పెరవలి మండలం కానూరులో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల
జిల్లాలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలు దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మందులు లేక రోగులు, జీతాలు అందక సిబ్బంది నిర్వేదంలో కూరుకుపోతున్నారు. పైగా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా వైద్యుల పోస్టులు భర్తీ చేయడం లేదు. జిల్లాలో 92 వైద్యశాలల్లోనూ ఏదో సమస్య. దీంతో ఆయర్వేద కేంద్రాల ఆయుష్ గాల్లో దీపంలా మారింది. –
పెరవలి: జిల్లాలో 92 వైద్యశాలల్లోనూ రెగ్యులర్ ఆసుపత్రులు 49. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పథకం ద్వారా మండల కేంద్రాలలో పీహెచ్‌సీల వద్ద ఏర్పాటు చేసినవి మరో 43 ఉన్నాయి. మండలాల్లో ఏర్పాటు చేసిన వాటిలో నాలుగేళ్లుగా డాక్టర్లే లేకపోవటంతో రోగులు నానా అగచాట్లు పడుతున్నారు. ప్రస్తుతం పలుచోట్ల నర్సులే వైద్యసేవలు అందిస్తున్నారు. ఆయుర్వేద ఆసుపత్రులను మండల కేంద్రాల్లో 2009లో ప్రారంభించారు. అన్ని ఆసుపత్రులలో వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించారు. వీరు చేస్తోన్న సేవలకు ప్రజల్లో మంచి స్పందన రావటంతో ప్రభుత్వం వీరందరినీ పర్మినెంట్ చేసింది. అయితే కాలక్రమంలో బదిలీలు వంటి కారణాలతో ఖాళీ అయిన వైద్యుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీంతో వైద్యశాలలు వెలవెలబోతున్నాయి.
ఉద్యోగ భద్రత కరువై..
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టు సిబ్బంది అవస్థలు చెప్పలేని విధంగా మారాయి. ఉద్యోగం ఉంటుందో లేదో తెలియక అభద్రతా భావంతో విధులు నిర్వహిస్తున్నారు. మందులు సరఫరా సక్రమంగా చేయకపోవటంతో ఉన్న మందులతోనే రోగులకు సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం ఈ ఆసుపత్రులను స్థానిక పీహెచ్‌సీ డాక్టర్ ఆధీనంలో ఉంచాలని ఆదేశాలు ఇవ్వటంతో సమస్య మొదలైంది. సెలవు తీసుకోవాలంటే డాక్టరుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరి కావటంతో ఒకరు ఇస్తుంటే మరొకరు తిరస్కరించటంతో నానా అగచాట్లు పడుతున్నారు. రెండేళ్ల క్రితం కాళ్ల ఆయుర్వేద ఆసుపత్రిలోని ఒకరికి సొంత అత్త చనిపోతే సెలవు ఇవ్వటానికి అక్కడ పీహెచ్‌సీ డాక్టర్ నిరాకరించటం విమర్శలకు తావిచ్చింది.
జీతం లేకుండా ఎన్నాళ్లో..
ప్రభుత్వం ఆయుర్వేద ఆసుపత్రుల్లో పనిచేస్తోన్న సిబ్బందికి 14 నెలలుగా జీతాలు అందించడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేని చోట సిబ్బందికి జీతాలు ఇవ్వవద్దని మౌఖిక ఆదేశాలు ఇవ్వటంతో జిల్లాలో 76 మంది సిబ్బంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్రంలో ఈ ఆసుపత్రులో పనిచేస్తోన్న 850 మంది సిబ్బంది జీతాల కోసం ఉద్యమబాట పట్టారు.
కేంద్రం నుంచి 90 శాతం నిధులు!
ఈ ఆయుర్వేద ఆసుపత్రుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు అందిస్తుండగా మిగిలిన 10 శాతం నిధులను ఇచ్చి వీటిని నిర్వహించవలసిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
వైద్యులు లేని మాట వాస్తవం: ఆర్‌డీడీ
దీనిపై రీజనల్ డిప్యూటీ డైరెక్టర్(ఆర్‌డీడీ)ప్రసాద్‌ను వివరణ కోరగా ఆయుర్వేద ఆసుపత్రుల్లో వైద్యులు లేని మాట వాస్తవమే అన్నారు. అందుకోసమే డాక్టర్లు లేని చోట సిబ్బందికి జీతాలు ఇవ్వటం లేదని చెప్పడం విశేషం. వీరికి ప్రతి ఏడాది ఇచ్చే రెన్యూవల్ కూడా చేయలేదని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకే చర్యలు ఉంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment