సర్పంచ్, ఉపసర్పంచ్‌ల నిర్బంధం
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ శివారులోని సెజ్ భూములను అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపిస్తూ సోమవారం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను గ్రామస్తులు నిర్బంధించారు. వివరాలిలా ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత కేంద్రం (సెజ్) లో రెండు కులసంఘాలకు స్థలాలు ఇచ్చేందుకు గాను భూములను పరిశీలించేందుకు సోమవారం తహసీల్దార్ అనిల్‌కుమార్‌తో పాటు సర్పంచ్ మూడ సుమలత వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి ఆందోళన చేశారు.
గ్రామస్తులకు, పాలకవర్గ సిబ్బందికి తెలియకుండా సర్పంచ్ భర్త మూడ మహేందర్ భూములను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన చేశారు. అంతేగాకుండా పాలకవర్గానికి, గ్రామస్తులకు తెలియకుండా గ్రామపంచాయతీ తీర్మానం కాపీని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రాంతం వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో తమ విలువైన భూములను సెజ్‌కు అప్పగించామని ఇప్పుడు తమకు తెలియకుండా భూములను అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయాన్ని మాట్లాడేందుకు గాను గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకున్న గ్రామ సర్పంచ్ మూడ సుమలత, ఉప సర్పంచ్ మాయాపురం శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రమేష్, కారోబార్ కిషన్‌లను గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం గదిలో నిర్బంధించి తాళం వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు లక్కంపల్లి గ్రామానికి చేరుకుని గ్రామస్తులు, యువకులతో మాట్లాడి వారిని శాంతిప జేసే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికురులు సమస్యను తేల్చేంత వరకు వీరిని వదిలి పెట్టేది లేదని పోలీసులతో గ్రామస్తులు, యువకులు వాగ్వివాదం చేశారు. ఆందోళన చేసిన వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.