ : చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రి తరలింపుకు నిరసనగా ఆందోళన చేపట్టిన విద్యార్థినిపై ఓ పోలీసు కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. సౌత్ జోన్ డీసీసీ అంబర్ కిషోర్ ఝా స్పందించారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి తరలింపును నిరసిస్తూ ఆందోళన చేయడంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే అక్కడ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించాడని వార్తలు వస్తున్నాయని చెప్పారు. వీడియోలు పరిశీలించి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు.
అలాగే కానిస్టేబుల్ అది ఉద్దేశపూర్వకంగా చేశారా, లేక విధి నిర్వహణలో భాగంగా అలా జరిగిందా అనే దానిపై విచారణ జరిపి చర్యలు చేపడతామని వెల్లడించారు. ఆ వీడియోలను టీవీల్లో ప్రసారం చేయకుండా తాత్కాలికంగా నిలపివేయాలని కోరారు. విద్యార్థులు ఆందోళన చేసేటప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment