స్వైన్‌ఫ్లూపై మరిన్ని పరిశోధనలు
నిపుణులతో కమిటీ వేసే ఆలోచన
తెలంగాణలోనే కాదు దేశమంతా ఫ్లూ విస్తరించింది
స్వైన్‌ఫ్లూ నోడల్ అధికారి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్వైన్‌ఫ్లూపై పరిశో ధనలకు చర్యలు తీసుకుంటోంది. చలికాలంలో విస్తరించాల్సిన స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) వైరస్ ఎండాకాలంలోనూ మృత్యుఘంటికలు మోగి స్తోంది. దీంతో వైరస్ బలోపేతం కావడానికి గల కారణాలను అన్వేషించేందుకు నిపుణులతో పరిశోధనలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ అంశంపై ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని భావిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని రోగుల నుంచి నమూనాలు సేకరించి పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపింది. అయితే, రిపోర్టులు రావాల్సి ఉంది.
బుధవారం ఇక్కడ నిమ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో తెలంగాణ రాష్ట్ర స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ పలు విషయాలు వెల్లడించారు. తెలంగాణలోనే కాకుండా స్వైన్‌ఫ్లూ వైరస్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉందని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 7,103 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 217 మంది చనిపోయినట్లు తెలిపారు. అత్యధికంగా మహారాష్ట్రలో 101 మంది చనిపోయినట్లు తెలిపారు.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వైరస్ విజృంభిస్తుండటానికి గల కారణాలేమిటి? వైరస్ ఏమైనా రూపాంతరం చెందిందా? లేక మరేదైన ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పరిశోధనలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ కోసం ప్రస్తుతం నగరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్(ఐపీఎం) పని చేస్తుందని, త్వరలో ఫీవర్ ఆస్పత్రి ఆవరణలో మరో వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఆందోళన అనవసరం
స్వైన్‌ఫ్లూ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ మనోహర్ స్పష్టం చేశారు. అయితే, వ్యక్తిగత పరిశుభ్రత, కనీస జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారి నుంచి కాపాడుకోవచ్చని సూచించారు. మందు లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు.