సాక్షి, హైదరాబాద్: అనారోగ్యానికి గురైన నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.మనోహర్ పూర్తి అరోగ్యంతో తిరిగి వచ్చారు. సోమవారం ఆయన డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన గుండెపోటు రావడంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. అప్పటి వరకు నిమ్స్ డీన్ డాక్టర్ ఎస్.రామ్మూర్తికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 2వ తేదీతో ఆయన ఇంచార్జి డైరెక్టర్ గడువు ముగియడంతో మనోహర్ తిరిగి బాధ్యతలను చేపట్టారు.
వివాద రహితుడిగా ముద్రపడిన మనోహర్ తాజాగా వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ వైద్య ప్రమాణాలను సొంతం చేసుకున్న నిమ్స్‌కు డైరెక్టర్ మాత్రం తనకు అనారోగ్యం వస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ వ్యవహారాన్ని నిమ్స్ ఉద్యోగ వర్గాలు సహా రాజకీయపక్షాలు సైతం తీవ్రంగా పరిగణించాయి. ఎమర్జెన్సీ సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందడం తప్పుకాదని.. అయితే కోలుకున్న తర్వాత కూడా అదే ఆస్పత్రిలో వైద్యసేవలు పొందడం మాత్రం కచ్చితంగా నిమ్స్ ఆస్పత్రిని అవమానించడమేనంటూ మండిపడుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మనోహర్ స్థానంలో కొత్త డైరెక్టర్‌ని నియమించేందుకు సమాలోచనలు చేసింది. ఒక దశలో అర్హులైన వారి ఎంపికకు సెర్చ్ కమిటీని వేసేందుకు సైతం ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అయితే అధికారికంగా మనోహర్ తన పదవి నుంచి వైదొలగకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మనోహర్ మళ్లీ బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చదవండి: (Hyderabad Doctor: పెళ్లికి ముందే మరొక యువతితో సంబంధం.. అయితే..)
Comments
Please login to add a commentAdd a comment